సైనిక దళాల ఏకీకరణ అత్యవసరం! | Naval theatre command to bolster India maritime security | Sakshi
Sakshi News home page

సైనిక దళాల ఏకీకరణ అత్యవసరం!

May 31 2026 12:47 AM | Updated on May 31 2026 12:47 AM

Naval theatre command to bolster India maritime security

త్రివిధ దళాలు, కోస్ట్‌ గార్డ్‌ సామర్థ్యాలను మిళితం చేయాలి 

నావల్‌ థియేటర్‌ కమాండ్‌ను ఏర్పాటు చేసుకోవాలి 

భారత నావికాదళం చీఫ్‌ అడ్మిరల్‌ దినేశ్‌ కె.త్రిపాఠి సూచన

న్యూఢిల్లీ: త్రివిధ దళాలు, కోస్ట్‌ గార్డ్‌ సామర్థ్యాలను మిళితం చేసి ఒక ప్రత్యేక నావల్‌ థియేటర్‌ కమాండ్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత నావికాదళం అధిపతి అడ్మిరల్‌ దినేశ్‌ కె.త్రిపాఠి చెప్పారు. సముద్ర భద్రత (మారి టైమ్‌ సెక్యూరిటీ) అనేది ఇంధన భద్రత, జాతీయ భద్రతతో నేరుగా ముడిపడి ఉందని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంఘర్షణను ఉదహరించారు. 

భారతదేశ సముద్ర భద్రత, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి నావల్‌ థియేటర్‌ కమాండ్‌ను ఏర్పాటు చేయా లని ప్రతిపాదించారు. ఆయన శనివారం ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. నావల్‌ కమాండ్‌ థియేటరైజేషన్‌ అనేది కేవలం సంస్థాగత పునర్నిర్మాణంపై మాత్రమే కాకుండా, కార్యాచరణ సామర్థ్యం, జాతీయ సైనిక సామర్థ్యం పెంపుదల ద్వారా జరగాలని తెలిపారు. వేర్వేరు సైనిక దళాల ఏకీకరణను ఒక భావనగా కాకుండా పోరాట అవసరంగా పరిగణించాలని సూచించారు. 

ఏదైనా కొత్త ఉమ్మడి నిర్మాణం అనేది విస్తృత జాతీయ లక్ష్యాలు సాధిస్తూనే సముద్ర భద్రతకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలని తేల్చిచెప్పారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న అస్థిరత, రష్యా–ఉక్రెయిన్‌ సంఘర్షణను ప్రస్తావించారు. సంఘర్షణకు దూరంగా ఉండటం అంటే దాని పరిణామాలకు దూరంగా ఉన్నట్లు కాదని పేర్కొన్నారు.

 మన సముద్ర తీరాలు, సరిహద్దులు భద్రంగా ఉంటేనే ఆర్థిక భద్రత, జాతీయ భద్రత సాధ్యమవుతుందని, ఇది చాలా ముఖ్యమైన పాఠమని స్పష్టంచేశారు. నౌకా మార్గాలు, ఇంధన సరఫరాలు, సముద్ర సరుకు రవాణా చైన్లకు కలిగే అంతరాయాలు తక్షణ వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తాయని అన్నారు. బీమా ఖర్చులు పెరిగిపోతాయని, నౌకా రవాణాకు నష్టం వాటిల్లుతుందని చెప్పారు. 

యుద్ధాల్లో విభజన తొలగిపోయింది
నేడు మొత్తం యుద్ధ స్వరూపమే ఒక తీవ్రమైన పరివర్తనకు లోనవుతోందని అడ్మిరల్‌ దినేశ్‌ కె.త్రిపాఠి తెలిపారు. నేటి సముద్ర యుద్ధ క్షేత్రం సముద్రగర్భం నుండి అంతరిక్షం వరకు నిరాటంకంగా విస్తరించిందని అన్నారు. అదే సమయంలో సైబర్, విద్యుదయస్కాంత, సమాచార రంగాలు కూడా అంతే కీలకమైనవిగా మారాయని స్పష్టంచేశారు. ఆధునిక యుద్ధాన్ని దాని వేగం, స్థాయి ద్వారా ఎక్కువగా నిర్వచించే పరిస్థితి వచ్చిందన్నారు. 

వేగం అంటే ఇకపై ఒక ప్రత్యేక సామర్థ్యమని వ్యాఖ్యానించారు. స్వల్పకాలిక, వేగవంతమైన యుద్ధాలు అనే విభజన తొలగిపోయిందన్నారు. సుదూరంలోని లక్ష్యాన్ని ఛేదించే ఆయుధాలు, నిరంతర నిఘా అమల్లోకి వచ్చిన నేటి కాలంలో సంప్రదాయ యుద్ధరీతి ఇకపై రక్షణకు హామీ ఇవ్వదని అన్నారు. అంతేకాకుండా సుంకాలను ఆయుధంగా వాడటం, పరస్పర ఆధారిత సప్లై చైన్లకు అంతరాయాలు కలగడం వల్ల, దేశాలు తమ లాజిస్టిక్స్‌ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు.  

అపూర్వమైన కార్యాచరణ వేగం 
భారత నావికాదళం ఆధునిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకుంటోందని దినేశ్‌ కె.త్రిపాఠి తెలియజేశారు. ‘భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే’ బలగాన్ని నిర్మించేందుకు మానవరహిత వ్యవస్థల రోడ్‌మ్యాప్‌కు అనుగుణంగా అన్ని రంగాల్లో కృత్రిమ మేధ(ఏఐ), క్వాంటమ్‌ టెక్నాలజీలు, స్వయంప్రతిపత్తి పరిష్కా రాలను అనుసంధానిస్తోందని ఆయన అన్నారు. 

భవిష్యత్‌ నౌకాదళం అత్యాధునిక సిబ్బందితో కూడిన ప్లాట్‌ఫామ్‌లతో పాటు తక్కువ ఖర్చుతో అధిక ప్రభావం చూపే మానవరహిత పరిష్కారాలపై దృష్టి పెట్టిందని గుర్తుచేశారు. పరస్పరం అనుసంధానమై, రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతున్న సముద్ర భౌగోళిక పరిస్థితుల్లో భారత నౌకాదళం అపూర్వమైన కార్యాచరణ వేగాన్ని కొనసాగించిందని పేర్కొన్నారు. 

2025లో దాదాపు 11,000 నౌకా దినాలు, 50,000 గంటలకు పైగా విమానయాన సమయాన్ని నమోదు చేసిందని చెప్పారు. గత ఏడాది నావికాదళం సాధించిన విజయాల్లో ఆపరేషన్‌ సింధూర్‌ చాలా ప్రధానమైనదని వివరించారు. ఇది మన సంపూర్ణ పోరాట సంసిద్ధత, కార్యాచరణ పరిధి, సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శించిందని స్పష్టంచేశారు. ఈ ఆపరేషన్‌ సందర్భంగా ప్రదర్శించిన త్రివిధ దళాల సమన్వయం కూడా అంతే ముఖ్యమైనదని వ్యాఖ్యానించారు. ఇది ఉమ్మడి కార్యాచరణ సామర్థ్యానికి పెరుగుతున్న ప్రాముఖ్యతను మరోసారి చాటిచెప్పిందని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement