ఉగ్రవాదమే పెను ముప్పు 

PM Modi Says Terrorism Is Biggest Challenge In World In BRICS Summit - Sakshi

ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు టెర్రరిజం

ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలను దోషులుగా నిర్ధారించాలి 

‘బ్రిక్స్‌’ సదస్సులో ప్రధాని మోదీ 

ప్రధాని వ్యాఖ్యలను సమర్థించిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌ 

కరోనా టీకా విషయంలో భారత్‌ సహా బ్రిక్స్‌ దేశాలకు సహకరిస్తామన్న చైనా 

న్యూఢిల్లీ/మాస్కో/బీజింగ్‌ : ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఉగ్రవాదమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పొరుగుదేశం పాకిస్తాన్‌ను నేరుగా ప్రస్తావించకుండా.. ఉగ్రవాదానికి సాయమందిస్తూ మద్దతిస్తున్న దేశాలను దోషులుగా నిర్ధారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఉగ్రవాద మహమ్మారిపై ఉమ్మడిగా, వ్యూహాత్మకంగా పోరు సాగించాలన్నారు. రష్యా అధ్యక్షతన మంగళవారం వర్చువల్‌ విధానంలో జరిగిన బ్రిక్స్‌(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్‌ కొరియా) 12వ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో మోదీతో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, బ్రెజిల్‌ అధ్యక్షుడు జాయిర్‌ బొల్సొనారొ, దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్‌ సిరిల్‌ రమాఫొసా పాల్గొన్నారు. ‘రష్యా నేతృత్వంలో బ్రిక్స్‌ ఉగ్రవాద వ్యతిరేక వ్యూహం సిద్ధమైనందుకు సంతోషంగా ఉంది. ఇది గొప్ప విజయం. తదుపరి బ్రిక్స్‌ అధ్యక్ష బాధ్యతలు తీసుకోబోతున్న భారత్‌.. దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుంది’ అని మోదీ పేర్కొన్నారు.

‘బ్రిక్స్‌ నూతన ఉగ్రవాద వ్యతిరేక వ్యూహం’ను ఈ సదస్సులో సభ్య దేశాలు ఆమోదించాయి. ఈ వ్యూహం కార్యాచరణకు సంబంధించి సభ్య దేశాల జాతీయ భద్రత సలహాదారు చర్చలు జరపాలని మోదీ సూచించారు. ఉగ్రవాదంపై మోదీ వ్యాఖ్యలను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సమర్థించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలను కుటుంబంలోని ‘విశ్వాసఘాతకులు’గా పుతిన్‌ అభివర్ణించారు. బ్రిక్స్‌ ప్రపంచంలోని ఐదు ప్రధాన దేశాల కూటమి. 360 కోట్ల జనాభాకు ఈ కూటమి ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రపంచ జనాభాలో ఇది దాదాపు సగం.

ఈ ఐదు దేశాల మొత్తం జీడీపీ 16.6 లక్షల కోట్ల డాలర్లు ఉంటుంది. సదస్సు అనంతరం సభ్యదేశాలు ఉమ్మడి ప్రకటనను వెలువరించాయి. అన్ని విధాలైన ఉగ్రవాద కార్యక్రమాలను బ్రిక్స్‌ గట్టిగా ఖండిస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రవాదానికి మతం, వర్గం, జాతితో సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ప్రపంచ దేశాలు ఒక సమగ్ర, సమతుల కార్యాచరణను రూపొందించాలన్నారు. 

సంస్కరణలు అవసరం 
బహుళత్వ విధానం, అంతర్జాతీయ ఐక్యత ప్రస్తుతం సంక్షోభంలో పడ్డాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్య రాజ్య సమితి భద్రత మండలి, ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ), ఐఎంఎఫ్, డబ్ల్యూహెచ్‌ఓ తదితర అంతర్జాతీయ సంస్థల్లో సత్వరమే సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రధాని నొక్కిచెప్పారు. ‘ఈ సంస్థల పనితీరు, విశ్వసనీయతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకు కారణం.. కాలానుగుణంగా, అంతర్జాతీయ అవసరాలు ప్రాతిపదికగా ఈ సంస్థలు మార్పు చెందకపోవడమే’ అని ప్రధాని మోదీ విమర్శించారు.  ‘ఐరాస భద్రత మండలిలో సంస్కరణలు అవసరమని భారత్‌ బలంగా విశ్వసిస్తోంది. ఈ విషయంలో బ్రిక్స్‌ సభ్య దేశాలు భారత్‌కు మద్దతిస్తారని ఆశిస్తున్నా’నన్నారు. 

కోవిడ్‌–19.. 
కరోనా మహమ్మారి కారణంగా కుదేలైన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల పునరుజ్జీవనంలో బ్రిక్స్‌ దేశాలు కీలక పాత్ర పోషించాలని మోదీ పిలుపునిచ్చారు. కరోనా టీకా ఉత్పత్తి, సరఫరాలో మొత్తం మానవాళి సంక్షేమాన్ని భారత్‌ దృష్టిలో పెట్టుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. బ్రిక్స్‌ దేశాల మధ్య వాణిజ్యం మరింత పెరిగేందుకు ఇంకా ఎంతో అవకాశముందన్నారు. న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్, కంటింజెంట్‌ రిజర్వ్‌ అరెంజ్‌మెంట్‌ తదితర ఉమ్మడి వ్యవస్థల ద్వారా బ్రిక్స్‌ దేశాలు ప్రయోజనం పొందడమే కాకుండా, ప్రపంచ ఆర్థిక రంగ పునరుజ్జీవానికి కూడా అవకాశం లభిస్తుందన్నారు. బ్రిక్స్‌ దేశాల మధ్య వాణిజ్యం 500 బిలియన్‌ డాలర్లకు చేరేందుకు బ్రిక్స్‌ బిజినెస్‌ కౌన్సిల్‌ చర్యలు చేపట్టాలని సూచించారు. కోవిడ్‌ టీకాలు, చికిత్సా విధానాలను అంతర్జాతీయ మేథో హక్కుల ఒప్పందాల నుంచి మినహాయించాలంటూ భారత్, దక్షిణాఫ్రికా ప్రతిపాదించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. దీనికి బ్రిక్స్‌ దేశాలు మద్దతివ్వాలన్నారు.

స్వయం సమృద్ధ భారత్‌.. 
స్వయం సమృద్ధ భారత్‌ లక్ష్యంగా ఒక సమగ్ర సంస్కరణల విధానాన్ని భారత్‌లో ప్రారంభించామని ప్రధాని బ్రిక్స్‌ సభ్య దేశాలకు వివరించారు. ‘‘కోవిడ్‌–19 అనంతరం అంతర్జాతీయ అర్థిక వ్యవస్థలను పరుగులు పెట్టించి, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థకు సముచిత ప్రయోజనం చేకూర్చగల శక్తి స్వయం సమృద్ధ, ఉత్సాహపూరిత భారత్‌కు ఉందన్న విశ్వాసంతోనే ఈ ‘స్వావలంబ భారత్‌’ ప్రచారాన్ని ప్రారంభించాం’’ అని వివరించారు. కరోనా విజృంభణ సమయంలో దాదాపు 150 దేశాలకు అత్యవసర ఔషధాలను భారత్‌ పంపించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. బ్రిక్స్‌ అధ్యక్ష బాధ్యతలను భారత్‌ స్వీకరించిన తరువాత డిజిటల్‌ హెల్త్, సంప్రదాయ వైద్యం రంగాల్లో సభ్య దేశాలతో సమన్వయం పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. 

భారత్‌కు సహకరిస్తాం: జిన్‌పింగ్‌ 
కరోనా వైరస్‌కు టీకాలను తయారు చేయడంలో భారత్‌ సహా బ్రిక్స్‌ దేశాలకు సహకరిస్తామని చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ పేర్కొన్నారు. కోవిడ్‌–19 చికిత్స, నివారణల్లో బ్రిక్స్‌ దేశాల్లోని సంప్రదాయ వైద్యం ప్రాధాన్యాన్ని వివరించేలా ఒక సదస్సును ఏర్పాటు చేయాలని సూచించారు. ‘కరోనా టీకాల క్లినికల్‌ ట్రయల్స్‌లో రష్యా, బ్రెజిల్‌ దేశాల్లోని తమ భాగస్వామ్యులతో కలిసి చైనా ఫార్మా కంపెనీలు పనిచేస్తున్నాయి. ఈ విషయంలో భారత్, దక్షిణాఫ్రికాలతో కూడా కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నాం’ అన్నారు. బ్రిక్స్‌ దేశాలకు అవసరమైతే, టీకాను సరఫరా చేస్తామన్నారు.

భారత్, చైనాల్లో స్పుత్నిక్‌ వీ టీకా
కరోనా వైరస్‌కు టీకాను తయారు చేసే ప్రక్రియలో బ్రిక్స్‌ దేశాలు పరస్పరం సహకరించుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పేర్కొన్నారు. కరోనా కట్టడికి రూపొందించిన తమ స్పుత్నిక్‌ వీ టీకాను భారత్, చైనాల్లోనూ ఉత్పత్తి చేయనున్నారన్నారు. ‘బ్రిక్స్‌ దేశాలు వ్యాక్సిన్‌ల రూపకల్పనలో సహకరించుకోవాలి. టీకాల పరిశోధన, అభివృద్ధి కోసం ఉమ్మడి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని రెండేళ్ల క్రితమే ఒక అంగీకారానికి వచ్చాం’ అని పుతిన్‌ గుర్తు చేశారు. స్పుత్నిక్‌ వీ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించి బ్రెజిల్, భారత్‌ల్లోని భాగస్వాములతో ఒప్పందాలు కుదిరాయన్నారు.  టీకా ఉత్పత్తికి సంబంధించి భారత్, చైనాల్లోని ఫార్మా కంపెనీలతో ఒప్పందం కుదిరిందన్నారు. స్పుత్నిక్‌ వీ పేరుతో ప్రపంచంలోనే తొలిసారి కరోనా వైరస్‌కు టీకాను రష్యా ఈ ఆగస్ట్‌లో రిజిస్టర్‌ చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top