
పలు జిల్లాల్లో కర్ఫ్యూ విదింపు
మొబైల్, ఇంటర్నెట్ సేవలు రద్దు
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. మొయితీ వర్గం నాయకులను పోలీసులు శనివారం అరెస్టు చేయడంతో ఆ వర్గం ప్రజలు ఆదివారం వీధుల్లోకి వచ్చారు. నిరసనలతో హోరెత్తించారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. నిషేధాజ్ఞలు లెక్కచేయకుండా ఆందోళనలు చేశారు. రోడ్లపై టైర్లు వేసి దహనం చేశారు. దాంతో ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్ జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా దళాల రాకపోకలు అడ్డుకొనేందుకు రోడ్లు తవ్వేశారు.
దుకాణాలపై దాడులకు దిగారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. తమ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాజధాని ఇంఫాల్‌లో కొందరు ఆత్మాహుతికి ప్రయత్నించినట్లు తెలిసింది. ముందు జాగ్రత్తగా ఇంఫాల్ లోయలోని ఐదు జిల్లాల్లో ప్రభుత్వం మొబైల్, ఇంటర్నెట్ సేవలు రద్దు చేసింది. కొన్నిచోట్ల కర్ఫ్యూ సైతం విధించింది. ఆంక్షలు ఐదు రోజులపాటు అమల్లో ఉంటాయని ప్రకటించింది.
మరోవైపు మణిపూర్ గవర్నర్ అజయ్‌కుమార్ భల్లా రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఘర్షణలు కొనసాగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొందరు ఎమ్మెల్యేలు రాజభవన్‌లో గవర్నర్‌ను కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు ఆయనకు వివరించారు. మరోవైపు అస్సాంలోని జిరిబామ్ జిల్లాలోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి.
మొయితీ వర్గానికి చెందిన అరంబాయ్ తెంగోల్ తెగ కీలక నాయకుడితోపాటు మరికొందరు సభ్యులు పోలీసులు శనివారం అరెస్టు చేయడం మణిపూర్, అస్సాంలో ఘర్షణలకు దారితీసింది. ఆ కీలక నాయకుడు కానన్ సింగ్ అంటున్నారు. అతడికి మొయితీల్లో గట్టి పట్టుంది. మణిపూర్‌లో 2023 నుంచి మొయితీలు, కుకీల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో 260 మందికిపైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.సీఎం బీరేన్‌సింగ్ రాజీనామా చేయడంతో ఫిబ్రవరి నుంచి రాష్ట్రపతి పాలన సాగుతోంది.
ఇది కూడా చదవండి: ‘డెమోక్రాట్లకు నిధులిస్తే బాగోదు’.. మస్క్‌కు ట్రంప్ వార్నింగ్