
గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత తొలిసారిగా చైనాకు..
షాంఘై సహకార సంస్థ సదస్సుకు హాజరు కానున్న ప్రధాని
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ వచ్చే నెలలో చైనాలో పర్యటించబోతున్నారు. ఆగస్టు 31, సెపె్టంబర్ 1వ తేదీల్లో చైనాలోని తియాంజిన్ నగరంలో జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారని సమాచారం. 2020 జూన్‌లో జరిగిన భారత్, చైనా జవాన్ల భీకర ఘర్షణ తర్వాత మోదీ చైనాకు వెళ్తుండడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఆయన చివరిసారిగా 2019లో చైనాలో పర్యటించారు. గల్వాన్ లోయ ఘటన తర్వాత భారత్–చైనా ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి. సంబంధాలు పునరుద్ధరించుకోవాలని ఇరుదేశాలు భావిస్తున్నాయి.
ఈ విషయంలో మోదీ చైనా పర్యటన కీలకమైన ముందడుగు అవుతుందని దౌత్య నిపుణులు అంచనా వేస్తున్నారు. మోదీ చైనా పర్యటన సందర్భంగా చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. చైనాలో ఎస్సీఓ సదస్సు నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా సభ్యదేశాల అధినేలతో మోదీ భేటీ అవుతారు. చైనా పర్యటన కంటే ముందు ప్రధానమంత్రి జపాన్‌లో పర్యటిస్తారని సమాచారం. మోదీ ప్రధానమంత్రి హోదాలో ఇప్పటిదాకా ఐదు సార్లు చైనాలో పర్యటించారు. దేశ విదేశాల్లో షీ జిన్‌పింగ్‌తో 18 సార్లు సమావేశమయ్యారు. మరోవైపు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ మంగళవారం చైనా అధినేత జిన్‌పింగ్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. భారత్–చైనా సంబంధాలపై వారు చర్చించారు.