
40–50లలో మనం తీసుకునే ఆహారమే ప్రధానం
ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షుకూ అదే రక్షణ కవచం
మలివయసులోనూ ఉల్లాసంగా, ఉత్సాహంగా
చూడటానికి ఇరవై ఏళ్లు తక్కువ వాళ్లలా కనిపించే 60–70 ఏళ్ల వాళ్లను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది! వాళ్ల ఫిట్‌నెస్, ఆరోగ్య రహస్యం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తాం. క్రమబద్ధమైన వ్యాయామం, కొలతల ప్రకారం ఆహారం, కంటి నిండా నిద్ర, జిమ్ము, స్విమ్మింగ్ ఇవన్నీ కారణాలు కావచ్చు. ‘ప్రధాన కారణం మాత్రం వాళ్లు తీసుకుంటున్న ఆహారమే’అని తాజా అధ్యయనం చెబుతోంది.
40, 50లలో మీరేం తింటున్నారన్నది 60, 70లలో మీ ఆరోగ్యం ఎలా ఉండబోతోందో నిర్ణయిస్తుంది అని పరిశోధకులు అంటున్నారు. ప్రముఖ మెడికల్ జర్నల్ ‘నేచర్ మెడిసిన్’తాజా సంచికలో వచ్చిన ఈ అధ్యయన వ్యాసం వృద్ధాప్య ఆరోగ్యానికి సరికొత్త నిర్వచనం ఇచ్చింది. – సాక్షి, స్పెషల్ డెస్క్
మనం తినే ఆహారమే.. మన ఆలోచనను, ఆరోగ్యాన్ని, ఆయుష్షును నిర్ణయిస్తుంది. ముఖ్యంగా 40–50లలో ఉన్నప్పుడు ఆహారం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇదే విషయాన్ని అధ్యయనాలూ చెబుతున్నాయి. నడి వయసులో ఉన్నప్పుడు ఎంచుకున్న ఆహారం.. మిమ్మల్ని ఆరోగ్యంగా వృద్ధాప్యంలోకి తీసుకెళ్తుంది, వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా ఉంచుతుంది అని అధ్యయనంలో పాల్గొన్న హార్వర్డ్ టి.హెచ్. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్; కోపెన్‌హెగెన్, మాంట్రియల్ విశ్వవిద్యాలయాల పరిశోధకులు వెల్లడించారు. దీర్ఘాయుష్షుకు, ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి ఆహారమే కీలకం అని తాము కనుగొన్నట్లు వారు తెలిపారు.
లక్షకుపైగా వ్యక్తులపై అధ్యయనం
ఆరోగ్యకరమైన ఆహారానికి, దీర్ఘాయుష్షుకు మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోటానికి పరిశోధకులు హార్వర్డ్ టి.హెచ్. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిర్వహించిన రెండు అధ్యయనాల డేటా పరిశీలించారు. అందులో మొద టిది పూర్తిగా మహిళలపై చేసిన ‘నర్సెస్ హెల్త్ స్టడీ’, రెండోది పురుషులపై చేసిన ‘హెల్త్ ప్రొఫెషనల్స్ ఫాలో అప్ స్టడీ’. 30 సంవత్సరాల కాలంలో, 39–69 ఏళ్ల మధ్య వయసు కలిగిన లక్షకుపైగా మహిళలు, పురుషుల ఆహారపు అలవాట్లు, ఆరోగ్య ఫలితాలు ఆ డేటాలో ఉన్నాయి.
ప్రత్యామ్నాయ ఆరోగ్యకర ఆహార సూచీ, కేవలం మొక్కల ఆధారిత ఆహార సూచీ, అధిక మధుమేహాన్ని తగ్గించే ఆహార సూచీ, హైపర్‌టెన్షన్‌ను తగ్గించే ఆహార సూచీ.. ఇలా 8 రకాల ఆహార విధానాలతో కూడిన ఆరోగ్య సంబంధ ప్రశ్న పత్రాలు ఇచ్చి, వాటిలో వేటిని పాటించారో రాయమని కోరినప్పుడు వచ్చిన సమాధానాలతో ఆ డేటా తయారైంది. దాన్నే యూనివరటీ పరిశోధకులు విశ్లేíÙంచి, ‘ఆహారమే దీర్ఘాయుష్షుకు కారణం’అని కనిపెట్టారు.
విశ్లేషణలో ఏం వెల్లడయింది?
పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, గింజలు, చిక్కుళ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా తీసుకుని.. ప్రాసెస్ చేసిన మాంసం, చక్కెర ఉండే పానీయాలు, ఉప్పు, రిఫైన్డ్ ధాన్యాలు లేదా గింజలు తక్కువగా తీసుకునే ‘ప్రత్యామ్నాయ ఆరోగ్యకర ఆహార సూచీ’అన్నింటికంటే అత్యుత్తమమైనదని అధ్యయనంలో తేలింది. భవిష్యత్ దీర్ఘకాలిక తీవ్ర వ్యాధులను నివారించటంలో ఇది మంచి తోడ్పాటును ఇచ్చిoది.
70 ఏళ్ల వయసులోనూ దిటువుగా ఉన్నవారు ఈ విధానంలో 86 శాతం కంటే ఎక్కువ మంది ఉన్నారు. తక్కిన విధానాలతో పోలిస్తే ఇది 2.2 రెట్లు ఎక్కువగా వృద్ధాప్యపు ఆరోగ్యానికి ఉపయోగపడింది. అదే సమయంలో కృత్రిమ పదార్థాలు, అధిక చక్కెరలు, సోడియం, సంతృప్త కొవ్వులు, అ్రల్టా–ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకున్నవారి ఆరోగ్య స్థాయిలు తక్కువగా ఉన్నట్లు గమనించారు. సర్వేలో పాల్గొన్నవారిలో 9,771 మంది (9.3 శాతం) తమ వృద్ధాప్యంలోకి చక్కటి శారీరక, మానసిక ఆరోగ్యంతో ప్రవేశించారు.
శాకాహారమే వృద్ధాప్య బలం
దీర్ఘాయుష్షు అంటే పరిశోధకుల ఉద్దేశంలో ఎన్నేళ్లు జీవించామన్నదొక్కటే కాదు.. ఎంత నాణ్యంగా జీవించామన్నది కూడా. శాకాహారాన్ని సమృద్ధిగా తీసుకుంటూ; మాంసాహారాన్ని, అల్ట్రా–ప్రాసెస్డ్ ఫుడ్‌ను మితంగా తీసుకోవటమే శారీరకంగానూ, మానసికంగానూ వృద్ధాప్య ఆరోగ్య సంరక్షణకు కీలకం అని అధ్యయనం స్పష్టం చేసింది.
వృద్ధాప్యానికి చేటు తెచ్చేవి
అ్రల్టా–ప్రాసెస్డ్ ఆహారాలు.. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన మాంసం; చక్కెర ఉండే, డైట్ పానీయాలు ఎక్కువగా తీసుకున్నవారిలో ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని పొందే భాగ్యం తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ‘వ్యక్తుల ఆరోగ్యం, ప్రజారోగ్య వ్యవస్థ రెండింటికీ చాలా ప్రాధాన్యం ఉంటుంది కనుక ఆరోగ్యకరమైన వృద్ధాప్యం మీద పరిశోధనలు చాలా అవసరం.
భవిష్యత్ ఆహార మార్గదర్శకాలను రూపొందించటానికి ఇవి సహాయపడతాయి’అని కోపెన్‌హెగెన్ విశ్వవిద్యాలయ ప్రజారోగ్య విభాగం ప్రొఫెసర్, హార్వర్డ్ చాన్ స్కూల్‌లోని పోషకాహార పాఠ్యాంశ నిపుణురాలు మార్తా గ్వాష్ ఫెర్రీ అంటున్నారు. అయితే ‘మంచి ఆహారం’అని తాము గుర్తించినది అందరి విషయంలో ఒకే విధంగా ప్రభావం చూపించకపోవచ్చని, అది వ్యక్తుల శారీరక, మానసిక స్వభావాలను బట్టి ఉంటుందని ఈ అధ్యయనంలో పాల్గొన్న సహ పరిశోధకురాలు యానీ జూలీ టెస్సియర్ చెబుతున్నారు.
‘ప్రత్యామ్నాయ ఆహార విధానం’
భవిష్యత్ దీర్ఘకాలిక వ్యాధుల నివారణలో అధికంగా తోడ్పడిన విధానం
ఇవి ఎక్కువ
పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, గింజలు, చిక్కుళ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు
ఇవి తక్కువ
ప్రాసెస్ చేసిన మాంసం, చక్కెర ఉండే పానీయాలు, ఉప్పు, రిఫైన్డ్ ధాన్యాలు లేదా గింజలు
దీర్ఘాయువుకు శత్రువులు
» అ్రల్టా–ప్రాసెస్డ్ ఆహారాలు
» ప్రాసెస్డ్ మాంసం
» చక్కెర ఉండేవి, డైట్ పానీయాలు