
టాలెంట్ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. ప్రతిభ ఉండాలే గానీ ప్రపంచమంతా మనవైపు చూసేలా చేసుకోవచ్చు. టాలెంట్ ఉన్నా ఎక్కడ, ఎలా ప్రదర్శించాలనే మీమాంస ఇదివరటి రోజుల్లో ఉండేది. ఇప్పుడా సంశయం అక్కర్లేదు. సోషల్ మీడియా వేదికగా సామాన్యులు సైతం తమ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. తమ టాలెంట్‌తో జనాన్ని ఆకట్టుకున్న వారు సెలబ్రిటీలుగా, ఇన్‌ఫ్లుయెన్సర్లుగా మారుతున్నారు. కంటెంట్ (Content) బాగుంటే చాలు జనం ఆదరిస్తున్నారు.
తాజాగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన కాంచన్ అగర్వత్ అనే మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రాతో సహా ఎంతో మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియో క్లిప్‌కు ఇప్పటివరకు 3.8 మిలియన్లకు పైగా వ్యూస్, దాదాపు 2 లక్షల లైకులు వచ్చాయి.
వీడియోలో ఏముందంటే..?
కొలంబియా పాప్ సింగర్ షకీరా 2006 గ్లోబల్ హిట్ సాంగ్‌కు కాంచన్ అగర్వత్ చేసిన స్టెప్పులు వీక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయ చీర కట్టుతో పాప్ సాంగ్‌కు తనదైన శైలిలో డాన్స్ (Dance) చేశారామె. చీర, ఘున్‌ఘాట్‌ను బ్యాలెన్స్ చేస్తూ.. షకీరా సిగ్నేచర్ హుక్ స్టెప్‌లను చూడముచ్చటగా ప్రదర్శించడంతో వీక్షకులు ఫిదా అవుతున్నారు.
చదవండి: రిసెప్షన్‌లో డాన్స్ చేస్తూ ప్రాణాలు వదిలిన మహిళ
నెటిజనుల ప్రశంసలు
కాంచన్ అగర్వత్ డాన్స్‌పై నెటిజనులు (Netizens) ప్రశంసలు కురిపించారు. ఆమె నృత్యం చేసే విధానం ఎంతో పద్ధతిగా ఉందని, డాన్స్‌తో పాటు చీరను బ్యాలెన్స్ చేసిన తీరు బాగుందని నెటిజనులు పొగిడారు. 'అలసటగా ఉన్నప్పుడు ఈ రీల్ చూశాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పటికే చాలాసార్లు చూశాన'ని ఒక నెటిజన్ వెల్లడించారు.