కాషాయం-హస్తం.. బోత్‌ ఆర్‌ సేమ్‌! కాంగ్రెస్‌ లేకుండానే విపక్షాల నావ ముందుకు?

opposition parties Agree On New Front Without Congress - Sakshi

ఢిల్లీ: దేశంలోని విపక్షాలు ఒక్కొక్కటిగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు షాక్‌ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు హస్తం పార్టీకి దూరంగా జరగాలని నిర్ణయించుకున్నాయి. బీజేపీ-కాంగ్రెస్‌లను దొందూ దొందుగానే భావిస్తున్న విపక్షాల్లోని కొన్ని పార్టీలు.. 2024 సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్‌ రహిత కొత్త ఫ్రంట్‌తో వెళ్లాలని భావిస్తున్నాయి. తాజాగా.. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ భేటీ ఇదే విషయాన్ని ధృవీకరిస్తోంది కూడా. 

విపక్షాల్లోని మూడు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు.. టీఎంసీ, ఎస్‌పీ, బీజేడీ(బీజూ జనతా దళ్‌)లు కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు కోల్‌కతాలో ఇవాళ(శుక్రవారం) అఖిలేష్‌ యాదవ్‌, మమతా బెనర్జీలు భేటీ కావడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అంతేకాదు.. వచ్చే వారంలో దీదీ, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తోనూ భేటీ కానున్నట్లు స్పష్టత వచ్చింది. 

బీజేపీ స్ట్రాటజీకి కౌంటర్‌గా?
లండన్‌ ప్రసంగంపై విమర్శల వంకతో.. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీని విపక్షాల నాయకుడిగా చూపించే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఈ పరిణామం విపక్షాల్లోని కొన్ని పార్టీలకు ఏమాత్రం నచ్చడం లేదు. అందుకే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌కు పూర్తి దూరంగా జరగాలని భావిస్తున్నాయి.  ఒకవైపు మమతా బెనర్జీ, మరోవైపు అఖిలేష్‌ యాదవ్‌.. ఇద్దరూ కూడా బీజేపీ, కాంగ్రెస్‌ను సమానంగా చూడాలని, రెండింటినీ దూరంగానే పెట్టాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై టీఎంసీ ఎంపీ సుదీప్‌ బంధోపాధ్యాయ మరింత స్పష్టత ఇచ్చారు.  

‘‘రాహుల్‌ గాంధీ ఎక్కడో విదేశాల్లో వ్యాఖ్యలు చేశారు. కానీ, బీజేపీ క్షమాపణలు కోరుతూ పార్లమెంట్‌ను అడ్డుకుంటోంది. కాంగ్రెస్‌ను అడ్డుపెట్టుకుని పార్లమెంట్‌ కార్యకలాపాలను అడ్డుకోవాలని బీజేపీ యత్నిస్తోందన్న విషయం స్పష్టమవుతోంది. రాహుల్‌ను విపక్షాల ప్రతినిధిగా చూపించడం ద్వారా.. లాభపడొచ్చని బీజేపీ భావిస్తోంది. కానీ, 2024 ఎన్నికలకు ప్రధాని అభ్యర్థిత్వాన్ని నిర్ణయించే అవసరం లేదు కదా..  అని సుదీప్‌ వ్యాఖ్యానించారు. విపక్షాలను కాంగ్రెస్‌ ఒక బిగ్‌ బాస్‌ లాంటిదన్నది భ్రాంతేనన్న టీఎంసీ ఎంపీ.. బీజేపీ, కాంగ్రెస్‌లతో సంబంధం లేకుండా విపక్షాలు ఏకతాటిపైకి వచ్చే ప్రయత్నాలు మొదలైనట్లు స్పష్టత ఇచ్చారు. అయితే.. దీనిని థర్డ్‌ ఫ్రంట్‌ అని చెప్పలేమని, కానీ, బీజేపీని ఢీ కొట్టడానికి ప్రాంతీయ పార్టీల్ని బలపడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

బెంగాల్‌లో మేం మమతా దీదీతోనే ఉన్నాం. ప్రస్తుతానికి బీజేపీ, కాంగ్రెస్‌లను సమానంగా చూడాలనే ఉద్దేశంలో మేం ఉన్నాం అంటూ ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ చెప్పుకొచ్చారు. మరోవైపు కాంగ్రెస్‌తో దోస్తీ, బీజేపీ జట్టు కంటే ప్రమాదకరమైందని వ్యాఖ్యానించిన దీదీ.. ఇకపై రెండు పార్టీలను సమానంగానే చూస్తామంటూ వ్యాఖ్యానించడం విశేషం.

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top