కొత్త సంస్కరణలను తెద్దాం  | PM Modi Holds 4 Hour Marathon Meet With Council Of Ministers | Sakshi
Sakshi News home page

కొత్త సంస్కరణలను తెద్దాం 

May 21 2026 10:52 PM | Updated on May 22 2026 4:47 AM

PM Modi Holds 4 Hour Marathon Meet With Council Of Ministers

ప్రజల జీవన ప్రమాణాల మెరుగు కోసం చర్చలు తీసుకోండి

శతవసంత స్వాతంత్య్ర దినోత్సవాల కల్లా సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవ్వాలి 

మంత్రి మండలి సమావేశంలో ప్రధాని మోదీ దిశానిర్దేశం 

నాలుగున్నర గంటలపాటు సుదీర్ఘంగా సాగిన కేబినెట్‌ భేటీ

న్యూఢిల్లీ: దేశం శత వసంత స్వాతంత్య్ర దినోత్సవాలు చేపట్టే 2047 ఏడాదికల్లా సర్వతోముఖాభివృద్ధి సాధనే లక్ష్యంగా కీలక మంత్రిత్వ శాఖలు సమిష్టిగా ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశంచేశారు. ఇందుకు నాలుగున్నర గంటలపాటు సుదీర్ఘంగా సాగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం వేదికగా నిలిచింది. 

ఢిల్లీలోని ప్రధానమంత్రి నూతన కార్యాలయం( సేవా తీర్థ్థ)లో గురువారం సాయంత్రం ఐదు గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం మొదలై గంటల తరబడి కొనసాగింది. 

భవిష్యత్‌ సంస్కరణల మీదనే మంత్రులంతా దృష్టిసారించాలని, అప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి ఫలాలను ప్రజలు అందుకోగలరని మంత్రులకు మోదీ కర్తవ్యబోధ చేశారు. 2047 ఏడాదికల్లా భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు అవలంభించాల్సిన విధానాలు, అమలుచేయాల్సిన సంస్కరణల చిట్టాను మోదీ మంత్రుల ముందు పెట్టారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.  

ఉమ్మడిగా ముందుకు కదలండి 
‘‘కొత్త సంస్కరణలు తెద్దాం. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడంతోపాటు సులభతర జీవనాన్ని ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా మంత్రులంతా ఉమ్మడిగా పనిచేయండి. ప్రజల జీవితాలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడడమే మన ప్రథమ కర్తవ్యం. కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి ప్రజలు గరిష్టస్థాయిలో ప్రయోజనం పొందేలా చర్యలు చేపట్టండి. గతంలో చేసిన పనుల గురించి వెనక్కి తిరిగి చూసుకునే సమయం లేదు. చేయాల్సిన కార్యాల మీద దృష్టిపెట్టండి. 

ఈ ఏడాదే అధికారంలోకి వచ్చామనే నూతనోత్సాహంతో పనిచేయండి. ఈ ఏడాది పూర్తిగా భవిష్యత్‌ లక్ష్యాలు, సాధించాల్సిన విజయాలపైనే దృష్టిసారించండి. సుపరిపాలనే శ్వాసగా పనిచేయండి. ప్రభుత్వ పనుల్లో పెండింగ్‌ అనే మాటే వినపడొద్దు’’అని మంత్రులకు మోదీ సూచించారు.ఈ భేటీలో కేబినెట్‌ మంత్రులతోపాటు సహాయక మంత్రులు, స్వతంత్రహోదా ఉన్న సహాయక మంత్రులు సైతం పాల్గొన్నారు. ఈ ఏడాది అందరు మంత్రులతో జరిగిన తొలి భేటీ ఇదేనని తెలుస్తోంది. 

ఆయా మంత్రిత్వ శాఖలు, విభాగాలు చేపడుతున్న చర్యలు, పథకాల అమలుతీరును, మెరుగు పర్చుకోవాల్సిన అంశాలపై ఆయా శాఖల కార్యదర్శులు ప్రధానికి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. మొత్తంగా 9 మంది కార్యదర్శులు ఇందులో భాగస్వాములయ్యారు. అన్ని శాఖల సమగ్ర పనితీరుపై కేబినెట్‌ కార్యదర్శి టీవీ సోమనాథన్‌ మరో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. నీతీ ఆయోగ్‌ సభ్యుడు రాజీవ్‌ గౌబా సైతం ఇందులో పాల్గొన్నారు. 

కీలక పశ్చిమబెంగాల్‌తోపాటు అస్సాం శాసనసభ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి ఘన విజయం తర్వాత తొలిసారిగా ఈ భేటీ జరగడంతో ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశముందని వార్తలొచ్చాయి. కానీ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల పనితీరు, లోటుపాట్లు, మెరుగుపర్చుకోవాల్సిన అంశాలపై ఈ భేటీలో సమీక్షించినట్లు తెలుస్తోంది. వీటితోపాటే ఇటీవల ఐదు దేశాల పర్యటన ముగించుకుని వచ్చిన ప్రధాని పర్యటన విశేషాలు, మిత్రదేశాలతో దౌత్య బంధం బలోపేతం, కీలక ఒప్పందాలు, పశ్చిమాసియా సంక్షోభం అంశాలపై మంత్రులకు విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ విడిగా బ్రీఫింగ్‌ ఇచ్చారని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement