
నాగ్‌పూర్:మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన వింతైన ఫ్లైఓవర్ వార్తల్లో నిలిచింది. దీనిపై వెళ్లే వాహనదారులు తికమకపడటం ఖాయం అనిపించేలా దానిని నిర్మించారు. ఇప్పుడు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోనూ ఇలాంటి అద్భుతాన్నే నిర్మించారు. ఈ తాజా ఇంజినీరింగ్ పరిజ్ఞానం ఇప్పుడు అందరి దృష్టిని అలరిస్తోంది. నాగ్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న ఈ ఫ్లైఓవర్ అశోక్ చౌక్ సమీపంలోని ఒక ఇంటి బాల్కనీ భాగం గుండా వెళ్లడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
స్థానికులు దీనిని ఎనిమిదవ అద్భుతం అని అంటున్నారు. భారత జాతీయ రహదారుల అథారిటీ (ఎన్‌హెచ్‌ఏఐ), నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌లు ఒక ఇంటి బాల్కనీ గుండా ఈ నిర్మాణం చేపట్టేమందు ఎందుకు దీనిని గమనించేలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ బాల్కనీ ఫ్లైఓవర్ గురించి ఇంటి యజమాని ప్రవీణ్ పాత్రే, అతని కుమార్తె సృష్టితో పాటు సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే మోహన్ మేట్‌లు మీడియాతో మాట్లాడారు.పాత్రే, అతని కుమార్తె తెలిపిన వివరాల ప్రకారం.. వారి కుటుంబం ఆరు తరాలుగా ఆ ఇంట్లో నివసిస్తోంది. ఈ ఆస్తి దాదాపు 150 సంవత్సరాల నాటిది. ఈ ఇంటిని 25 సంవత్సరాల క్రితం పునరుద్ధరించారు. కాగా ఫ్లైఓవర్ తమ బాల్కనీని ఆనుకంటూ వెళ్లడంపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, భద్రతా ప్రమాదాల గురించి ఆందోళన చెందడం లేదని వారు అన్నారు. అయితే ఈ ఇంటి ప్లాన్‌కు ఆమోదం ఉందా? అని అడిగినప్పుడు వారు తప్పించుకునే సమాధానం ఇచ్చారు.
This is some crazy stuff going on in Nagpur
"Flyover inside my Balcony" 😂@bhaumikgowande @zoru75 @haldilal @public_pulseIN @IndianTechGuide pic.twitter.com/xQW6ejTJNX— Sahil Ghodvinde for Mumbai (@MumbaiCommunit2) September 12, 2025
9.2 కిలోమీటర్ల మేర ఈ ఫ్లైఓవర్‌ను ఎన్‌హెచ్‌ఏఐ పర్యవేక్షణలో రూ. 998 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ వివాదంపై అధికారులు మాట్లాడుతూ దీనిపై ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్‌కు తెలియజేశామన్నారు.ఈ అనధికార నిర్మాణాన్ని కూల్చివేయడం నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత అని అన్నారు. కాగా సౌత్ నాగ్‌పూర్ ఎమ్మెల్యే మోహన్ మేట్ మాట్లాడుతూ ఈ ఫ్లైఓవర్ విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోకపోవడం ఆశ్చర్యపరిచిందన్నారు. దీనికి కారకులైనవారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణం బాల్కనీకి చేరుకునే ముందుగానే సంబంధింత అధికారులు నోటీసు జారీ చేసి, నిర్మాణాన్ని తొలగించి ఉండాల్సిందని ఆయన అన్నారు.