జస్టిస్ రాకేష్ కుమార్ రాజీనామా | Sakshi
Sakshi News home page

NCLAT జ్యుడీషియల్ సభ్యుడు జస్టిస్ రాకేష్ కుమార్ రాజీనామా

Published Mon, Oct 30 2023 5:45 PM

NCLAT Judicial Member Justice Rakesh Kumar Resigns - Sakshi

న్యూఢిల్లీ: నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (NCLAT) జ్యూడిషియల్‌ సభ్యుడు జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ తన పదవికి రాజీనామా చేశారు. ట్రిబ్యునల్‌ పదవిలో భాగంగా జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ తీసుకున్న నిర్ణయాలపై సుప్రీంకోర్టు గత వారం వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సోమవారం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ట్రిబ్యునల్‌ చైర్మన్‌ జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, కేంద్ర న్యాయశాఖకు అందజేశారు.

ఫినోలెక్స్‌ కేబుల్‌ కేసులో కోర్టు ధిక్కారణ చర్యలు ఎదుర్కొంటున్నారు జస్టిస్‌ రాకేష్‌కుమార్‌. కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం(AGM) ఫలితాలపై యధాతథా సిత్థిని కొనసాగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి, ఎన్‌సీఎల్‌ఏటీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంపై సీజేఐ జస్టిస్‌ డీవీ చంద్రచూడ్‌ తీవ్రంగా స్పందించారు. జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌తోపాటు ఎన్‌సీఎల్‌ఏటీ టెక్నికల్‌ మెంబర్‌ అలోక్‌ శ్రీవాస్తపై కోర్టు ధిక్కరణ చర్యలకు ఆదేశాలిచ్చారు. కాగా జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ గంతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.

ఏం జరిగింది?
ఫినోలెక్స్ కేబుల్స్ వార్షిక సర్వ సభ్య సమావేశానికి సంబంధించిన కేసులో జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్‌ అలోక్‌ శ్రీవాస్తవలతో కూడిన బెంచ్‌ ట్రిబ్యునల్‌ కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది. కంపెనీ ఓనర్‌షిప్‌కు సంబంధించి ఇద్దరు సోదరులు ప్రకాష్ ఛాబ్రియా, దీపక్ ఛాబ్రియా మధ్య వివాదం నెలకొనడంతో విషయం ట్రిబ్యునల్‌కు చేరింది. కేసును విచారించిన జస్టిస్‌ రాకేష్‌కుమార్‌.. తాము తీర్పు వెలువరించేంతవరకు కంపెనీ యాన్యువల్‌ జనరల్‌ మీటింగ్‌ ఫలితాలపై స్టే విధించింది. 

సుప్రీంకోర్టులో ఏం జరిగింది?
AGMలో ఫలితాలను వెల్లడించొద్దంటూ ట్రిబ్యునల్‌లో ఇచ్చిన తీర్పును ఫినోలెక్స్‌ కేబుల్స్‌ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. కేసును విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ట్రిబ్యునల్‌ ఇచ్చిన స్టేను సెప్టెంబర్‌ 20, 2023న తొలగించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పిటిషనర్‌.. ట్రిబ్యునల్‌ ముందు ఉంచగా.. వాటిని పట్టించుకోలేదు. ఈ విషయాన్ని మళ్లీ సుప్రీంకోర్టుకు తెలిపారు పిటిషనర్‌. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌.. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలంటూ ట్రిబ్యునల్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ను ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులను పక్కనబెట్టినట్టు తేలితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

కోర్టు ధిక్కరణ తేలడంతో రాజీనామా
సుప్రీంకోర్టులో తాము చేసింది కోర్టు ధిక్కరణ అని తేలడంతో జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన లాయర్‌ PS పట్వాలియా సుప్రీంకోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించే ఉద్దేశ్యం లేదని, అయితే కోర్టు ధిక్కరణ అని తేలినందున తన పదవి నుంచి జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ తప్పుకున్నారని పట్వాలియా తెలిపారు. తనపై వచ్చిన అభియోగాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని, ఇప్పటికే రాజీనామా ఇచ్చినందున ఈ కేసును మూసివేయాలని పట్వాలియా సుప్రీంకోర్టును కోరారు. 

సుప్రీంకోర్టు ఏం తేల్చింది?
జస్టిస్‌ రాకేష్‌ తరపున పట్వాలియా చేసిన విజ్ఞప్తిని చీఫ్‌ జస్టిస్‌ DY చంద్రచూడ్‌, జస్టిస్‌ JB పార్డీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా స్వీకరించారు. "NCLAT పదవికి, ఆర్థిక శాఖ లా సెక్రటరీ పదవికి జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ రాజీనామా చేసినట్టు ఆయన తరపు లాయర్‌ పట్వాలియా ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కనబెట్టే ప్రయత్నం జరిగిందని మేం నమ్ముతున్నాం. అక్టోబర్‌ 13న NCLATలో జరిగిన పరిణామాలకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను చూశాం. కనీసం సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా తన ఆదేశాలను మార్చేందుకు ట్రిబ్యునల్‌ ఆసక్తి చూపలేదు. అయితే ఈ కేసును ఇంతటితో ముగిస్తున్నాం. " అని బెంచ్‌ తెలిపింది.

జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ గతమేంటీ?
జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జడ్జిగా పనిచేసిన సమయంలో అమరావతి రాజధాని అంశంపై ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వుల్లో పలు వివాదస్పద వ్యాఖ్యలు జోడించడంమే కాకుండా.. రాజ్యాంగ సంక్షోభం అంటూ కొన్ని కామెంట్లు చేశారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయగా.. జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ ఇచ్చిన తీర్పును తీవ్రంగా తప్పుబట్టింది సుప్రీంకోర్టు. జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నాయని, రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందంటూ చేసిన వ్యాఖ్యలు సరికావని సూచించింది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement