కులగణన.. దేశానికి ఎక్స్‌రే: రాహుల్‌ | Sakshi
Sakshi News home page

కులగణన.. దేశానికి ఎక్స్‌రే: రాహుల్‌

Published Mon, Feb 19 2024 5:14 AM

Rahul Gandhi resumes yatra from Prayagraj, raises caste census - Sakshi

ప్రయాగరాజ్‌/వయనాడ్‌: దేశ జనాభాలో ఓబీసీలు, దళితులు, గిరిజనులు కలిపి 73% వరకు ఉన్నప్పటికీ వారు యజమానులుగా ఉన్న కంపెనీల్లో టాప్‌–200లో ఒక్కటి కూడా లేదని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ చెప్పారు. దేశానికి ఎక్స్‌ రే వంటి కులగణనతో ప్రతి ఒక్కటీ తేటతెల్లమవుతుందని చెప్పారు. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో భాగంగా ఆదివారం ప్రయాగ్‌రాజ్‌లో స్వరాజ్‌భవన్‌ వద్ద జరిగిన ర్యాలీలో మాట్లాడారు.

ఎవరి జనాభా ఎంతో తెలియడానికి కులగణన ఆయుధం వంటిది. దేశ సంపదలో మీ వాటా ఎంతో తెలుసుకోవచ్చు. దేశంలోని 73 శాతం జనాభా చేతుల్లో ఎంత సంపద ఉందో తెలుస్తుంది. ఈ కులాలకు సంబంధించిన ప్రతి ఒక్కటీ వెల్లడవుతుంది’అని రాహుల్‌ పేర్కొన్నారు. బడా పారిశ్రామికవేత్తల రుణాలను రద్దు చేసిన ప్రభుత్వం, రైతుల రుణాలను మాత్రం మాఫీ చేయదని విమర్శించారు. పారిశ్రామిక వేత్తలకుకోట్లాది రూపాయల రుణాలను క్షణాల్లోనే మంజూరు చేసే బ్యాంకులు, దళితులు, వెనుకబడిన కులాల వారిని మాత్రం దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదని ఆరోపించారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు అంటే అర్థం నిరుద్యోగులకు డబుల్‌ దెబ్బ అని యూపీలోని బీజేపీ సర్కారునుద్దేశించి రాహుల్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

వయనాడ్‌లో పర్యటన..
రాహుల్‌ ఆదివారం ఉదయం కేరళలోని సొంత నియోజకవర్గం వయనాడ్‌లో పర్యటించారు. ఇటీవల ఏనుగుల దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. వారికి అన్నివిధాలా అండగా  ఉంటానని చెప్పారు. వారికి పరిహారాన్ని సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను కోరారు.
ఆదివారం ప్రయాగ్‌రాజ్‌లో భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో రాహుల్‌

 
Advertisement
 
Advertisement