అస్తిపంజరంతో బ్యాంక్‌కు.. అసలు జరిగింది ఇదే! | Odisha Tribal Man Brings Sister Skeleton To Bank In Protest Over Withdrawal Rules, Sparks Nationwide Debate, Videos Went Viral | Sakshi
Sakshi News home page

అస్తిపంజరంతో బ్యాంక్‌కు.. అసలు జరిగింది ఇదే!

Apr 29 2026 12:12 PM | Updated on Apr 29 2026 12:51 PM

Odisha Tribal man carries sister skeleton to bank

ఓ గిరిజనుడు తన సోదరి సమాధిని తవ్వి, ఆమె అస్థిపంజరాన్ని భుజాన మోసుకుని బ్యాంకు అధికారుల ముందు ప్రదర్శించిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. మీడియా, సోషల్‌ మీడియా ద్వారా ఇది బాగా వైరల్‌ అయ్యింది కూడా. ఈ ఘటన కలచి వేసిందని సాక్షాత్తూ ఆ రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నియంత్రణ శాఖల మంత్రి సురేష్‌ పూజారి అనడం.. విపక్షాల విమర్శలకూ తావిచ్చింది. అయితే.. 

ఘటన వైరల్‌ అయిన నేపథ్యంలో జీతూ ముండాకే ఎక్కువ మంది సపోర్ట్‌గా నిలిచారు. వ్యవస్థలోని లోపాలు, అవగాహన లోపం, పేదరికం.. అంశాలతో పెద్ద చర్చే నడిచింది. ఏదైతేనేం బాధిత కుటుంబానికి అందాల్సిన డబ్బు అందింది. అయితే సంబంధిత బ్యాంకు మాత్రం వాస్తవాలు తెలుసుకోకుండా సగం సగం సమాచారంతో తమను తొట్టిపోయడం సరికాదని అంటోంది. ఫ్యాక్ట్‌ చెక్‌ పేరిట అసలేం జరిగిందో చెప్పే ప్రయత్నం చేసింది. 

కేంఝర్‌ జిల్లా దియానలి గ్రామానికి కల్రా ముండాకు (56) ఒడిశా గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ బ్యాంకులో ఖాతా ఉంది. పశువులు అమ్మేయగా వచ్చిన సొమ్మును ఆమె ఆ ఖాతాలో జమ చేసుకుంది. అయితే ఈ ఏడాది జనవరిలో ఆమె కన్నుమూసింది. దీంతో ఆ సొమ్ము కోసం ఆమె సోదరుడు జీతూ ముండా (50) బ్యాంకు అధికారుల్ని సంప్రదించాడు. 

ఆమె వస్తేనే ఆ డబ్బు ఇవ్వడం కుదరుతుందని బ్యాంకు అధికారులు అతనితో చెప్పారు. ఆమె చనిపోయిందన్నా వినలేదు. దీంతో సాక్ష్యం కోసం ఆమె సమాధి తవ్వి ఎర్రటి ఎండలో భుజాన వేసుకుని బ్యాంకు దగ్గరికి వచ్చాడు. కంగారుపడిపోయిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడం.. ఈలోపు అతన్ని కొందరు వీడియోలు తీసి నెట్‌లో పెట్టారు. ఈలోపు పోలీసులు కలగజేసుకుని అతనికి న్యాయం చేస్తామని సర్దిచెప్పి.. ఆ అస్తిపంజరాన్ని తిరిగి సమాధిలోకి చేర్చారు. సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఈ ఘటన వైరల్‌ కావడంతో.. మంగళవారం అధికారులు స్పందించారు. కల్రా ముండా డెత్‌ సర్టిఫికెట్‌తో పాటు లీగల్‌ హెయిర్‌ సర్టిఫికెట్లు కూడా జీతూ ముండా, మిగతా సోదరీమణుల చేతికి అప్పగించారు. ఆ వెంటనే గ్రామీణ బ్యాంక్‌ అధికారులు కదిలారు. వాళ్లకు రావాల్సిన రూ.19, 402 సొమ్మును అందజేశారు. అదే సమయంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ వాళ్లకు ఆ కుటుంబ దీనావస్థ గురించి తెలిసి మరో రూ.30 వేలను అందించింది.  

అయితే.. బ్యాంకు మాత్రం జరిగింది వేరని చెబుతోంది. విత్‌డ్రా సొమ్ము కోసం జీతూ ముండా బ్యాంకుకు వచ్చిన మాట వాస్తవమే. కానీ, అప్పటికే ఆయన మద్యం సేవించి ఉన్నాడు. ఆ మత్తులో ఉండడం, పైగా నిరక్షరాస్యుడు కావడంతో మా సిబ్బంది చెప్పింది అతనికి అర్థం కాలేదు. 

చనిపోయిన వ్యక్తి ఖాతాలో ఎమౌంట్‌ను విత్‌డ్రా చేసే అధికారం.. నామినీకి తప్ప మూడో వ్యక్తికి ఉండదు. అందుకే డబ్బు ఇవ్వడం కుదరదని బ్యాంక్‌ సిబ్బంది చెప్పారు. ఆమె చనిపోయినట్లు డెత్‌ సర్టిఫికెట్‌ తీసుకురావాలని.. అదీ కుదరకుంటే నామీనిని అయినా తీసుకు రమ్మని చెప్పారు. అప్పటికే మత్తులో ఉన్న ఆయనకు అదేదీ అర్థం కాలేదు.. 

మా ఉద్దేశం డిపాజిటర్‌ డబ్బును రక్షించడం, నియమాలను పాటించడం మాత్రమే. బ్యాంకు సిబ్బంది ఖాతాదారులను వేధింపులకు గురి చేస్తున్నారనడంలో ఎలాంటి వాస్తవం లేదని ఒడిషా గ్రామీణ బ్యాంకుకు స్పాన్సర్‌షిప్‌ చేస్తున్న ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ ఒక ట్వీట్‌ చేసింది. 

 

ఎవరేమంటున్నారు.. 

  • ‘నా సోదరి మరణించిందని చెప్పినా బ్యాంకు సిబ్బంది వినలేదు. ఆమెను తీసుకొని వస్తేనే డబ్బు ఇస్తామన్నారు. ఏం చేయాలో పాలుపోక నా సోదరి అస్థిపంజరాన్ని తీసుకొచ్చి ఆమె మరణించిన విషయాన్ని రుజువు చేయాలనుకున్నా’.. జీతూ ముండా

  • మా సోదరుడు డబ్బు కోసం బ్యాంకు చుట్టూ తిరిగాడు. అక్కడి సిబ్బంది ఇవ్వకుండా అతన్ని వేధించారు. ఏం చేయాలో సరిగా వివరించలేదు. భరించలేకే ఆ పని చేశాడు. అందుకే అధికారులు దిగొచ్చి మా డబ్బు మాకు ఇచ్చారు .. జీతూ మిగిలిన ఇద్దరు సోదరీమణులు

  • మరణించిన వ్యక్తిని బ్యాంకుకు తీసుకురావాలని మేము ఎప్పుడూ చెప్పలేదు. అవసరమైన పత్రాలు అందించమని మాత్రమే కోరాం. అవి అందిన వెంటనే రూ.19,402 మొత్తాన్ని ముగ్గురికీ అందించాం.. బ్యాంకు అధికారులు

  • జీతు ముండా, కల్రా ముండాలు నిరక్షరాస్యులు. నామినీ, లీగల్ హెయిర్ అనే విషయాల గురించి తెలియదు. అకౌంట్‌లు ఇచ్చే సమయంలో అత్యుత్సాహం చూపించే సిబ్బంది కూడా సరైన విధంగా వివరించలేదు.. స్థానిక పోలీసులు

  • డబ్బు ఎలా తీసుకోవాలో జీతూ ముండా కుటుంబానికి అవగాహన లేకుండా పోయింది. అదే సమయంలో వాళ్లకు అర్థమయ్యేలా వివరించడంలో బ్యాంకు సిబ్బంది కూడా విఫలమయ్యారు.. గ్రామస్తులు

  • బ్యాంకు అధికారులకు ఆ పెద్దాయన భలే బుద్ధి చెప్పారు అని కొందరు.. ఇలాంటి విషయాల్లో ఖాతాదారులకు కనీస అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని మరికొందరు నెటిజన్లు అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement