NEC Meet 2022: ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడులు పెరగాలి

NEC Meet 2022: Investments increase in North Eastern states says Union Minister G Kishan Reddy - Sakshi

ఎన్‌ఈసీ ప్లీనరీ సమావేశాల్లో కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రి కిషన్‌ రెడ్డి

గువాహటి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటకాభివృద్ధికి ఉన్న విస్తృత అవకాశాలను ప్రోత్సహించే లక్ష్యంతో త్వరలో టూరిజం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేయనున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడించారు. గువాహటిలో శనివారం ప్రారంభమైన రెండు రోజుల 70వ ఈశాన్య రాష్ట్రాల మండలి(ఎన్‌ఈసీ) ప్లీనరీ సమావేశాల్లో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు.

‘ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడులకు అనువైన వాతావరణ కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి. ప్రైవేట్‌ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈశాన్య రాష్ట్రాలతో కలిపి అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు(గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమిట్‌)ను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం’ అని కిషన్‌ రెడ్డి అన్నారు.

‘ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడిదారులకు అనువైన విధానపర నిర్ణయాలు, భూ బ్యాంకు డిజిటలీకరణ( అందుబాటులో ఎక్కడ ఎంత భూమి ఉంది), పెట్టుబడుల నిబంధనల సరళీకరణ, సింగిల్‌ విండో నిబంధనల ద్వారా పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణాన్ని సృష్టించాలి. ప్రతి రాష్ట్రంలో ఇన్వెస్టర్స్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ పెట్టాలి’ అని కిషన్‌ రెడ్డి సూచించారు. ‘ఈశాన్య రాష్ట్రాల్లో జాతీయ రహదారుల అభివృద్ధికి మరో రూ.80వేల కోట్లు ఖర్చు చేయనున్నాం. 19 కొత్త రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.60 వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి లేకుండా దేశాభివృద్ధి సంపూర్ణం కాదు’ అని మంత్రి వ్యాఖ్యానించారు. ‘ ఈ రాష్ట్రాల్లో శాంతి స్థాపన కోసం, రాజకీయ స్థిరత్వం కోసం కేంద్రం ప్రయత్నిస్తోంది’ అని ఆయన అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top