అడ్డంగా దొరికిపోయిన రాఘవ్‌ చద్దా! | Raghav Chadha caught with fake followers | Sakshi
Sakshi News home page

అడ్డంగా దొరికిపోయిన రాఘవ్‌ చద్దా!

Apr 28 2026 1:58 PM | Updated on Apr 28 2026 2:05 PM

Raghav Chadha caught with fake followers

రాజకీయాల్లో మార్పులు సాధారణమే. కానీ ఆ మార్పులు డిజిటల్‌ యుగంలో ప్రజల నమ్మకాన్ని, నేతల ఇమేజ్‌ను ఒక్కసారిగా కుదిపేస్తాయి. అందుకు రాఘవ్‌ చద్దానే ఉదాహరణ.  ఆమ్ ఆద్మీ పార్టీలో యువ నేతగా ఎదిగిన చద్దా.. బీజేపీలో చేరడానికి జెన్‌జీ జీర్ణించుకోలేకపోయింది. #UnfollowRaghavChadha అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతూ.. లక్షలాది ఫాలోవర్లు ఆయన్ని వదిలి వెళ్లిపోతున్నారు. తద్వారా దేశంలోనే అతిపెద్ద డిజిటల్‌ నిరసనకు ఆయన కారణమయ్యారు. 

చద్దా ఆప్‌ ఉన్నప్పుడు యువతకు దగ్గరగా ఉన్న నాయకుడిగా, మరీ ముఖ్యంగా సాధారణ సమస్యలపై మాట్లాడే వ్యక్తిగా ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ ఏర్పరుచుకున్నారు. కానీ ఆప్‌ను తిడుతూ బీజేపీలో చేరిన వెంటనే ఆయనపై విశ్వాసం ఉంచిన యువతలో నిరాశ, కోపం వ్యక్తమైంది. ఈ నిర్ణయం ఆయన రాజకీయ భవిష్యత్తును మాత్రమే కాకుండా, సోషల్‌ మీడియాలో ఆయనకు ఉన్న ప్రజాదరణను కూడా గణనీయంగా ప్రభావితం చేసింది.

కేవలం 24 గంటల్లోనే 1 మిలియన్‌కి(10 లక్షల మందికి) పైగా ఫాలోవర్స్ తగ్గిపోయారు. ఇప్పటిదాకా మొత్తం 2.3 మిలియన్ల మంది అన్‌ఫాలో చేశారు. ఇంకా అవుతూనే ఉన్నారు. జెన్‌జీ ఐకాన్‌గా పేరు పొందిన రాఘవ్‌ చద్దా పార్టీ మారడాన్ని యువత నమ్మక ద్రోహంగా ఫీలవ్వడమే ఈ ఫలితమని స్పష్టమవుతోంది. అయితే..

ఈ పరిణామం తర్వాత ప్రముఖ యూట్యూబర్‌ ధ్రువ్‌ రతీ ఓ సంచలన వీడియో విడుదల చేశారు. డ్యామేజ్‌ కంట్రోల్‌కి దిగిన రాఘవ్‌ చద్దా.. ఫాలోవర్లను కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ కొన్ని ఆధారాలు చూపించాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అదీ ఈ మధ్యే క్రియేట్‌ చేసిన అకౌంట్ల ద్వారా రాఘవ్‌ చద్దాను ఫాలో చేయిస్తున్నారని.. వాటిలో పోస్టులు.. ప్రొఫైల్ ఫోటోలు.. ఎలాంటి ఎంగేజ్‌మెంట్ లేదని.. కేవలం బాట్స్ (bots) ద్వారా ఫాలోవర్స్ సంఖ్యను కృత్రిమంగా పెంచే ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. 

నిజమైన ప్రజాదరణను నకిలీ ఫాలోవర్లతో కాపాడలేరు అని రతీ ఆ వీడియో చేయడం ఈ చర్చను మరింత వేడెక్కించింది. ఈ వీడియోతో సోషల్‌ మీడియాలో రాఘవ్‌ చద్దా విశ్వసనీయతపై పెద్ద ప్రశ్నలు తలెత్తాయి. 

సోషల్‌ మీడియా కాలంలో.. నాయకుల విశ్వసనీయత కేవలం సభల్లో ఇచ్చే ప్రసంగాలపై ఆధారపడదు. వారి డిజిటల్‌ ఇమేజ్‌, ప్రజలతో ఉన్న అనుబంధం, ఫాలోవర్ల ప్రతిస్పందన కూడా ముఖ్యమే. రాఘవ్‌ చద్దా కేసు.. సోషల్‌ మీడియా యుగంలో ప్రజల నమ్మకం ఎంత త్వరగా మారిపోతుందో, డిజిటల్‌ ఇమేజ్‌ ఎంత కీలకమో గుర్తు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement