పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.4 నుంచి రూ.5 పెంపు ∙వంట గ్యాస్ సిలిండర్‌పై మరో రూ.50
సంకేతాలిచ్చిన ప్రభుత్వ వర్గాలు
ముడి చమురు రేట్ల పెరుగుదలతో నష్టపోతున్న దేశీయ ఆయిల్ కంపెనీలు
నష్టాలను పూడ్చక తప్పదంటున్న ప్రభుత్వం
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో అతి త్వరలో పెట్రోల్, డీజిల్‌తోపాటు గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరల పెంపునకు కేంద్రం ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. పెట్రో ధరల పెరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. తద్వారా పెట్రో బాదుడు తప్పదని పరోక్షంగా సంకేతాలిచ్చాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ.4 నుంచి రూ.5 చొప్పున పెరిగే అవకాశాలున్నాయి. ఎల్పీజీ సిలిండర్ ధర రూ.40 నుంచి రూ.50 దాకా పెరగనుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ దేశంలో గత నాలుగేళ్లుగా రిటైల్ ధరల్లో పెద్దగా మార్పులు జరగలేదు. ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ముడి చమురు ధరల మంట వల్ల తీవ్రంగా నష్టం వాటిల్లుతున్నట్లు దేశీయ చమురు కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నష్టాలను పూడ్చడానికి ధరల పెంపు తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
అగ్గి రాజేసిన ముడి చమురు
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ముడిచమురు బ్యారెల్ ధర ఇటీవలే 126 డాలర్లకు చేరింది. ఇది నాలుగేళ్ల గరిష్టం కావడం గమనార్హం. ప్రస్తుతం 110 డాలర్లకు దిగొచ్చింది. అయినప్పటికీ అయిల్ మార్కెటింగ్ కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది. యుద్ధం ప్రారంభం కాకముందు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 80 డాలర్లు పలికింది. హార్మూజ్ జలసంధి గుండా చమురు నౌకల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించింది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. రెండో దశ చర్చలు ఆగిపోయాయి. ముడి చమురు ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు.
ముడి చమురు ధరల పెరుగుదల వల్ల దేశంలో ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లు పెట్రోల్‌పై లీటర్‌కు రూ.20, డీజిల్‌పై లీటర్‌కు రూ.100 చొప్పున నష్టపోతున్నారని చమురు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి గతవారం తెలియజేశారు. 2022 ఏప్రిల్ ఆరంభం నుంచి భారత్‌లో రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు స్తంభించిపోయాయి. ఆ తర్వాత కొన్ని నెలల్లో చమురు ధరలు పెరగ్గా, మరికొన్ని సమయాల్లో తగ్గాయి. ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లాభాలు ఆర్జించాయి. ధరలు పెరిగినప్పుడు వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి ఆ లాభాలను ఉపయోగించుకున్నాయి. కానీ, ఇరాన్‌లో యుద్ధం మొదలైన తర్వాత ముడి చమురు రేట్లు్ల ఒక్కసారిగా భారీగా పెరిగిపోవడం దేశీయ చమురు కంపెనీలకు ఇబ్బంది కలిగిస్తోంది.
ఎన్నికలతో సంబంధం లేదు
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెంచితే రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. ప్రత్యామ్నాయాలను అంచనా వేయడానికి, రిటైల్ ద్రవ్యోల్బణంపై ప్రభావాన్ని తగ్గించడానికి అంతర్గత చర్చలు జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోవడానికి, పెట్రో ధరల పెంపునకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇస్తున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు, పశి్చమాసియాలో ఉద్రిక్తతలు, చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎదుర్కొంటున్న తీవ్ర నష్టాల కారణంగానే పెంపు నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేస్తున్నాయి.
వచ్చే వారమే ఈ పెంపు అమల్లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. చమురు పరిశ్రమ తరపున ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) శుక్రవారం ప్రకటన చేసింది. అంతర్జాతీయంగా ధరలు ఎగిసినా దేశీయంగా పెట్రోల్, డీజిల్‌తోపాటు ఎల్పీజీ రేట్లు పెంచలేదని గుర్తుచేసింది. నష్టాల నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వాణిజ్య ఎల్పీజీ, పారిశ్రామిక డీజిల్, 5 కేజీల ఎల్పీజీ, అంతర్జాతీయ విమానయాన సంస్థలకు విక్రయించే జెట్ ఇంధనం ధరలను పెంచాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.25 నుంచి రూ.28 వరకు పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, పెంపు ఆ స్థాయిలో ఉండకపోచ్చని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.


