
ఆ మోడల్ అనుసరణకు కేంద్రంపై ఒత్తిడి తేవాలి
కాంగ్రెస్ నేతలకు ఖర్గే, రాహుల్ దిశానిర్దేశం
రాష్ట్రంలో నిర్వహించిన సర్వేపై మహేశ్‌గౌడ్ వివరణ
అమలుకు తీసుకుంటున్న చర్యలను వివరించిన వైనం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో సామాజిక న్యాయా న్ని సాధించే దిశగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేను దేశ వ్యాప్తంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు, పార్టీ అధికార ప్రతినిధులకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సూచించారు. తెలంగాణ తరహా మోడల్‌ను అనుసరించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. భారత్ జోడో పాదయాత్ర సందర్భంగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం జనగణన చేసి చూపించి దేశానికే మార్గదర్శిగా నిలిచిన అంశాన్ని ప్రజలకు వివరించాలని, ఈ విషయంలో కాంగ్రెస్‌కు ఉన్న నిబద్ధతను చాటి చెప్పాలని సూచించారు.
దేశంలోని అణగారిన వర్గాలకు విద్య, ఉపాధి, రాజకీయ అంశాల్లో న్యాయం చేసేలా జనగణనలో భాగంగా కులగణను ఎప్పట్లోగా కేంద్రం పూర్తి చేస్తుందో చెప్పాలంటూ బలంగా డిమాండ్ చేయాలని అన్నారు. శుక్రవారం ఇందిరా భవన్‌లోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధులు, ముఖ్య నేతలతో కులగణన అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాహుల్‌గాంధీ పాల్గొనగా, ఖర్గే వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో కులగణన సర్వే నిర్వహించిన తీరు, ప్రశ్నాపత్రం, వివిధ వర్గాల భాగస్వామ్యం, అసెంబ్లీ తీర్మానం వంటి అంశాలను పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అత్యంత పారదర్శకంగా, పూర్తి నిబద్ధతతో పూర్తి చేయడమే కాకుండా విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో దీనిని అమలు పరిచేలా తీసుకుంటున్న చర్యలను సమావేశం దృష్టికి తెచ్చారు.
సైద్ధాంతిక నిబద్ధతకు నిదర్శనం: ఖర్గే
సమావేశంలో ప్రారంబోపన్యాసం చేసిన ఖర్గే.. తెలంగాణలో కులగణన చేపట్టడాన్ని మరోసారి అభినందించారు. ‘తెలంగాణలో జరిగిన కుల సర్వే సమాజం, నిపుణులు, ప్రభుత్వం అందరూ పాల్గొన్న ఒక నమూనాను ప్రదర్శించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రజా, స్నేహపూర్వక, పారదర్శక నమూనాను అవలంబించాలని మేము కోరుకుంటున్నాం. ఈ ప్రక్రియలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం..’అని అన్నారు.
కులగణన సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటం మాత్రమే కాదని, రాజ్యాంగం ఆత్మను కాపాడుకునే పోరాటమని పేర్కొన్నారు. కులగణన అంశాన్ని కేవలం ఎన్నికల అంశంగా పరిగణించవద్దని, ఇది పార్టీ సైద్ధాంతిక నిబద్ధతకు నిదర్శనం అన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. పార్టీ అధికార ప్రతినిధులుగా కులగణన అంశాన్ని వాస్తవాలతో, సున్నితత్వంతో, భయం లేకుండా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఖర్గే సూచించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో దళిత, ఓబీసీ, ఆదివాసీ విద్యార్థులకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగంలోని ఆరి్టకల్ 15(5)ని వెంటనే అమలు చేసేలా గొంతును పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు.
ప్రజాస్వామ్యం నైతిక బాధ్యత: రాహుల్
పార్టీ మేనిఫెస్టోలో, పార్లమెంటులో, వీధుల్లో, సామాజిక న్యాయం గురించి చర్చించాల్సిన ప్రతి వేదికపై కాంగ్రెస్ దీనిని లేవనెత్తిందని రాహుల్‌గాంధీ గుర్తు చేశారు. తాము హామీ ఇచి్చనట్లుగా తెలంగాణలో అమలు చేసి చూపామన్నారు. కులగణన భారత ప్రజాస్వామ్యం నైతిక బాధ్యత అని పేర్కొన్నారు. కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచి్చన సందర్భంగా మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ.. కులగణనతో రాష్ట్రంలో కులాల వారీగా లెక్కలు తేలాయని, వీటి ఆధారంగా ఎవరికి ఎంత రిజర్వేషన్లు దక్కాలో తెలిసిందని అన్నారు. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానించి కేంద్రం ఆమోదానికి పంపామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు కృషి చేస్తున్నామన్నారు.