
►లోక్‌సభ సాయంత్రం 4 గంటల వరకు వాయిదా పడగా.. రాజ్యసభ రేపటికి వాయిదా పడింది.
►దివాలా & దివాలా కోడ్ సవరణ బిల్లు-2021కి రాజ్యసభ ఆమోదం తెలిపింది.
►అత్యవసర రక్షణ సేవల బిల్లు-2021ని లోక్‌సభ ఆమోదించింది.
►2031 తర్వాతే తెలుగు రాష్ట్రాల నియోజకవర్గాల పునర్విభజన ఉండనున్నట్లు కేంద్రం తెలిపింది. లోక్‌సభలో ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పింది. ఆర్టికల్ 170 (3)కి లోబడి 2026 జనాభా లెక్కల తర్వాతే పునర్విభజన ఉంటుందని.. విభజన చట్ట ప్రకారం ఏపీలో 225, తెలంగాణలో 153 సీట్లు ఉండనున్నట్లు తెలిపింది. తమిళనాడును విభజించే ఆలోచన లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.
►పార్లమెంట్‌లో ప్రతిష్టంభన తొలగించేందుకు రాజ్యసభ ఛైర్మన్ యత్నించారు. అధికార, విపక్ష నేతలతో చర్చించారు. నిన్న కేంద్రమంత్రులతో భేటీ అయిన రాజ్యసభ ఛైర్మన్.. ఇవాళ మల్లికార్జున ఖర్గేతో మాట్లాడారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
►వాయిదా అనంతరం ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి.
►పెగాసస్‌పై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. టీఎంసీ ఎంపీల ఆందోళనతో రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.
►పెగాసస్ వ్యవహారం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాల ఆందోళన కొనసాగిస్తున్నాయి. పెగాసస్‌పై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో విపక్షాలపై ప్రధాని సీరియస్ అయ్యారు. పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవడంపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షం తీరు ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు.
►11వ రోజు పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. పోలవరంపై లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. పోలవరం అంచనా వ్యయాన్ని కేబినెట్ ఆమోదించాలని నోటీసు అందజేసింది. ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు.
రాహుల్ ఆధ్వర్యంలో విపక్షాల సైకిల్ ర్యాలీ
►రాహుల్ అధ్యక్షతన 14 ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాయి. సమావేశం అనంతరం రాహుల్ ఆధ్వర్యంలో పెట్రోల్ ధరలకు నిరసనగా విపక్షాలు సైకిల్ ర్యాలీ నిర్వహించాయి. పార్లమెంట్‌కు విపక్షాల సైకిల్ ర్యాలీ సాగింది. గత కొన్నిరోజులుగా విపక్షాలు ఉభయ సభలను స్తంభింపజేస్తున్నాయి. పెగాసస్, సాగు చట్టాలపై ఆందోళన కొనసాగిస్తున్నాయి.