యువత భవితకు కొత్త రెక్కలు: ప్రధాని మోదీ | Noida International Airport Jewar Inauguration by PM Modi | Sakshi
Sakshi News home page

యువత భవితకు కొత్త రెక్కలు: ప్రధాని మోదీ

Mar 28 2026 12:02 PM | Updated on Mar 28 2026 1:18 PM

Noida International Airport Jewar  Inauguration by PM Modi

జేవార్‌ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమయ్యింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (జేవార్) శనివారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ఎయిర్‌పోర్ట్.. దేశ విమానయాన రంగంలో సరికొత్త రికార్డులకు వేదిక కానుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ  ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలైందని, ‘వికసిత యూపీ, వికసిత భారత్' లక్ష్యంలో భాగంగా నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం యువత భవిష్యత్తుకు కొత్త రెక్కలు ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఈ ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేసి, నేడు ప్రారంభించడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, అత్యధిక అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన రాష్ట్రంగా యూపీ అవతరించడం గర్వకారణమని పేర్కొన్నారు.

తనను ప్రతినిధిగా ఎన్నుకున్న ఈ రాష్ట్రం ఇకపై ఈ భారీ విమానాశ్రయంతో అంతర్జాతీయ గుర్తింపు పొందుతుందని ఆయన అన్నారు. ఇదే వేదికపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, గత 11-12 ఏళ్లలో ప్రధాని మోదీ నాయకత్వంలో 'నవ భారత్' అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని కొనియాడారు. 2002 నుండి 2017 వరకు కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల అసమర్థత వల్ల రాష్ట్రం అభివృద్ధిలో స్తబ్ధతను ఎదుర్కొందని, అయితే గత తొమ్మిదేళ్లుగా 'డబుల్ ఇంజిన్' ప్రభుత్వం తీసుకున్న వేగవంతమైన చర్యల వల్ల ఉత్తరప్రదేశ్ నేడు అంతర్జాతీయ ఏవియేషన్ మ్యాప్‌లో ప్రముఖ స్థానాన్ని దక్కించుకుందని అన్నారు. 
 

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంపై  ఏర్పడుతున్న విపరీతమైన రద్దీని తగ్గించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. దాదాపు రూ.11,200 కోట్ల వ్యయంతో, 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో (ఎఫ్‌డీఐ)జ్యూరిచ్ ఎయిర్‌పోర్ట్ ఇంటర్నేషనల్ దీనిని నిర్మించింది. నోయిడా, మీరట్, ఘజియాబాద్, మథుర, ఆగ్రా తదితరప్రధాన నగరాలకు ఇది ప్రధాన కేంద్రంగా మారనుంది. పర్యాటకంతో పాటు ఆధ్యాత్మిక కేంద్రాలకు ఇది ముఖద్వారంగా నిలవనుంది.
 

కట్టుదిట్టమైన భద్రత.. ట్రాఫిక్ ఆంక్షలు
ప్రధాని పర్యటన నేపథ్యంలో జేవార్‌లో ఐదు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 5,000 మంది పోలీసులు, ఎస్పీజీ, ఏటీఎస్, సీఐఎస్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రాంతాన్ని ‘నో ఫ్లై జోన్’గా ప్రకటించారు. మరోవైపు, ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు యమునా ఎక్స్‌ప్రెస్‌వే,  పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా వెళ్లే భారీ వాహనాలను మళ్లించారు. అయితే, అంబులెన్స్‌లు, ఇతర అత్యవసర వాహనాలకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.  ఈ ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement