నీట్‌ కౌన్సెలింగ్‌పై స్టే ఇవ్వలేం: సుప్రీం కోర్టు | NEET News: Supreme Court No Stay On NEET Hearings June 13 Updates | Sakshi
Sakshi News home page

నీట్‌ కౌన్సెలింగ్‌పై స్టే ఇవ్వలేం: సుప్రీం కోర్టు.. ఆ 1,500 మందికి మళ్లీ పరీక్ష

Published Thu, Jun 13 2024 11:00 AM | Last Updated on Thu, Jun 13 2024 7:49 PM

NEET News: Supreme Court No Stay On NEET Hearings June 13 Updates

నీట్‌ యూజీ ఫలితాల కౌన్సెలింగ్‌ స్టేకు సుప్రీం కోర్టు నిరాకరణ

కౌన్సెలింగ్‌ ఆపలేమని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెకేషన్‌ బెంచ్‌ వ్యాఖ్య

నీట్‌ ఫలితాలపై దాఖలైన పిటిషన్‌లో కేంద్రం, ఎన్టీఏకు సుప్రీం నోటీసులు

వివాదాస్పద గ్రేస్‌ మార్కుల నిర్ణయం వెనక్కి తీసుకున్న కేంద్రం

1,563 మందికి మళ్లీ పరీక్ష.. ఈ నెలలోనే ఫలితాలు: ఎన్టీఏ

షెడ్యూల్‌ ప్రకారం జులై 6నే కౌన్సెలింగ్‌?!

ప్రశార్థకంగా విద్యాశాఖ వేసిన గ్రేస్‌ మార్కుల పునఃపరిశీలన కమిటీ భవితవ్యం! 

న్యూఢిల్లీ, సాక్షి: నీట్‌ యూజీ 2024 కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలంటూ దాఖలైన అభ్యర్థనను సుప్రీం కోర్టు వెకేషన్‌ బెంచ్‌ తోసిపుచ్చింది. కౌన్సెలింగ్‌పై స్టే విధించేందుకు నిరాకరించింది. అయితే ఈ పిటిషన్‌పై విచారణలో భాగంగా.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)తోపాటు కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. మరోవైపు వివాదాస్పదంగా మారిన గ్రేస్‌ మార్కుల అంశంలో కేంద్రం యూటర్న్‌ తీసుకుంది.  

ఎంబీబీఎస్, బీడీఎస్‌.. ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌) యూజీ 2024ను సవాల్‌ చేస్తూ దాఖలైన మూడు పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. నీట్‌ కౌన్సెలింగ్‌ను ఆపేది లేదని.. కొనసాగుతుందని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. 

‘‘కౌన్సెలింగ్ కొనసాగుతుంది. మేము దానిని ఆపబోం. పరీక్ష పూర్తైంది కాబట్టి మిగతాది అంతా సజావుగా సాగుతుంది. కాబట్టి భయపడాల్సిన పనిలేదు’’ అని వెకేషన్‌ బెంచ్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.  

రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలంటూ కేంద్రం, ఎన్టీఏకు నోటీసులు జారీ చేస్తూ.. పిటిషన్‌పై తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది. జులై 6వ తేదీ నుంచి నీట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. 

మరోవైపు వివాదాస్పద గ్రేస్‌ మార్కుల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకుంది. అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న 1,563 మంది ఫలితాలను నిలిపివేశామని, వాళ్లకు  ఈ నెల 23న మళ్లీ పరీక్ష విధిస్తామని.. 30న ఫలితాలు వెల్లడిస్తామని, ఆ తర్వాతే కౌన్సెలింగ్‌ చేపడతామని(జులై 6లోపు పూర్తి చేస్తామని) ఎన్టీఏ కోర్టుకు నివేదించింది. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా చూస్తామని ఈ సందర్భంగా ఎన్టీఏ కోర్టుకు తెలిపింది.

ఈ ఏడాది నీట్‌ ప్రవేశ పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు రాశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 67 మంది విద్యార్ధులు 720కి 720 మార్కులు సాధించారు. హరియాణాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు తొలి ర్యాంక్‌ రావడంతో అనుమానాలు తలెత్తాయి. ఇంత మంది టాప్‌ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్‌ మార్కులు కారణమని ఇటీవల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మరోవైపు ఎన్నికల ఫలితాలకు ముందురోజు హడావిడిగా ఫలితాలు విడుదల చేయడంపైనా రాజకీయపరమైన విమర్శలు సైతం చెలరేగాయి. దీంతో నీట్‌లో అవినీతి, అక్రమాలు చోటు ఉండబోదని చెబుతూ ఎన్టీఏ మీడియా ముందుకు వచ్చింది.  

 ఈ క్రమంలోనే  ‘ఫిజిక్స్‌ వాలా’ విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలఖ్‌ పాండే దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ విద్యార్థులకు ర్యాండమ్‌గా 70 నుంచి 80 మార్కులు కలిపారని అన్నారు. పరీక్ష నిర్వహణపై ఒక స్వతంత్ర ఉన్నత స్థాయి కమిటీతో దర్యాప్తు చేయించాలని కోరారు. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఏ పాలసీ ప్రకారం గ్రేస్‌ మార్కులు ఇచ్చారో ఎన్టీఏ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఇంకోవైపు విద్యాశాఖ నీట్‌ గ్రేస్‌ మార్కుల పునఃసమీక్ష కోసం ఓ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా గ్రేస్‌ మార్క్‌ల నిర్ణయాన్ని వెక్కి తీసుకోవడం, ఆ 1500 మందికి మళ్లీ పరీక్ష నిర్వహించాలన్న నిర్ణయంతో ఆ కమిటీ భవితవ్యం ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement