సిన్సియర్‌ సమీర్‌ వాంఖడే.. రోలెక్స్‌ వాచీ, ఫారిన్‌ ట్రిప్పులు, కోట్లు విలువ చేసే ప్లాట్‌లు?!

ncb Sensational Allegations On Sameer Wankhede - Sakshi

సిన్సియర్‌ ఆఫీసర్‌గా పేరొందిన సమీర్‌ వాంఖడే సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆర్యన్‌ ఖాన్‌ అరెస్ట్‌ వ్యవహారంలో ఈ నార్కోటిక్స్‌ మాజీ అధికారి అక్రమంగా వ్యవహరించాడంటూ సీబీఐ చెబుతోంది. ఆర్యన్‌ను ఈ కేసులో ఇరికించకుండా ఉండేందుకు ఆయన, మరికొందరు కలిసి పాతిక కోట్ల రూపాయల లంచం షారూఖ్‌ ఖాన్‌ కుటుంబం నుంచి డిమాండ్‌ చేశారనే అభియోగాలతో ముందుకు వెళ్తోంది సీబీఐ. అయితే.. 

ఆదాయంతో సంబంధం లేకుండా అడ్డగొలుగా ఆయన ఆస్తుల్ని వెనకేసుకున్నారని, అలాగే కుటుంబంతో కలిసి ఫారిన్‌ ట్రిప్పులకూ వెళ్లారని నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(NCB) ఒక నివేదిక రూపొందించింది. ఈ నివేదిక ఆధారంగానే ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసిన సీబీఐ.. తన దర్యాప్తు కొనసాగించడం గమనార్హం. సిబిఐ పెట్టిన కేసుపై బాంబే హైకోర్టును ఆశ్రయించిన సమీర్ వాంఖడేకు సోమవారం వరకు ఊరట దక్కింది.

2017 నుంచి 2021 మధ్య సమీర్‌ వాంఖడే ఆరుసార్లు కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లాడు. ఆ జాబితాలో యూకే, ఐర్లాండ్‌, పోర్చ్‌గల్‌, సౌతాఫ్రికా, మాల్దీవ్స్‌ ఉన్నాయి. దాదాపు 55 రోజులు ఆ ట్రిపుల్లో గడిపాడు. ఆ పర్యటనల కోసం కేవలం రూ.8 లక్షల 75 వేలు మాత్రమే ఖర్చు చేశానని నివేదించాడాయన.  కానీ, ఆ ఖర్చు విమాన ప్రయాణాలకే సరిపోతుందని అధికారులు అంటున్నారు. 

ఇక సమీర్‌ వాంఖడే ఆస్తులకు సంబంధించి కూడా విస్తూపోయే విషయాల్ని వెల్లడించింది ఎన్సీబీ రిపోర్ట్‌. సమీర్‌, ఆయన భార్య ఇద్దరి ఆదాయం కలిపి ఏడాదికి 45 లక్షల రూపాయలుగా ఐటీ రిటర్న్స్‌లో చూపించారు. కానీ, చేతికి 17 లక్షల రూపాయలకు తక్కువకాని ఓ రోలెక్స్‌ వాచీతో   పాటు ముంబైలో కోట్లు ఖరీదు చేసే నాలుగు ప్లాట్‌లు, అలాగే.. వాసిం ఏరియాలో 41 వేల ఎకరాల జాగా ఆయన పేరు మీద ఉన్నట్లు తెలిపింది. ఇక కొత్తగా 82 లక్షల రూపాయలకు మరో ప్లాట్‌ను కొన్నారాయన. అయితే.. గోరేగావ్‌లో ఉన్న ఆ ప్లాట్ విలువ రూ.2.45 కోట్లుగా అధికారులు తేల్చారు. ఇవేకాదు.. పెళ్లికి ముందు కోటికి పైగా విలువ చేసే ఓ ప్లాట్‌ను సమీర్‌ ఖరీదు చేశాడు. అయితే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దానికి సమీర్‌ లెక్కలు చూపించలేదని సీబీఐ అంటోంది. 

సెలబ్రిటీ పేరు వింటే.. 
నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ముంబై విభాగం) మాజీ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేపై స్థానిక మోడల్‌ మున్‌మున్‌ దామెచా సంచలన ఆరోపణలు చేశారు. కార్డిలియా డ్రగ్స్‌ వ్యవహారంలో అరెస్ట్‌ అయ్యి.. బెయిల్‌ మీద బయట ఉన్నారామె. ‘‘సమీర్‌కు పబ్లిసిటీ పిచ్చి. సెలబ్రిటీ అని తెలిస్తే చాలూ.. వాళ్లను ఏదో ఒకరకంగా జైలుకు పంపించేవాళ్లు. అలా మీడియాలో నానడం ఆయనకు ఇష్టం. అందుకే మోడల్స్‌ను, సెలబ్రిటీలను ఆయన టార్గెట్‌గా చేసుకునేవాళ్లు. ఈ కేసులో అన్యాయంగా నన్ను ఇరికించారాయన. తొలుత నాకేం కాదని ధైర్యం చెప్పే యత్నం చేశారు. ఆపై తాను ఒక మోడల్‌ అని తెలియగానే.. అరెస్ట్‌ చేయాలని ఆదేశించారు. కస్టడీలో ఉన్నప్పుడు కూడా తనను మానసికంగా వేధించారని తెలిపారామె.    

ఎన్‌సీబీ విజిలెన్స్‌ రిపోర్ట్‌ ప్రకారం.. ముంబైలో కార్డిలియా క్రూయిజ్‌ మీద దాడి జరిగాక.. ఆర్యన్‌ ఖాన్‌తో పాటు అతని స్నేహితుడు అర్బాజ్‌ మర్చంట్‌ పేర్లను చివరి నిమిషంలో సమీర్‌ టీం యాడ్‌ చేసింది. 2021, అక్టోబర్‌ 3వ తేదీన ఆర్యన్‌ ఖాన్‌ను అరెస్ట్‌ చేసింది.  అలాగే.. రోలింగ్‌ పేపర్‌తో పట్టుబడ్డ ఓ యువతిని మాత్రం వదిలేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో ఆర్యన్‌ ఖాన్‌ కస్టడీ విషయంలో సమీర్‌ వాంఖడే వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిచ్చింది.అలాగే.. ఆర్యన్‌ను ఎన్‌సీబీ కార్యాలయానికి తీసుకొచ్చిన వ్యవహారానికి సంబంధించి తేడాలు కనిపిస్తున్నాయి అని ఎన్‌సీబీ విజిలెన్స్‌ నివేదిక వెల్లడించింది. 

సమీర్‌కు ఊరట
ఇదిలా ఉంటే సీబీఐ తనపై అరెస్ట్‌ సహా ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టకుండా ఆదేశించాలని కోరుతూ సమీర్‌ వాంఖడే బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కేసు తనపై ప్రతీకార చర్యగానే ఉందంటూ పిటిషన్‌లో పేర్కొన్నారాయన. ఈ క్రమంలో.. ఆయనకు ఊరట లభించింది. సోమవారం(22, మే) దాకా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐని శుక్రవారం ఆదేశించింది బాంబే హైకోర్టు. గురువారం ఆయన సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. ఆయన మాత్రం గైర్హాజరు అయ్యారు. మరోవైపు.. ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ జ్ఞానేశ్వర్‌ సింగ్‌ తనను కులం పేరుతో దూషించారని, వేధింపులకు గురి చేశారని సమీర్‌ వాంఖడే ఆరోపిస్తున్నారు. ఆర్యన్‌ ఖాన్‌ను డ్రగ్స్‌ కేసు నుంచి బయటపడేసేందుకే జ్ఞానేశ్వర్‌ తనపై సీబీఐను ప్రయోగించారంటూ సంచలన ఆరోపణలు చేశారు కూడా.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top