ముస్లిం కోటా ఉండబోదు | No reservation to Muslims: Amit Shah | Sakshi
Sakshi News home page

ముస్లిం కోటా ఉండబోదు

Apr 17 2026 5:01 AM | Updated on Apr 17 2026 5:01 AM

No reservation to Muslims: Amit Shah

అది రాజ్యాంగవిరుద్ధం: అమిత్‌ షా

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్లలో ముస్లింలకు కోటా ప్రత్యేక ఉండబోదని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. ‘‘మతపరమైన రిజర్వేషన్లకు రాజ్యాంగం అనుమతించబోదు. అవి రాజ్యాంగ విరుద్ధం. కనుక ముస్లిం మహిళలకు మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించే ప్రస్తకే లేదు’’అంటూ కుండబద్దలు కొట్టారు. మహిళా రిజర్వేషన్ల చట్టం అమలు నిమిత్తం కేంద్రం గురువారం లోక్‌సభ లో మూడు బిల్లులు ప్రవేశపెట్టడం తెలిసిందే. వాటిపై చర్చ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు అఖిలేశ్‌యాదవ్, ధర్మేంద్ర యాదవ్‌ మాట్లాడుతూ ముస్లిం మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ‘‘మహిళలు జనాభాలో సగ భాగం. ముస్లిం మహిళలను వారిలో భాగంగా పరిగణించడం లేదా?’’అని అఖిలేశ్‌ ప్రశ్నించారు.

మహిళా రిజర్వేషన్లు ఓబీసీ, ముస్లిం మహిళలకు కూడా వర్తించేలా నిబంధనలు చేర్చాలని డిమాండ్‌ చేశారు. లేదంటే సవరణ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇవ్వబోదన్నారు. తాజా బిల్లులను ఉపసంహరించుకుని 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మహిళా రిజర్వేషన్ల చట్టంలో వెనుకబడిన తరగతులతో పాటు ముస్లిం మహిళలను కూడా చేర్చాలని ధర్మేంద్ర యాదవ్‌ కోరారు. దీనిపై అమిత్‌ షా తీవ్రంగా స్పందించారు. వారి డిమాండ్‌ను తోసిపుచ్చారు. ‘‘సమాజ్‌వాదీ పార్టీ కావాలనుకుంటే అన్ని టికెట్లూ ముస్లిం మహిళలకే ఇచ్చుకొమ్మనండి. ఎవరొద్దంటున్నారు? మాకైతే ఏ అభ్యంతరమూ ఉండబోదు’’అని మంత్రి వ్యాఖ్యానించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement