కనీసం.. సారీ చెప్పాలని అనిపించలేదా? | NEET 2026 aspirant Aadrika Bajpai writes an emotional letter to NTA | Sakshi
Sakshi News home page

కనీసం.. సారీ చెప్పాలని అనిపించలేదా?

May 19 2026 4:39 AM | Updated on May 19 2026 4:39 AM

NEET 2026 aspirant Aadrika Bajpai writes an emotional letter to NTA

నీట్‌–యూజీ ఉదంతంలో ఎన్‌టీఏకు రాసిన లేఖలో పరీక్షార్థి సూటిప్రశ్న

లీకేజీల దేశంలో ఉన్నందుకు మేమెంతో గరి్వస్తున్నామని ఎలా చెప్పగలను? 

ఇలాంటి వ్యవస్థలో మేం బాధితులుగా మిగిలిపోవాల్సిందేనా? 

ఎగ్జామ్‌హాల్‌ వద్ద మమ్మల్ని పలురకాలుగా చెక్‌చేసే మీరు 

లీకేజీ జరక్కుండా జాగ్రత్తలు తీసుకోరా? 

మా డాక్టర్‌ కలల సౌధాన్ని కూల్చేశారు 

పరీక్ష కోసం నెలలతరబడి శ్రమించి సన్నద్ధమైనదంతా వృథా అయిందని ఆవేదన

నీట్‌–యూజీ అనేది ఐదో తరగతి లేదా పదో తరగతి వంటి సాధారణ పరీక్ష కానేకాదు. ఉన్నత చదువుల భవితవ్యాన్ని నిర్దేశించే అత్యంత కీలక ప్రవేశ పరీక్ష. దాని కోసం లక్షలాది మంది విద్యార్థులు నెలల తరబడి రాత్రింబవళ్లు కష్టపడి చదివి సంసిద్ధమవుతారు. శాయశక్తులా కృషిచేసి పరీక్షరాశాక వారం పది రోజులకే అది రద్దయిందని ప్రకటిస్తే అన్ని రోజులు పడిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే. 

అలా పన్నీరుగా మారుతున్న పరీక్షార్థుల శ్రమ నుంచే ఆగ్రహాగ్ని పుట్టింది. నిమ్మకు నీరెత్తినట్లు మౌనంగా ఉండిపోయిన ఈ పరీక్షల నిర్వహణ సంస్థ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్య వైఖరిపై ప్రశ్నిస్తూ నీట్‌–యూజీ అభ్యర్థిని ఆద్రికా బాజ్‌పేయీ ఎన్‌టీఏకు ఒక లేఖ రాశారు. ఇప్పుడా లేఖ ఆన్‌లైన్‌లో విస్తృతంగా షేర్‌ అవుతోంది. 

ఆ లేఖ పూర్తిపాఠం ఇదీ.. 
‘‘నాకు 18 ఏళ్లు. ఈఏడాది నీట్‌–యూజీ పరీక్షను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాశా. 12వ తరగతిలో ఉన్నప్పటి నుంచే దీని కోసం ప్రిపరేషన్‌ మొదలెట్టా. సోషల్‌మీడియా ఖాతాల జోలికి పోలేదు. స్నేహితులతో కబుర్లు కట్టిపెట్టా. బంధువుల పార్టీలకు వెళ్లడం మానేశా. నీట్‌పరీక్షపైనే పూర్తిగా దృష్టిపెట్టి తోబుట్టువులతోనూ పెద్దగా మాట్లాడటం మానేశా. ఇన్ని త్యాగాలు ఎందుకు చేశానో తెలుసా. డాక్టర్‌ కావడం నా కల. వైద్యవృత్తిలో స్థిరపడాలని నిర్ణయించుకున్నా. 

పరీక్ష దగ్గరపడుతున్న కొద్దీ నాలో ఆందోళన ఎగసింది. పరీక్షకు పది రోజుల ముందు ఎన్‌టీఏ ఒక హెచ్చరిక చేసింది. ఇది స్కూల్‌ పరీక్షవంటి ఆషామాషీ పరీక్షకాదు జాతీయస్థాయిలో అభ్యర్థులను వడబోసే భారీ క్రతువు అని ప్రకటించింది. నీట్‌–యూజీ అనేది స్కూల్‌పరీక్ష కాదు. కనీసం స్కూల్‌లో ప్రశ్నపత్రం లీకేజీ అనేది ఎక్కడా వినలేదు చూడలేదు. మాకు మాత్రం మీరు సుద్దులు చెబుతారు. 

అంకితభావంలో మేం మీకంటే 10 రెట్లు ఎక్కువ అని బీరాలు పలికారు. ఇది నిజంగా మీరు సిగ్గుపడాల్సిన విషయం. పరీక్షకేంద్రంలోకి అడుగుపెట్టేముందు మమ్మల్ని పలు రకాలుగా చెక్‌చేస్తారు. ఆ డ్రెస్‌ రకం అనుమతిలేదు ఈ షూ వేసుకోవద్దు ఈ హెయిర్‌బ్యాండ్, స్మార్ట్‌వాచ్‌ పెట్టుకోవద్దు అని సవాలక్ష షరతులు పెడతారు. జుట్టు ముడివేసుకుని అంతా విప్పేసి వేళ్లు దూర్చి మరీ చెక్‌చేశారు. టీ–షర్ట్‌ బటన్లనూ కత్తిరించారు, ప్యాంట్‌లకున్న జేబులనూ కత్తిరించారు.

 ఇక పోలీసులు, ప్రైవేట్‌ సెక్యూరిటీ సంగతి చెప్పనక్కర్లేదు. ఎగ్జామ్‌హాల్‌లోకి కనీసం ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే నీళ్లసీసాను కూడా అనుమతించలేదు. మేమేమైనా పేపర్‌ లీక్‌ చేసే ముఠా సభ్యులమా? మా కలలను సాకారం చేసుకునేందుకు మీరు పెట్టే ఇలాంటి ఎన్నో కండీషన్లనూ మేం భరించాం. అయినా ఇంతటి తనిఖీలుచూశాక ఇక పేపర్‌ లీక్‌ కాదు అనే భరోసాతో పరీక్ష హాల్‌లోకి వెళ్లా. 

ఇంతాచేసి అక్కడికెళ్లాక మేం ఎగ్జామ్‌లో ప్రశ్నలతో కంటే బయటి వ్యవస్థతోనే అతిపెద్ద యుద్ధం చేయాల్సి వస్తోంది. వ్యవస్థలో ఒకరిద్దరు తప్పుచేసినా మొత్తం ఎగ్జామినేషన్‌ వ్యవస్థ అభాసుపాలవుతోంది. ఇక్కడితో ఇది ఆగట్లేదు. ఎన్‌టీఏను ట్విట్టర్‌ ఖాతాలో లక్షలాది మంది విద్యార్థులు అడిగే సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేస్తోంది. అయినాసరే కనీసం ఈసారి అయినా ఇలా జరగదేమోననే ఆశతో పరీక్షరాశా. మళ్లీ మా నమ్మకాన్ని ఎన్‌టీఏ వమ్ముచేసింది.

 జాగ్రత్తలో మాకంటే నాలుగు ఆకులు ఎక్కువ చదువుకున్నామని చెప్పే ఎన్‌టీఏ ఇప్పుడు మమ్మల్ని నిరాశ లోయలో నెట్టేసి చేతులు దులిపేసుకుంటోంది. అయినాసరే వీటన్నింటినీ భరిస్తూ మేం మరోసారి పుస్తకాల పురుగులుగా మారేందుకు సిద్ధపడతాం. మా కలల సాకారం కోసం కష్టపడక తప్పదు. 

కానీ తప్పుచేసిన మీకు కనీసం సారీ అయినా చెప్పాలని అనిపించలేదా? ఇంత జరిగాక కూడా అభ్యర్థులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలనే స్పృహ మీకు ఎప్పుడొస్తుంది? జాతీయస్థాయిలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఇలాంటి పరీక్షపేపర్‌ లీక్‌ అయితే బాధ్యతాయుత స్థాయిలో ఉన్న మీ నుంచి మేం సారీ ఆశించకూడదా?. మాకెన్ని కలలున్నాయో మీరు కనీసం ఒక్కసారైనా ఊహించారా? పరీక్ష పూర్తయ్యాక తోబుట్టువులతో హాయిగా ఉండొచ్చని సంబరపడ్డాం. 

రెండ్రోజుల్లోనే ఆకాశం విరిగిపడినట్లు దుర్వార్త మోసుకొచ్చారు. మళ్లీ పరీక్ష పెడతారని తెల్సిన క్షణాన వరదలో ఇల్లు మొత్తం కొట్టుకుపోయినంత విషాదం మాలో అలుముకుంది. మా డాక్టర్‌ కలల సౌధాన్ని కూల్చేశారు. అప్పుడు 11 ఏళ్ల నా చెల్లి నాతో ఒకమాట చెప్పింది. ‘‘అక్కా అతిగా ఆశలుపెట్టుకోకు. దేశంలో మన భవిష్యత్తు గురించి ఎవరికీ పట్టదు’’అన్న మాటలు నా మనసుని మెలిపెట్టాయి. చెల్లి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నా దగ్గర మాటల్లేవు. 

ఇంత జరిగినా వ్యవస్థ మనతోనే ఉంది అని చెల్లికి ఎలా భరోసా ఇవ్వాలి? ఇలాంటి వ్యవస్థలో మేం బాధితులుగా మిగిలిపోవాల్సిందేనా? అభద్రతాభావం అనేది ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందో నాకు ఇప్పుడు అర్థమైంది. భారత్‌లో ఉన్నత విద్యనభ్యసించడం తమకు ఇష్టంలేదు అని తోబుట్టువులు చెప్పారు. ఇలాంటి తరుణంలో ‘ఈ దేశంలో ఉన్నందుకు మేమెంతో గర్విస్తున్నాం’అని ఎలా చెప్పగలను? ఒకవేళ సరిహద్దు కంచెలు లేకపోయినాసరే నేను ఈ దేశంలోనే ఉండిపోతా అని చెప్పగలనా?. చెప్పలేనేమో. ఎందుకంటే నిబంధనలు అనేవి కాగితం పులులుగా మారిపోయాయి. మీపట్ల మా నమ్మకం ప్రతిసారీ వమ్ము అవుతోంది. కష్టపడి చదివిన చదువుకు, ప్రిపరేషన్‌కు విలువ ఉన్న చోటే ఉండాలనుకుంటున్నాను. ఇట్లు, ఎంతో అసంతృప్తి చెందిన మీ పరీక్షార్థి’’.

–సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement