
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడి
త్రివిధ దళాలు ఆపరేషన్
సిందూర్‌తో పాక్‌ను మోకాళ్లపై నిలబెట్టాయి
సైన్యంలో స్వయం సమృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం
గోవా తీరంలో ‘ఐఎన్‌ఎస్ విక్రాంత్’పై దీపావళి వేడుకలు
పనాజీ: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత త్రివిధ దళాలు అద్భుతమైన సమన్వయంతో పనిచేసి, అతి తక్కువ సమయంలోనే పాకిస్తాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. మన సైన్యం పాకిస్తాన్‌ను భయకంపితులను చేసిందన్నారు. వాయుసేన నైపుణ్యాలు, నావికాదళం ధైర్యసాహసాలు పొరుగుదేశానికి చుక్కలు చూపించాయని తెలిపారు. ప్రధాని మోదీ గోవా తీరంలో స్వదేశీ యుద్ధ విమాన వాహకనౌక ‘ఐఎన్‌ఎస్ విక్రాంత్’పై నావికాదళంతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
ఆయన ఆదివారం సాయంత్రం ఇక్కడికి చేరుకున్నారు. రాత్రంతా ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లోనే ఉన్నారు. సోమవారం ఉదయం యోగా చేశారు. నావికా దళం జవాన్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించారు. నేవీ అధికారులు, సిబ్బంది దేశభక్తి గీతాలు ఆలపించారు. ఆపరేషన్ సిందూర్‌లో సైనిక దళాల విజయానికి గుర్తుగా ప్రత్యేకంగా రాసిన పాటను సైతం వారు ఆలపించారు. నేవీ సిబ్బందికి ప్రధాని మోదీ మిఠాయిలు తినిపించారు. విందు భోజనం చేశారు. పగటిపూట, రాత్రిపూట ఐఎంఐ–27 యుద్ధ విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌ను స్వయంగా తిలకించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశీయంగా నిర్మించుకున్న ఐఎన్‌ఎస్ విక్రాంత్ నౌక ఆత్మనిర్భర్ భారత్‌కు శక్తివంతమైన ప్రతీక అని అభివర్ణించారు. ఈ నౌకను మన నావికాదళానికి అప్పగించడం ద్వారా వలసవాద పాలన నాటి ఆనవాళ్లను వదిలించుకున్నామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌లో ఐఎన్‌ఎస్ విక్రాంత్ పాకిస్తాన్‌కు నిద్రలేని రాత్రుళ్లు మిగిలి్చందని అన్నారు. శత్రువును కాళ్లబేరానికి తీసుకొచి్చందని కొనియాడారు. ఇది కేవలం యుద్ధనౌక కాదని.. 21వ శతాబ్దంలో మన కఠోర శ్రమ, నైపుణ్యం, అంకితభావానికి ఉదాహరణ అని స్పష్టం చేశారు.
రక్షణ ఉత్పత్తుల్లో అగ్రస్థానమే లక్ష్యం
సైన్యంలో స్వయం సమృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. సైనిక దళాలు మరింత బలోపేతం కావాలన్నారు. బ్రహ్మోస్, ఆకాశ్ వంటి క్షిపణులు ఆపరేషన్ సిందూర్‌లో తమ శక్తిసామర్థ్యాలను నిరూపించుకున్నాయని, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు. సైన్యానికి అవసరమైన వేలాది పరికరాలను దేశీయంగానే తయారు చేసుకుంటున్నామని, దిగుమతులు నిలిపివేశామని అన్నారు.
గత 11 ఏళ్లలో మన రక్షణ ఉత్పత్తులు మూడు రెట్లకుపైగా పెరిగాయని, గత ఏడాది రూ.1.5 లక్షల కోట్లకు చేరాయని హర్షం వ్యక్తంచేశారు. 2014 నుంచి 40కి పైగా దేశీయ యుద్ధ విమానాలు, జలాంతర్గాములను నావికాదళానికి అప్పగించామని తెలియజేశారు. త్రివిధ దళాలకు అవసరమైన ఆయుధాలు, పరికరాలు ఎగుమతి చేసే సామర్థ్యాన్ని సాధించామని వెల్లడించారు. రక్షణ ఉత్పత్తుల ఎగుమతిలో అగ్రస్థానానికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మోదీ స్పష్టం చేశారు.
కోస్ట్ గార్డుపై ప్రశంసలు
తీర రక్షక దళం(కోస్ట్ గార్డు) సేవలను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. నేవీతో కలిసి పని చేస్తూ రాత్రింబవళ్లు తీర ప్రాంతాలను చక్కగా కాపాడుతోందని తెలిపారు. నావికా దళం కొత్త జెండాకు ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తిగా నిలిచారని వివరించారు. ఈ సందర్భంగా గోవా తీరంలో ఐఎన్‌ఎస్ విక్రాంత్‌తోపాటు ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య, ఐఎన్‌ఎస్ సూరత్, ఐఎన్‌ఎస్ మోర్ముగోవా, ఐఎన్‌ఎస్ చెన్నై, ఐఎన్‌ఎస్ ఇంఫాల్, ఐఎన్‌ఎస్ కోల్‌కతా, ఐఎన్‌ఎస్ తుశీల్, ఐఎన్‌ఎస్ తబర్, ఐఎన్‌ఎస్ తేజ్, ఐఎన్‌ఎస్ బేత్వా, ఐఎన్‌ఎస్ దీపక్, ఐఎన్‌ఎస్ అదిత్య వంటి విమాన వాహన నౌకలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. అలాగే పలు యుద్ధ విమానాల విన్యాసాలు ఎంతగానో అలరించాయి. నావికా దళం సిబ్బందితో కలిసి నిర్వహించుకున్న ఈ దీపావళి తనకు ఎంతో ప్రత్యేకం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆయన 2014 నుంచి ప్రతిఏటా దీపావళిని సైనికులతో కలిసి నిర్వహించుకుంటున్న సంగతి తెలిసిందే.
నక్సలిజం నుంచి విముక్తి
దేశంలో పదేళ్ల క్రితం 125 మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఉండేవని, ఇప్పుడు ఆ సంఖ్య 11కు పరిమితమైందని ప్రధాని మోదీ అన్నారు. మన భద్రతా బలగాల త్యాగాలు, ధైర్యసాహసాల వల్లే ఈ ఘనత సాధ్యమైందని వివరించారు. మావోయిస్టు ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో ఇదొక మైలురాయి అని చెప్పారు. త్వరలో నక్సలిజం నుంచి దేశానికి పూర్తిగా విముక్తి కల్పించడం తథ్యమని స్పష్టంచేశారు. ప్రస్తుతం కేవలం మూడు జిల్లాల్లోనే నక్సలైట్ల ప్రభావం అధికంగా ఉందన్నారు. నక్సలైట్ల బెడద తప్పిపోవడంతో ఈసారి చాలా జిల్లాల్లో ప్రజలు స్వేచ్ఛగా, సంతోషంగా దీపావళి పండుగ చేసుకున్నారని, ఆయా ప్రాంతాల్లో కొనుగోళ్లు అధికంగా నమోదయ్యాయని వెల్లడించారు. నక్సలైట్ల సమస్యను నిర్మూలించడంలో పోలీసులు 90 శాతం విజయం సాధించారని చెప్పారు.