ఎనిమిదేళ్లుగా అభివృద్ధికే పట్టం

PM Narendra Modi addresses BJP National Office Bearers Meet Jaipur - Sakshi

సుపరిపాలన, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం

బీజేపీ ఆఫీసు బేరర్ల భేటీలో ప్రధాని మోదీ పిలుపు

జైపూర్‌: దేశంలో తమ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా అభివృద్ధికే పట్టం కడుతోందని.. సుపరిపాలన, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలంతా దేశ ప్రయోజనాలే లక్ష్యంగా పని చేయాలని, ప్రతిపక్షాలు విసిరే వలలో చిక్కుకోవద్దని సూచించారు.

ముఖ్యమైన అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు పన్నుతుంటాయని, బీజేపీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. శుక్రవారం రాజస్తాన్‌లోని జైపూర్‌లో నిర్వహించిన బీజేపీ ఆఫీసు బేరర్ల సమావేశంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. దేశ ప్రయోజనాలే పరమావధిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పార్టీపరంగా రాబోయే 25 ఏళ్లకు లక్ష్యాలను నిర్ధారించుకోవాల్సిన సమయం వచ్చిందని నొక్కిచెప్పారు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే..  

మనకు దేశభక్తే స్ఫూర్తి
‘‘బీజేపీ అభివృద్ధి కోసం తపన పడుతోంది. కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం స్వార్థ ప్రయోజనాల కోసం దేశ భవిష్యత్తుతో ఆటలు ఆడుకుంటున్నాయి. సమాజంలోని చిన్నపాటి ఉద్రిక్తతలు, బలహీనతలను అడ్డం పెట్టుకొని మరింత విషం చిమ్ముతున్నాయి. కులాలు, మతాల పేరిట ప్రజలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి శక్తులు, పార్టీల నుంచి కాపాడుకునేలా ప్రజలను అప్రమత్తం చేయాలి.   జన సంఘ్‌ కాలం నుంచి దేశభక్తి, జాతి ప్రయోజనాలు, జాతి నిర్మాణమే మన విధానం, కార్యక్రమంగా కొనసాగుతోంది. అభివృద్ధి, విశ్వాసంపై బీజేపీ దృష్టి పెట్టడానికి దేశభక్తే స్ఫూర్తినిస్తోంది. ఎలాంటి షార్ట్‌కట్‌లు మనకు వద్దు. మనం వేసే అడుగులు దారి తప్పకూడదు. మాట తూలకూడదు.  

అభివృద్ధి, సామాజిక న్యాయం, భద్రత  
పేదల సంక్షేమం, వారి జీవనాన్ని సరళతరం చేయడమే మనకు ముఖ్యం. పేదల సాధికారత కోసం కృషిని కొనసాగించాలి. మన మార్గం నుంచి పక్కకు వెళ్లకూడదు. మన దృష్టిని మళ్లించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతుంటాయి. వాటిని లెక్కచేయాల్సిన అవసరం లేదు. ఎల్లవేళలా అభివృద్ధికే కట్టుబడి ఉండాలి. భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటోంది. రాబోయే 25 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాలను నిర్ధారించుకుంటోంది. పార్టీపరంగా కూడా 25 ఏళ్లకు లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. వాటిని సాధించేందుకు కృషి చేయాలి.

ఎన్డీయే ప్రభుత్వానికి ఈ నెలలోనే 8 ఏళ్లు నిండుతాయి. ఈ 8 ఏళ్లలో సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేశాం. పేదలు, కార్మికులు, మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాం. సమతుల అభివృద్ధి, సామాజిక న్యాయం, సామాజిక భద్రత కల్పించాం. దేశంలో భాషల ప్రాతిపదికగా వివాదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి ప్రాంతీయ భాషలోనూ భారతీయ సంస్కృతి ప్రతిబింబాన్ని బీజేపీ చూస్తోంది. జాతీయ విద్యా విధానం ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఇస్తోంది.

ప్రాంతీయ భాషల పట్ల మన నిబద్ధతకు ఇదే నిదర్శనం. భాషా వైవిధ్యం దేశానికి గర్వకారణం.  ఇప్పుడు ప్రపంచమంతా గొప్ప అంచనాలతో భారత్‌ వైపు చూస్తోంది. అలాగే భారత్‌లోనూ ప్రజలు బీజేపీపై ప్రత్యేకమైన అనురాగం కురిపిస్తున్నారు. గొప్ప నమ్మకం, ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించి, బలోపేతం చేయడానికి వంశపారంపర్య పార్టీలపై బీజేపీ పోరాటం సాగిస్తూనే ఉంటుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలి. ఈ విషయంలో బీజేపీ నేతలు చొరవ తీసుకోవాలి’’ అని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top