వసూలు చేస్తే చర్యలు తప్పవు: సీసీపీఏ
న్యూఢిల్లీ: ఎల్పీజీ కొరతను సాకుగా చూపించి హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగదారులపై అధిక చార్జీలు విధిస్తున్నారు. ఫుడ్ బిల్లులో ఎల్పీజీ రుసుము, గ్యాస్ సర్‌చార్జి, ఇతర చార్జీలు జోడిస్తున్నారు. అసలు బిల్లుపై అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ(సీసీపీఏ) ఆగ్రహం వ్యక్తంచేసింది. అలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది.
ఈ మేరకు తాజాగా ఉత్తర్వు జారీ చేసింది. వినయోగదారుల పరిరక్షణ చట్టం–2019 ప్రకారం నిర్దేశిత రుసుములు మాత్రమే వసూలు చేయాలని స్పష్టంచేసింది. అధిక చార్జీలపై ప్రజల నుంచి తమకు ఫిర్యాదులు అందినట్లు సీసీపీఏ వెల్లడించింది. మీడియాలోనూ దీనిపై వార్తలు వచ్చినట్లు తెలిపింది. ఆహార పదార్థాలపై మెనూలో ప్రదర్శించిన రుసుములే ఫైనల్ అని పేర్కొంది. వాటిపై వర్తించే పన్నులు మినహా అదనంగా వసూలు చేయకూడదని హోటళ్లు, రెస్టారెంట్లను ఆదేశించింది.


