దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరగనున్నాయా? | No proposal to hike fuel prices says central government | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరగనున్నాయా?.. కేంద్రం ఏమన్నదంటే

Apr 28 2026 7:50 PM | Updated on Apr 28 2026 8:08 PM

No proposal to hike fuel prices says central government

సాక్షి,న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ అనంతరం కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరల్ని పెంచనుందనే ప్రచారం జోరందకుంది. అయితే, ఆ ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఇంధన ధరల్ని పెంచడం లేదని స్పష్టం చేసింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరుగుతున్నా, ఇంధన రిటైలర్లు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నా ప్రజల మీద భారం వేయకుండా ధరలను స్థిరంగా ఉంచుతామని తెలిపింది.

ఈ మేరకు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయనే ఊహాగానాలు కొన్ని రాష్ట్రాల్లో కలకలం రేపాయి. దీనివల్ల అవసరానికి మించి ఇంధన కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇంధన ధరల పెంపుదలపై వస్తున్నవన్నీ ఊహాగానాలే. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ప్రతిపాదన లేదు. వదంతులను నమ్మొద్దు. దేశంలో తగినంత పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ నిల్వలు ఉన్నాయి. ధరలు స్థిరంగా ఉన్నాయి, రేట్లలో ఎలాంటి పెరుగుదల ఉండదు’అని స్పష్టం చేశారు.  

పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు కారణంగా చమురు ధరలు పెరుగుతున్నా.. కేంద్రం పెట్రోల్, డీజిల్‌ ధర‌ల్ని స్థిరంగా ఉంచింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రభుత్వరంగ చమురు సంస్థలు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు ఇంధనాన్ని విక్రయించడం వల్ల భారీ నష్టాల్ని చవిచూస్తున్నాయి. ఫలితంగా పెట్రోల్‌పై లీటరుకు రూ. 20 వరకు, డీజిల్‌పై లీటరుకు దాదాపు రూ.100 వరకు నష్టాలు వస్తున్నాయి.  రోజువారీ నష్టాలు సుమారు రూ.2,400 కోట్ల వరకు చేరుతున్నాయని కొద్దిరోజుల క్రితం సుజాత శర్మ  తెలిపారు. 

పెరిగిన  చమురు ధరలు 
గత రెండు నెలల్లో అంతర్జాతీయ ముడి చమురు ధరలు 50 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో ఈ పెరుగుదల మరింత తీవ్రంగా మారింది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడులు ప్రారంభించాయి. ప్రతీకారంగా ఇరాన్‌ హర్మూజ్‌జలసంధిని మూసివేసింది. ఫలితంగా గల్ఫ్‌ దేశాలనుంచి రవాణా అయ్యే చమురు నౌకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గత సంవత్సరం బ్యారెల్‌కు సుమారు 70 డాలర్లుగా ఉన్న ముడి చమురు ధర, ఈ నెలలో సగటున 114 డాలర్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగినా, భారత్‌లో రిటైల్ ఇంధన ధరలు ఏప్రిల్ 2022 నుండి ఇప్పటివరకు మారలేదు.  

Advertisement
 
Advertisement
Advertisement