న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఇంధన, పౌర మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. చమురు, గ్యాస్ ఉత్పత్తి, నిల్వ కేంద్రాలపై క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించడం అర్థరహితం అని తేల్చిచెప్పారు. ఆయన శుక్రవారం బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో ఫోన్‌లో మాట్లాడారు.
పశ్చిమాసియా పరిణామాలపై ఇరువురూ చర్చించుకున్నారు. సముద్ర మార్గాల్లో నౌకల రాకపోకలకు అవాంతరాలు ఎదురవుతున్నాయని మోదీ ప్రస్తావించారు. షిప్పింగ్ మార్గాలకు తగిన భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నౌకాయానం స్వేచ్ఛగా కొనసాగేలా పశ్చిమాసియా దేశాలు చొరవ తీసుకోవాలని సూచించారు. నౌకల స్వేచ్ఛాయుత ప్రయాణానికి వీలుగా సముద్ర మార్గాలను తెరవాలన్నారు. బహ్రెయిన్ రాజుతో ఫలవంతమైన చర్చ జరిగిందంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. రంజాన్ పర్వదినం సందర్భంగా రాజుకు, బహ్రెయిన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశానని పేర్కొన్నారు.
ఇంధన, పౌర మౌలిక వసతులపై దాడుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఇంధనం, ఎరువులు భద్రతపై ప్రతికూల ప్రభావం పడుతుందని తేలి్చచెప్పారు. బహ్రెయిన్‌లోని భారతీయుల రక్షణకు తగిన చర్యలు చేపట్టినందుకు రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇరాన్‌పై యొద్ధం మొదలైన తర్వాత బహ్రెయిన్ రాజుతో మోదీ ఫోన్‌లో మాట్లాడడం ఇది రెండోసారి. ఆయన సౌదీ అరేబియా, జోర్డాన్, యూఏఈ, ఫ్రాన్స్, మలేషియా, ఇజ్రాయెల్, ఇరాన్ తదితర దేశాల పాలకులతో ఇప్పటికే మాట్లాడారు.


