రాష్ట్రపతి భవన్‌లో ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం | Padma Awards Ceremony Dharmendra Padma Vibhushan | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి భవన్‌లో ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం

May 25 2026 5:23 PM | Updated on May 25 2026 6:36 PM

Padma Awards Ceremony Dharmendra Padma Vibhushan

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. మరణానంతరం ప్రముఖ హిందీ నటుడు ధర్మేంద్రకి పద్మ విభూషణ్ పురస్కారం అందింది. ఆయన సతీమణి హేమామాలిని అవార్డును అందుకున్నారు. ఆ సమయంలో ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులకు ఆమోదం తెలిపింది. ఇందులో 5 పద్మ విభూషణ్‌, 13 పద్మ భూషణ్‌, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి.

అధికారిక వివరాల ప్రకారం తొలి విడతలో 66 మందికి  అవార్డులు అందజేస్తున్నారు. ఈరోజు జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి దద్రౌపది ముర్ము 2 పద్మ విభూషణ్‌, 6 పద్మ భూషణ్‌, 58 పద్మశ్రీ పురస్కారాలు ప్రదానం చేస్తున్నారు. మిగిలిన పద్మ అవార్డు గ్రహీతలకు ఈ ఏడాది తర్వాత నిర్వహించే రెండో విడత పురస్కార ప్రదాన కార్యక్రమంలో అందిస్తారు.

ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటిస్తారు. ఇవి దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటి. కళలు, సామాజిక సేవ, సాహిత్యం, వైద్యం, విజ్ఞానం, ఇంజినీరింగ్‌, క్రీడలు, ప్రజా వ్యవహారాలు, వాణిజ్యం, పరిశ్రమలు, సివిల్ సేవలు వంటి రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ అవార్డులు ఇస్తారు.

పద్మ విభూషణ్‌ అత్యున్నత స్థాయి విశిష్ట సేవలకు ఇస్తారు. పద్మ భూషణ్‌ ఉన్నత స్థాయి విశిష్ట సేవలకు ప్రదానం చేస్తారు. ఏ రంగంలోనైనా విశేష సేవలు అందించిన వారికి పద్మశ్రీ పురస్కారం అందజేస్తారు.

తెలుగు రాష్ట్రాల వారు వీళ్లే  
రాష్ట్రపతి చేతుల మీదుగా సోమవారం పద్మ అవార్డులు అందుకున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు మామిడాల జగదీశ్‌, దీపికా రెడ్డి, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, డాక్టర్ గూడూరు వెంకటరావు, వెంపటి కుటుంబ శాస్త్రి, పాలకొండ విజయ్ ఆనంద రెడ్డి. 

ఇంకా.. 
ఎన్‌. రాజం‌కు పద్మ విభూషణ్‌ పురస్కారం ప్రదానం చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వయోలిన్ విద్వాంసురాలిగా ఆమె గుర్తింపు పొందారు.

పుదుచ్చేరికి చెందిన సిలంబం కళాకారుడు కె. పజనివేల్‌కు సంప్రదాయ యుద్ధ కళల రంగంలో చేసిన సేవలకు పద్మశ్రీ పురస్కారం అందించారు.

పారా హైజంప్‌లో పారాలింపిక్ స్వర్ణ పతక విజేత ప్రవీణ్ కుమార్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేశారు.

ప్రకటనల రంగ ప్రముఖుడు దివంగత పీయూష్ పాండేకు పద్మ భూషణ్‌ పురస్కారం ప్రకటించారు. ఈ అవార్డును ఆయన భార్య నీతా జోషి స్వీకరించారు.

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు క్రీడల రంగంలో చేసిన సేవలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మశ్రీ పురస్కారం అందించారు. వీరితో పాటు మొత్తం 66 మంది సోమవారం పద్మ అవార్డులు అందుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement