దావూద్‌పై ఎన్‌ఐఏ రూ.25 లక్షల బౌంటీ.. అండర్‌ వరల్డ్‌ డాన్‌పై ఎన్ని కేసులన్నాయంటే..

NIA Declared Rs 25 Lakh Bounty on Dawood Ibrahim - Sakshi

ఢిల్లీ: గ్లోబల్‌ టెర్రరిస్ట్‌, అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంపై భారీ రివార్డు ప్రకటించింది భారత ఉగ్రవాద వ్యతిరేక సంస్థ ఎన్‌ఐఏ. దావూద్‌ గురించి సమాచారం అందించిన వాళ్లకు పాతిక లక్షల రూపాయలు అందిస్తామని ప్రకటించింది. దావూద్‌తో పాటు అతని అనుచరుడు చోటా షకీల్‌ మీద కూడా రూ.20 లక్షలు ప్రకటించింది జాతీయ విచారణ సంస్థ. 

భారత ఉగ్రవాద వ్యతిరేక విభాగాల్లో టాప్‌ అయిన ఎన్‌ఐఏ.. తాజాగా దావూద్‌కు సంబంధించి ఫొటోను సైతం విడుదల చేసింది. దావూద్‌, చోటా షకీల్‌తో పాటు ఉగ్రవాదులైన అనీస్‌ ఇబ్రహీం, జావెద్‌ చిక్నా, టైగర్‌ మెమోన్‌ల మీద రూ.15 లక్షల బౌంటీ ప్రకటించింది ఎన్‌ఐఏ. 

దావూద్‌తో పాటు ఇతరులంతా కలిసి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన లష్కరే తాయిబా, జైషే మొహమ్మద్‌, అల్‌ కాయిదాలతో కలిసి పని చేస్తున్నారని, బడా వ్యాపారవేత్తలను, రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకున్నారని ఎన్‌ఐఏ ఒక ప్రకటనలో పేర్కొంది. వీళ్ల గురించి సమాచారం అందించిన వాళ్లకు రివార్డు అందిస్తామని పేర్కొంది.

1993 ముంబై పేలుళ్ల సూత్రధారి అయిన దావూద్‌ ఇబ్రహీం.. పన్నెండు చోట్ల పేలుళ్లతో 257 మంది అమాయకుల మరణానికి, 700 మంది గాయపడడానికి కారణం అయ్యాడు.

► గ్లోబల్‌ టెర్రరిస్ట్‌గా ఐరాస భద్రతా మండలి దావూద్‌ను గుర్తించగా.. అరెస్ట్‌ను తప్పించుకోవడానికి దావూద్‌ పాక్‌లో తలదాచుకున్నాడు. ఈ విషయాన్ని 2018లో భారత్‌ సైతం ధృవీకరించింది. తాజాగా భద్రతా మండలి రిలీజ్‌ చేసిన ఉగ్రవాద జాబితాలో దావూద్‌ ఉండగా.. కరాచీ పేరిట అతని చిరునామా సైతం ఉండడం గమనార్హం. 

► అక్రమ ఆయుధాలు, మాదకద్రవ్యాలు, నకిలీ భారతీయ కరెన్సీ నోట్లను అక్రమంగా తరలించడానికి పాకిస్తాన్ ఏజెన్సీలు, ఉగ్రవాద సంస్థల సహాయంతో ఉగ్రవాద దాడులను నిర్వహించడానికి డీ-కంపెనీ భారతదేశంలో ఒక యూనిట్‌ను ఏర్పాటు చేసిందని దర్యాప్తులో తేలింది.

► మే నెలలో ఎన్‌ఐఏ 29 ప్రాంతాల్లో దాడులు చేసింది. అందులో హాజీ అలీ దర్గా, మహిమ్ దర్గా ట్రస్టీ అయిన సమీర్ హింగోరా(1993 ముంబై పేలుళ్లలో దోషి), సలీం ఖురేషీ(ఛోటా షకీల్ బావమరిది), ఇతరులకు చెందిన ప్రాంతాలు ఉన్నాయి. 

► 2003లో, దావూద్ ఇబ్రహీంను భారతదేశం, అమెరికాలు గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తించాయి. అంతేకాదు 1993 ముంబై పేలుళ్ల సూత్రధారిపై 25 మిలియన్ల డాలర్ల రివార్డును సైతం ప్రకటించాయి.

ముంబై బాంబు పేలుళ్ల కేసు, పలు ఉగ్ర సంబంధిత కార్యకలాపాలతో పాటు దోపిడీలు, హత్యలు, స్మగ్లింగ్ కేసుల్లో నిందితుడిగా దావూద్‌పై కేసులు నమోదు అయ్యాయి. 

► 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో, దావూద్ తాజ్ మహల్ హోటల్‌తో సహా నగరంలో పేలుళ్లకు ఉగ్రవాదులను తరలించాడు. 

► 2013 ఐపీఎల్‌ సమయంలో తన సోదరుడు అనీస్‌ సాయంతో బెట్టింగ్‌ రాకెట్‌ను దావూద్‌ నడిపించాడని కొన్ని జాతీయ మీడియా హౌజ్‌లు కథనాలు వెలువరించాయి. 

► డీ కంపెనీ..  ప్రస్తుతం ఆఫ్రికా దేశాలను పట్టి పీడిస్తోందని, నైజీరియాకు చెందిన బోకో హరామ్‌ ఉగ్ర సంస్థలో పెట్టుబడులు పెట్టిందని సమాచారం.

ఇదీ చదవండి: శాఖ మార్చిన కాసేపటికే మంత్రి రాజీనామా

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top