టోక్యో ఒలింపిక్స్‌ క్రీడాకారులను సన్మానించిన ప్రధాని మోదీ

PM Modi Met With Tokyo Olympics Athletes On Monday - Sakshi

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులతో ప్రధాని మోదీ సోమవారం సమావేశమయ్యారు. ఆయన నివాసంలో ప్రధాని మోదీ క్రీడాకారులను సన్మానించారు. కాగా జావెలిన్‌ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణంతో సహా ఏడు పతకాలతో భారత అథ్లెట్లు టోక్యో నుంచి తిరిగి వచ్చారు. ఆదివారం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో  భారత క్రీడాకారుల అద్భుతమైన ప్రదర్శనను మోదీ ప్రశంసించారు.

ఇక ఈ ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను 49 కేజీల కేటగిరీలో తలపడిన మణిపూర్‌ మహిళామణి 202 కేజీల (87 కేజీలు+115 కేజీలు) బరువెత్తి రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకుంది. అంతేకాకుండా వరుసగా రెండు ఒలింపిక్స్‌ క్రీడల్లో పతకాలు (రజతం, కాంస్యం) గెలిచిన తొలి భారత మహిళగా పీవీ సింధు రికార్డులకెక్కింది. ఇక ఆర్మీ నాయక్‌ సుబేదార్‌ విశ్వక్రీడల్లో (అథ్లెటిక్స్‌) బంగారు కల ఇక కల కాదని తన ‘మిషన్‌ పాజిబుల్‌’తో సాకారం చేశాడు. ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి ఈ ఒలింపిక్స్‌ పతకాల పట్టికను స్వర్ణంతో భర్తీ చేశాడు.

రవి దహియా 57 కేజీల ఫ్రీస్టయిల్‌ రెజ్లింగ్‌లో  రజతం సాధించి భారత వెండికొండగా మారాడు. మరోవైపు భారత హకీ జట్టు ఒలింపిక్స్‌లో పతకం కోసం 41 ఏళ్ల నిరీక్షణకు కాంస్యంతో తెరపడింది. మన్‌ప్రీత్‌ జట్టును నడిపిస్తే... గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ అడ్డుగోడ, స్ట్రయికర్‌ సిమ్రన్‌జీత్‌ సింగ్‌ ప్రదర్శన పోడియంలో నిలబెట్టాయి. ఇక అస్సాం రాష్ట్రానికి చెందిన లవ్లీనా ఒలింపిక్స్‌లో విజేందర్, మేరీకోమ్‌ల తర్వాత పతకం నెగ్గిన మూడో భారత బాక్సర్‌గా నిలిచింది. దిగ్గజం మేరీకోమ్‌ తదితర మేటి బాక్సర్లు ఓడిన చోట కాంస్యంతో నిలిచిన ఘనత లవ్లీనాది. అంతేకాకుండా ఫేవరెట్‌గా టోక్యోకు వెళ్లిన గోల్డెన్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా కాంస్యంతో మురిపించాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top