విమానాల్లో వికృత చేష్టలు: ఇకపై గమ్మున ఉండాల్సిందే!.. రెచ్చిపోతే ఊరుకోరు

Pee Gate Row: DGCA Regulations To Airlines For Unruly Passengers - Sakshi

న్యూఢిల్లీ: విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసిన ప్రయాణికుడి ఘటన.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఘటన జరిగిన నెల తర్వాత వృద్ధురాలు ఫిర్యాదు చేయడం, ముంబైకి చెందిన శంకర్‌ మిశ్రా పరారీలో ఉండడం, ఈ మధ్యలో జరిగిన రాజీ యత్నాలు వాట్సాప్‌ ఛాటింగ్‌ రూపంలో.. నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ వ్యవహారంలో!. అయితే.. 

ఇదొక్కటే కాదు.. స్వల్ఫ వ్యవధిలో ఇలాంటి వికృత ఘటనలు చోటు చేసుకోవడంతో కీలక ఆదేశాలు వెలువడ్డాయి. ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో అలాంటి ప్రయాణికుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని, ఇకపై కఠినంగానే వ్యవహరించాలని విమానయాన నియంత్రణ సంస్థ నిర్ణయించుకుంది. విమానాల్లో ఇష్టానుసారం, పద్ధతి లేకుండా ప్రవర్తించే ప్రయాణికులను నిలువరించాల్సిన బాధ్యత పూర్తిగా సిబ్బందిదేనని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) ఎయిర్‌లైన్స్‌ సంస్థలతో పేర్కొంది. 

అలాంటి ప్రయాణికులను నిలువరించేందుకు విమానంలోని సిబ్బంది సామరస్యంగా ప్రయత్నించాలి. పరిస్థితిని అంచనా వేయడం, సెంట్రల్‌ కంట్రోల్‌కు సమాచారం అందించాల్సిన బాధత్య పైలట్‌ది. ఒకవేళ..వాళ్లు(రెచ్చిపోయి ఇష్టానుసారం ప్రవర్తించే ప్రయాణికులు) వినలేని పరిస్థితులు గనుక ఎదురైతే ప్రత్యేక పరికరాలను ఉపయోగించాలని డీజీసీఏ.. ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు సూచించింది.  బేడీలు లేదంటే బెల్టుల తరహా పరికరాలను ఉపయోగించాలని, వాటిని విమానంలో ఎప్పుడూ ఉంచాలని చెబుతూ.. అవి ఎలా ఉండాలో కూడా పలు సూచనలు చేసింది డీసీసీఏ. 

నవంబర్‌లో(26వ తేదీన) జరిగిన ఓ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. న్యూయార్క్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానంలో బిజినెస్‌ క్లాస్‌ సెక్షన్‌లో ఓ వ్యక్తి.. ఓ వృద్ధురాలిపై మూత్రం పోశాడు. ఆ సమయంలో సిబ్బంది ఆమెకు సర్దిచెప్పి.. అతన్ని అక్కడి నుంచి పంపించేశారు విమాన సిబ్బంది.  అయితే విమానం ల్యాండ్‌ అయిన తర్వాత కూడా ఆ వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా సదరు వ్యక్తి అక్కడి నుంచి ఏం జరగనట్లు వెళ్లిపోయాడు. అయితే.. ఈ ఘటన విషయంలో ఇరుపార్టీలు రాజీకి వచ్చి ఉంటాయని ఎయిర్‌ ఇండియా ఇంతకాలం భావించిందట!.

కానీ, తాజాగా ఆ వృద్ధురాలు ఏకంగా ఎయిర్‌ ఇండియా గ్రూప్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌కు లేఖ రాయడంతో వ్యవహారం మీడియాకు ఎక్కింది. ఇక ఇది జరిగిన పదిరోజులకే.. అంటే డిసెంబర్‌ నెలలో మరోకటి జరిగింది. ప్యారిస్‌-ఢిల్లీ విమానంలో తప్పతాగిన ఓ వ్యక్తి తోటి మహిళా ప్రయాణికురాలి బ్లాంకెట్‌లో మూత్రం పోశాడు. అయితే విమానం దిగాక ఆ వ్యక్తితో లేఖ రాసి పంపించేశారు విమాన సిబ్బంది. ఇలా.. స్వల్ప కాలిక వ్యవధిలో జరిగిన ఘటనలు విమానయాన సంస్థల తీరు మీద విమర్శలు చెలరేగేలా చేశాయి.

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top