న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐఏ)లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో శుక్రవారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో 100 కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని విమానయాన సంస్థలు తెలిపాయి. ‘ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)వ్యవస్థలో సాంకేతిక సమస్యల కారణంగా, ఐజీఐఏలో విమానయాన కార్యకలాపాలు ఆలస్యం అవుతున్నాయి. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు సాంకేతిక సిబ్బంది వారి భాగస్వాములతో చురుకుగా పనిచేస్తున్నారు. తాజా అప్‌డేట్‌ల కోసం కోసం ప్రయాణికులు తమ విమానయాన సంస్థలతో టచ్‌లో ఉండాలని సూచించాయి.
Delhi Airport issues a statement - "Due to a technical issue with the Air Traffic Control (ATC) system, flight operations at IGIA are experiencing delays. Their team is actively working with all stakeholders including DIAL to resolve it at the earliest. Passengers are advised to… pic.twitter.com/RZgYFTFatQ
— ANI (@ANI) November 7, 2025
ఢిల్లీ విమానాశ్రయంలో ప్రతిరోజూ 1,500కు పైగా విమానాల రాకపోకలు కొనసాగుతుంటాయి. తాజాగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు వాటికవే విమాన ప్రణాళికలను నిర్వహించలేకపోతున్నాయి. ఆటో ట్రాక్ సిస్టమ్ (ఏఎంఎస్)కు సమాచారాన్ని అందించే ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ (ఎఎంఎస్‌ఎస్)లో కొన్ని సమస్యలు తలెత్తాయి. ఇది విమానయాన ప్రణాళికలను అందిస్తుందని విమాన సంస్థలు పీటీఐకి తెలిపాయి. సిస్టమ్ సమస్యలు కొనసాగుతున్నందున, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు అందుబాటులో ఉన్న డేటాతో విమాన ప్రణాళికలను మాన్యువల్‌గా సిద్ధం చేస్తున్నారు. ఇది కొంతమేరకు సమయం తీసుకునే ప్రక్రియ కావడంతో పలు విమానాలు ఆలస్యం అవుతున్నాయి.
‘ఎయిర్ ఇండియా’ తన ప్రయాణికులకు సలహా జారీ చేస్తూ ‘ఢిల్లీలోని ఏటీసీ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య .. అన్ని విమానయాన సంస్థల విమాన కార్యకలాపాలను ప్రభావితం చేస్తోంది. ఫలితంగా విమానాల రాకపోకల్లో ఆలస్యం జరుగుతుందని’ తెలియజేసింది. ఇదేవిధంగా విమానయాన సంస్థలు ‘ ఇండిగో’, ‘స్పైస్‌జెట్’లు కూడా తమ ప్రయాణికులకు సలహా జారీ చేశాయి.


