కాళ్లు, చేతులు తీసేస్తే తప్ప : కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యల దుమారం | People will obey laws only if handslegs are chopped Karnataka judge during bail hearing | Sakshi
Sakshi News home page

కాళ్లు, చేతులు తీసేస్తే తప్ప : కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యల దుమారం

Jun 2 2026 3:37 PM | Updated on Jun 2 2026 4:03 PM

People will obey laws only if handslegs are chopped Karnataka judge during bail hearing

అత్యాచార నిందితుడి బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా  కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.  మధ్యప్రాచ్య దేశాలలో విధించే శిక్షలతో  పోలుస్తూ , మనదేశంలోని నేరం, శిక్షలపై  కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. నటరాజ్   వివాదాస్పద  వ్యాఖ్యలు చేశారు. నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే నేరాలు పెరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్) దేశాల్లో మాదిరిగా కఠినమైన శిక్షలు అమలు చేస్తేనే మార్పు వస్తుందని, ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ హక్కులను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

'బార్ అండ్ బెంచ్' వెబ్‌సైట్ కథనం ప్రకారం..“మనం నేరస్థులను గట్టిగా శిక్షించకపోవడం వల్లే  కోరలు లేని పాముల్లా చట్టాలు తయారయ్యాయి. అందుకే నేరస్తులు రెచ్చిపోతున్నారు. అలా కాకుండా కాళ్లు, చేతులు  నరికివేసే శిక్షలు ఉంటేనే, ప్రజలు చట్టాన్ని గౌరవించాల్సిన అవసరాన్ని గుర్తిస్తారు. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని ప్రతీ ఒక్కరూ చులకనగా తీసుకుంటున్నారు అంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ఇద్దరు అమ్మాయిల పెళ్లి : అదిరిపోయే ట్విస్ట్‌ ఏంటంటే..!

మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) కి చెందిన 23 ఏళ్ల విద్యార్థి గోపి రెడ్డి కార్తీక్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఏప్రిల్ 5 నుండి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

"ఉప్పు తింటే నీళ్లు కూడా తాగాలి..అతడిని మరో నాలుగు-ఐదు రోజులు జైల్లోనే ఉండనివ్వండి. జైలు జీవితానికి అలవాటు పడతాడు. ఒకవేళ శిక్ష పడితే తిరిగి అక్కడికే వెళ్లాల్సి ఉంటుందని తెలుస్తుంది" అని కోర్టు పేర్కొంటూ, తదుపరి విచారణను జూన్ 8కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: కజిన్‌ భార్యపై కన్ను : బాలుడ్ని నేలకేసి బాది.. బాబోయ్‌.. చూడలేం!

నిందితుడి తరఫు న్యాయవాది అయాంతికా మోండల్ వాదిస్తూ.. తన క్లయింట్ చేయని నేరానికి రెండు నెలలుగా జైల్లో మగ్గుతున్నారని అన్నారు. ఈ ఘటన మూడేళ్ల క్రితం జరిగిందని చెబుతున్నారని, ఇప్పుడు అతడిని ఇలాగే నిర్బంధిస్తే అతని వృత్తిపరమైన భవిష్యత్తు దెబ్బతింటుందని వాదించారు.

అసలు కేసు ఏంటి? 
ఇది 2003 జూలైలో  నిందితుడు కార్తీక్ రెడ్డి ఒక మహిళను(ఫిర్యాదుదారు) ప్రేమను వ్యక్తపరిచాడు. ఈ ప్రేమను మొదట ఆమె కూడా అంగీకరించింది. అయితే, అతని ప్రవర్తనపై అనుమానంతో దూరం పెట్టింది. దీంతో తమ బంధం గురించి మాట్లాడుకుందామని చెప్పి, నమ్మించిన నిందితుడు ఆమెను తన అపార్ట్‌మెంట్‌కు పిలిపించాడు. అక్కడ ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక దాడికి పాల్పడ్డాడని  ఆరోపణ. ఈ ఘటన వల్ల ఆమె తీవ్ర మానసిక క్షోభ, నిరాశకు గురై మణిపాల్‌లోని కేఎంసీ (KMC) ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. ఆ తర్వాత ఆమె బెంగళూరులోని జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించి, అనంతరం ఉడుపి మహిళా పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేసింది.

నెట్టింట దుమారం
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విమర్శలకు గురయ్యాయి. ఇటువంటి శిక్షలు రాజ్యాంగ, ఆధునిక న్యాయ సూత్రాలకు విరుద్ధమని పలువురు వినియోగదారులు వాదించారు. స్వయంగా కోర్టులు, న్యాయమూర్తులు హమ్మురాబి స్మృతిని ఎలా నిర్దేశిస్తారు? మనం ప్రతీకార న్యాయాన్ని ఎప్పుడో దాటిపోయాం. ఇది అంతకంటే దారుణంగా కనిపిస్తోందన్నారు మరొకరు. రాజ్యాంగం, నేర చట్టాలు అటువంటి అనాగరికతను అనుమతించవని మరో నెటిజన్‌  వ్యతిరేకతను వ్యక్తంచేశాడు. న్యాయవ్యవస్థ దుస్థితిని విమర్శిస్తూ ఒథెరా ఇలా రాశారు, "మన దేశంలో ఉన్న కోర్టులు, న్యాయమూర్తుల స్థాయి ఇది. మన దేశంలో అన్ని నియమాలు, చట్టాలు ఉన్నాయి, కానీ వాటి అమలు చాలా తక్కువగా ఉంది. పై నుండి క్రింది వరకు ప్రతి స్థాయిలో అవినీతి ఉంది."

Advertisement
 
Advertisement
Advertisement