ముంబై: మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) డ్రగ్ ఇన్‌స్పెక్టర్ (గ్రూప్-బి) పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సంచలనం వెలుగుచూసింది. ఈ కేసులో తాత్కాలిక మెరిట్ జాబితాలో ఏడో ర్యాంకు సాధించిన రుతుజా పాటిల్‌ను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నందుర్బార్‌లో అరెస్ట్ చేశారు. దీంతో ఈ కుంభకోణంలో అరెస్టయిన వారి సంఖ్య ఏడుకి చేరింది.
పరీక్షకు ముందే రుతుజా పాటిల్‌కు లీకైన ప్రశ్నపత్రం అందిందని పోలీసులు తెలిపారు. అయితే, అధికారులకు ఎలాంటి అనుమానం రాకుండా ఉండాలనే ప్లాన్‌తో.. కావాలనే 10 ప్రశ్నలకు తప్పు సమాధానాలు రాయాలని నిందితులు ఆమెకు సలహా ఇచ్చినట్లు విచారణలో తేలింది. కోర్టులో హాజరుపరిచిన అనంతరం రుతుజాను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.
మార్చి 22న మహారాష్ట్ర వ్యాప్తంగా ఆరు డివిజనల్ కేంద్రాల్లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ స్క్రీనింగ్ పరీక్ష ఆఫ్‌లైన్‌లో జరిగింది. జూన్ 12న వెలువడిన ఫలితాల్లో 506 మంది ఇంటర్వ్యూలకు అర్హత సాధించగా, జూలైలో ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. అయితే, పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ జూలై 22 నుంచి 26 మధ్య అభ్యర్థులు, ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. లీకైన ప్రశ్నపత్రాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సర్క్యులేట్ అయినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
దీంతో అప్రమత్తమైన ఎంపీఎస్సీ మొత్తం రిక్రూట్‌మెంట్ ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, పారదర్శకత కోసం త్వరలో మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
ఈ పేపర్ లీక్ కుంభకోణంలో ఇప్పటికే ముగ్గురు ఎంపీఎస్సీ అధికారులతో పాటు మొత్తం ఆరుగురిని క్రైమ్ బ్రాంచ్ అరెస్ట్ చేసింది. విశ్వేశ్వర్ దత్తాత్రేయ నకాతే (ఎంపీఎస్సీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్),గోపాల్ భట్టు మరాఠే (ఎంపీఎస్సీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్) అభిజీత్ గణపత్రావ్ లెంద్వే (ఎంపీఎస్సీ అండర్ సెక్రటరీ),ప్రవీణ్ దిలీప్ పాటిల్ (కౌటిల్య అకాడమీ డైరెక్టర్),అమృత్ నామ్‌దేవ్ పాటిల్, లోకేష్ అలియాస్ గౌరవ్ రాజేంద్ర పాటిల్ (సహ నిందితులు),నిందితులంతా కలిసి పరీక్షకు ముందే ప్రశ్నలను సేకరించి, ప్రత్యేక సెట్‌గా తయారు చేసి అనధికార వ్యక్తులకు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.


