రైల్వే ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు 

Oxygen Plants In Railway Hospitals - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్‌–19 నివారణకు జరుగుతున్న ప్రయత్నాలలో రైల్వే పూర్తిస్థాయిలో సహకారం అందిస్తోంది. అవసరమైన ప్రాంతాలకు అత్యంత వేగంగా ఆక్సిజన్‌ తరలిస్తున్న రైల్వేలు మరోవైపు ప్రయాణికులు, సరకులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ఇదే సమయంలో కోవిడ్‌ బారినపడే తన సిబ్బందికి అవసరమైన వైద్య సౌకర్యాలను అందించే అంశంపై రైల్వేశాఖ దృష్టి సారించింది. తమ ఉద్యోగుల కోసం రైల్వేశాఖ దేశంలోని వివిధ ప్రాంతాల్లో 86 వరకు ఆసుపత్రులను నిర్వహిస్తోంది. వీటిలో కొత్తగా ఆక్సిజన్‌ ప్లాంట్లు  ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే నాలుగు ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. మరో 52 ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరు అయ్యాయి. మిగిలిన 30 ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. కోవిడ్‌ ఆసుపత్రులుగా సేవలు అందిస్తున్న అన్ని రైల్వే ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయి.

ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి రూ.2 కోట్ల వరకూ నిధులు విడుదల చేసే అధికారాన్ని జనరల్‌ మేనేజర్లకు రైల్వే శాఖ కల్పించింది.  వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొనే వచ్చే అంశంపై కూడా రైల్వేశాఖ దృష్టి సారించింది. కోవిడ్‌ చికిత్స అందించడానికి పడకల సంఖ్యను 2,539 నుంచి 6,972కి పెంచారు. ఇదేవిధంగా కోవిడ్‌ ఆస్పత్రుల్లో ఐసీయూ పడకల సంఖ్యను 273 నుంచి 573కి పెంచింది. వెంటిలేటర్ల సంఖ్య 62 నుంచి 296కు పెంచింది. కోవిడ్‌ బారిన పడిన రైల్వే ఉద్యోగులు అవసరమైతే వైద్యుల సిఫార్సు మేరకు ఎంపానెల్డ్‌ ఆసుపత్రులలో చేరడానికి కూడా వీలు కల్పిస్తూ  ఇటీవల రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top