వాన నీటిని ఒడిసి పట్టండి

Narendra Modi launches Jal Shakti Abhiyan campaign on World Water Day - Sakshi

నదుల అనుసంధానం, జల సంరక్షణ దేశాభివృద్ధికి ఆధారం 

క్యాచ్‌ ద రెయిన్‌ ప్రచార ఉద్యమం ప్రారంభించిన ప్రధాని మోదీ

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో జల సంక్షోభం సవాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వాన నీటిని ఒడిసి పట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. రాబోయే తరాల పట్ల బాధ్యతను ప్రస్తుత తరం నిర్వర్తించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల్లో జల పాలన ప్రాధాన్య అంశంగా తీసుకుందన్నారు. ‘కెన్‌–బెత్వా’నదుల అనుసంధానం ప్రాజెక్టు కార్యరూపం తీసుకురావడానికి సోమవారం ఒప్పంద పత్రాలపై ప్రధాని మోదీ సమక్షంలో ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌లు సంతకం చేశారు.

ఈ సందర్భంగా జలశక్తి అభియాన్‌–‘క్యాచ్‌ ద రెయిన్‌’ప్రచార ఉద్యమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించిన ప్రధాని మోదీ పలు రాష్ట్రాలకు చెందిన సర్పంచులు, వార్డు సభ్యులనుద్దేశించి మాట్లాడారు. జల భద్రత, తగిన జలనిర్వహణ లేకపోతే సత్వర అభివృద్ధి సాధ్యం కాదన్నారు. వర్షాకాలం సమీపించే లోగా చెరువులు, బావుల సామర్థ్యాన్ని పెంచేందుకు పూడికతీసి, శుభ్రం చేసి సిద్ధంగా ఉంచాలనీ, ఈ పనులకు ఉపాధి హామీ పథకం నిధులను పూర్తిగా వినియోగించుకోవాలని తెలిపారు. రానున్న 100 రోజుల్లో ఈ పనులను పూర్తి చేయాలన్నారు. దేశాభివృద్ధి, దేశ స్వావలంబన, దార్శనికత జల వనరులు, నదుల అనుసంధానంపై ఆధారపడి ఉన్నాయన్నారు. ఆరేళ్లుగా జలాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చామన్నారు.

ప్రధానమంత్రి కృషి సింఛాయి యోజన, హర్‌ ఖేత్‌ కో పానీ , ఒక్కొక్క నీటి చుక్కకు మరింత అధిక పంట ప్రచార ఉద్యమాల గురించి, నమామీ గంగే మిషన్, జలజీవన్‌ మిషన్, అటల్‌ భుజల్‌ యోజనల గురించి మాట్లాడుతూ.. పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. వర్షపు నీటిని సమర్థంగా వినియోగించుకోగలిగితే భూగర్భ జలాలపై ఆధారపడడం తగ్గుతుందన్నారు. క్యాచ్‌ ద రెయిన్‌ కార్యక్రమం మార్చి 22 నుంచి నవంబర్‌ 30వ తేదీ వరకు అమలు చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జలశపథం కార్యక్రమంలో అందరూ శపథం చేయాలన్నారు. దేశంలో జలసంక్షోభం రాకుండా ఉండడానికి సత్వర కృషి చేపట్టాల్సి ఉందని,అందులో భాగంగా కెన్‌–బెత్వా అనుసంధానం ఉందన్నారు.

నీటి నాణ్యత పరీక్షల్లో గ్రామీణ ప్రాంతలోని మహిళల్ని భాగస్వాములను చేశామన్నారు. కరోనా కాలంలో 4.5 లక్షల మందికి శిక్షణ ఇచ్చామని, ప్రస్తుతం గ్రామంలో కనీసం ఐదుగురు నీటి నాణ్యత పరీక్ష చేయగలిగే మహిళలు ఉన్నారని ప్రధాని తెలిపారు. జల పాలనలో మహిళలు భాగస్వామ్యం అవుతున్న కొద్దీ ఉత్తమ ఫలితాలు సాధించగలమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కెన్‌–బెత్వా నదుల అనుసంధానానికి యూపీ, ఎంపీల ఒప్పందంతో దేశంలో నదుల అనుసంధాన కార్యక్రమం ప్రారంభమైందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ పేర్కొన్నారు. గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి ఓ అంగీకారానికి రావాలన్నారు. రాష్ట్రాల అంగీకారం తర్వాతే కేంద్రం ముందుకెళ్తుందని షెకావత్‌ స్పష్టం చేశారు.  

రాష్ట్రాలపై చర్చిస్తాం: శ్రీరాం వెదిరె
నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్‌ చైర్మన్‌ శ్రీరాం వెదిరె మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 256 జల సంక్షోభం జిల్లాలోని 1529 బ్లాకుల్లో జలశక్తి అభియాన్‌ తొలిదశ 2019లో ప్రారంభించామన్నారు. రెండోదశలో పట్టణ,గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించామన్నారు. శాస్త్రీయ నీటి సంరక్షణ ప్రణాళిక నిమిత్తం జిల్లాకు రూ.2లక్షల చొప్పున గ్రాంటు ఇచ్చినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 30 నదుల అనుసంధానం ప్రాజెక్టులు చేపడుతున్నామన్నారు. కెన్‌–బెత్వా తర్వాత గోదావరి–కావేరి అనుసంధానంపై దృష్టి సారిస్తున్నామన్నారు. ప్రాజెక్టు సమగ్ర వివరణాత్మక నివేదిక (డీపీఆర్‌) తయారీ దశలో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ప్రాజెక్టుపై ముందుకెళ్తామని శ్రీరాం వెదిరె తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top