అస్సాంలో మూడోసారి.. మేమే! | Prime Minister Narendra Modi addressed rallies in Assam | Sakshi
Sakshi News home page

అస్సాంలో మూడోసారి.. మేమే!

Apr 2 2026 4:26 AM | Updated on Apr 2 2026 7:11 AM

Prime Minister Narendra Modi addressed rallies in Assam

కాంగ్రెస్‌ యువరాజుకు వందోసారి ఓటమి తథ్యం  

అస్సాం ఎన్నికల ప్రచారంలో తేల్చిచెప్పిన ప్రధాని మోదీ  

గువాహటి: అస్సాంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే చొరబాటుదార్ల రక్షణ కోసం చట్టం తీసుకొస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ కుట్రలను సాగనిచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఆయన బుధవారం అస్సాంలో పర్యటించారు. ధెమా జీ జిల్లాలోని గోగాముఖ్, బిశ్వనాథ్‌ జిల్లాలోని బెహాలీలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. 

మెజార్టీ ప్రజల ను మైనార్టిలుగా మార్చేసి, చొరబాటుదార్లను శాశ్వతంగా ఓటుబ్యాంకుగా మార్చుకోవడమే కాంగ్రెస్‌ అసలు లక్ష్యమని ధ్వజమెత్తారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాకముందు చొరబాటుదార్ల కోసం కేంద్రంలో చట్టం తీసుకురావడానికి కాంగ్రెస్‌ ప్రయతి్నంచిందని గుర్తుచేశారు. ఆ పార్టీ కుతంత్రాలను ఎన్డీయే అడ్డుకుందని వెల్లడించారు. ఇప్పుడు కూడా చొరబాటుదార్లను కాపాడుతామంటూ కాంగ్రెస్‌ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారని విమర్శించారు. దేశ విభజన సమయంలో ముస్లిం లీగ్‌ చేసినట్టుగానే నేడు కాంగ్రెస్‌ సైతం సమాజాన్ని ముక్కలు చేయాలని చూస్తోందని ఆరోపించారు.

భ్రష్టాచార్‌ కీ జనని కాంగ్రెస్‌  
‘‘ఓట్ల ఏకీకరణపై బీజేపీకి విశ్వాసం లేదు. మేము నమ్మే సూత్రం సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్‌ మాత్రమే. అభివృద్ధికి, సాంస్కృతిక వారసత్వానికి ఓటు వేయాలి. అస్సాంను మరింత అభివృద్ధి చేసే బాధ్యత మాదే. రాష్ట్రంలో హ్యాట్రిక్‌ సాధించబోతున్నాం. ప్రజల ఆశీస్సులతో ఈ ఎన్నికల్లో నెగ్గి వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్‌ యువరాజు(రాహుల్‌ గాం«దీ)కి వందోసారి కూడా ఓటమి తప్పదు. 

యువతకు మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేలా బీజేపీ మేనిఫెస్టో రూపొందించాం. అస్సాంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు వాటిని ఉపయోగించుకోలేదు. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిపెట్టలేదు. బీజేపీ అధికారంలోకి వచి్చన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇక్కడి వనరుతోనే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాం. కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం. అది అవినీతికి తల్లిలాంటిది(భ్రష్టాచార్‌ కీ జనని). అస్సాం ఆత్మగౌరవాన్ని, భద్రతను కాపాడే విషయంలో రాజీపడింది’’ అని మోదీ ధ్వజమెత్తారు.

ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తాం  
‘‘మేము మళ్లీ అధికారంలోకి వస్తే అస్సాంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమలు చేస్తాం. ఆరో షెడ్యూల్‌ కింద గిరిజనులకు రక్షణలు కల్పిస్తాం. అస్సాం గుర్తింపు, గౌరవాన్ని కాపాడుతాం. రాష్ట్రంలో పదేళ్ల బీజేపీ పాలన సేవ, సుశాసన్‌కు బాటలు వేసింది. తేయాకు సాగుకు ప్రసిద్ధి పొందిన అస్సాం నేడు సెమీకండక్టర్ల తయారీ హబ్‌గా మారడం సంతోషంగా ఉంది’’అని మోదీ ఉద్ఘాటించారు.  

తేయాకు తోటలో కార్మికుడిగా మోదీ  
అస్సాం రాష్ట్రం దిబ్రూగఢ్‌ జిల్లాలో మనోహరి టీ ఎస్టేట్‌ను ప్రధాని మోదీ సందర్శించారు. 19 మంది మహిళా కూలీలతో కలిసి కొద్దిసేపు పనిచేశారు. స్వయంగా తోటలోకి దిగి తేయాకు తెంపి, సంప్రదాయ బుట్టలోకి సేకరించారు. తేయాకు తోటలో పనిచేయడం మర్చిపోలేని అనుభవమని మోదీ పేర్కొన్నారు. తన జీవితం ఛాయ్‌తో ముడిపడి ఉందన్నారు. టీ చెట్ల నుంచి తేయాకు ఎలా తెంచాలన్నది మహిళలను చూసి నేర్చుకున్నానని తెలిపారు. మహిళలతో మాట్లాడారు. వారి పిల్లల చదువుల గురించి ఆరా తీశారు. అలాగే వంటల గురించి అడిగి తెలుసుకున్నారు. వారిలో ఒక మహిళను తన గురువుగా మోదీ అభివరి్ణంచారు. మరో మహిళ పాట పాడి వినిపించారు. తేయాకు అస్సాం అత్మ అంటూ మోదీ ఎక్స్‌లో పోస్టుచేశారు. ఇక్కడ సాగవుతున్న టీ ప్రపంచమంతటా సరఫరా అవుతోందని వివరించారు. టీ కార్మికుల శ్రమ, పట్టుదల అస్సాంకు గర్వకారణమని స్పష్టంచేశారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement