Parliament Monsoon Session: తొలి రోజే రగడ

Parliament Monsoon Session: Adjourned as Opp demands discussion on Agnipath, price rise - Sakshi

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం

ధరల పెరుగుదల, అగ్నిపథ్‌ తదితరాలపై చర్చించాలి

నినాదాలు, ప్లకార్డులతో హోరెత్తించిన విపక్షాలు

చర్చ లేకుండానే నేటికి వాయిదా పడ్డ ఉభయసభలు

సాక్షి, న్యూఢిల్లీ:   ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాల మధ్య పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ధరల పెరుగుదల నుంచి అగ్నిపథ్‌ వరకు కీలక అంశాలపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభలను వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో తొలిరోజు ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు.

లోక్‌సభకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్, కాంగ్రెస్‌ అధినేత సోనియా గాంధీ తదితరులు హాజరయ్యారు. సభ ఉదయం ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. రాష్ట్రపతి ఎన్నికలో ఎంపీలు ఓటు వేయడానికి గాను సభను మధ్యాహ్నం 2 గంటల వరకు స్పీకర్‌ ఓం బిర్లా వాయిదా వేశారు. ఎన్నికలంటే ఒక పండగ లాంటిదేనని అన్నారు.

ఈ పండగలో పాలుపంచుకోవాలని ఎంపీలకు సూచించారు. లోక్‌సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత వామపక్ష సభ్యులు వెల్‌లోకి ప్రవేశించారు. ద్రవ్యోల్బణంపై నిరసన వ్యక్తం చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్‌ సభ్యుడు అధిర్‌రంజన్‌ చౌదరి మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు కుటుంబ న్యాయస్థానాల(సవరణ) బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

ప్రతిపక్ష సభ్యుల ఆందోళన ఆగకపోవడంతో సభాధ్యక్ష స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్‌ సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభలోనూ ఉదయం కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు ప్రారంభించారు. సభను అడ్డుకోవడమే లక్ష్యంగా కొందరు సభ్యులు వచ్చినట్లు కనిపిస్తోందని చైర్మన్‌ ఎం.వెంకయ్య నాయుడు అసహనం వ్యక్తం చేశారు.

ఎంపీలంతా రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయడానికి వెళ్లాలని సూచిస్తూ సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుగుతున్న వేళ ఈ సమావేశాలను చిరస్మరణీయ సమావేశాలుగా మార్చుకోవాలని సూచించారు. చక్కటి పనితీరు ప్రదర్శించాలని ఎంపీలకు పిలుపునిచ్చారు.

గత ఐదేళ్ల మాదిరిగా కాకుండా ఈసారి వైవిధ్యంగా వ్యవహరించాలన్నారు. జపాన్‌ దివంగత ప్రధాని షింజో అబె, యూఏఈ మాజీ అధ్యక్షుడు, అబూదాబీ నాయకుడు షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్, కెన్యా మూడో అధ్యక్షుడు మావై కిబాకీకి, ఇటీవల మరణించిన ఎనిమిది మంది మాజీ ఎంపీలకు ఉభయ సభలు నివాళులర్పించాయి.

కొత్త సభ్యుల ప్రమాణం  
ఎగువ సభకు ఇటీవల ఎన్నికైన సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మాజీ మంత్రులు పి.చిదంబరం, కపిల్‌ సిబల్, ప్రఫుల్‌ పటేల్, మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్, శివసేన నేత సంజయ్‌ రౌత్, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌సింగ్‌ సూర్జేవాలా, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె మీసా భారతి, కాంగ్రెస్‌ నాయకుడు రాజీవ్‌ శుక్లా, వైఎస్సార్‌సీపీ నేతలు వి.విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, నామినేటెడ్‌ సభ్యుడు, సినీ కథా రచయిత వి.విజయేంద్ర ప్రసాద్‌ లోక్‌సభలో శత్రుఘ్న సిన్హా తదితరులు ప్రమాణం చేశారు.

ఓపెన్‌ మైండ్‌తో చర్చిద్దాం
ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు  
లోతైన, వివరణాత్మక చర్చలతో వ్రర్షాకాల సమావేశాలను ఫలవంతం చేయాలని ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అంతా కలిసి ఓపెన్‌ మైండ్‌తో చర్చిద్దామని సూచించారు. సునిశిత విమర్శ, చక్కటి విశ్లేషణల ద్వారా ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల రూపకల్పనలో భాగస్వాములు కావాలని విన్నవించారు. సోమవారం పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మీడియాతో మాట్లాడారు. ‘‘సభలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలి.

అందరి కృషితోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అందరి సహకారంతోనే సభ సజావుగా నడుస్తుంది. ఉత్తమ నిర్ణయాలు తీసుకుంటుంది. సభ గౌరవాన్ని పెంపొందించేలా మన విధులను నిర్వర్తించాలి. పంద్రాగస్టు సమీపిస్తున్న వేళ... దేశ స్వాతంత్య్రం కోసం జీవితాలను దేశానికి అంకితం చేసి, జైళ్లలో గడిపినవారి త్యాగాలను మనం గుర్తుంచుకోవాలి. వారి ఆశలను నెరవేర్చాల్సిన అవసరం ఉందని మర్చిపోవద్దు’ అని ప్రధాని పేర్కొన్నారు. పార్లమెంట్‌ను పవిత్ర స్థలంగా భావించాలన్నారు.  
 
దేశానికి కొత్త శక్తినివ్వాలి    

‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ వేళ, మరో పాతికేళ్ల తర్వాత దేశ ప్రయాణం ఎలా ఉండాలనే దానిపై ప్రణాళికలు రూపొందించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. మరింత వేగంగా ముందుకు సాగే తీర్మానాలతో జాతికి దిశానిర్దేశం చేయాలన్నారు. ఎంపీలంతా దేశానికి కొత్త శక్తిని సమకూర్చడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశాలు కీలకమన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top