మహిళను వేధించాడని కేసు నమోదు
బొమ్మనహళ్ళి, యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా మూడబిదిరె ఠాణా సీఐ సందేశ్ లైంగిక వేధింపులపై ఓ మహిళ ఆరోపణలు చేశాక కొత్త విషయాలు బయటపడుతున్నాయి. న్యాయం కోసం ఠాణాకు వెళ్లిన అనేక మంది మహిళలను ఇతడు అధికార బలంతో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. నీ భర్తను విడిచిపెట్టాలంటూ పడక గదికైనా రావాలి, లేదా రూ.25 లక్షలు ఇవ్వు అని బెదిరించాడని ఓ మహిళ ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది. ఈ సీఐ మీద విచారణ జరిపించాలని ఎమ్మెల్యే ఉమానాథ కోట్యాన్ హోంమంత్రి పరమేశ్వర్‌కు లేఖ రాశారు. మహిళలను వేధించడం, లంచాలు డిమాండ్ చేయడాన్ని ప్రస్తావించారు. కాగా, బాధిత మహిళ సోదరి సీఐని వెనకేసుకు రావడం గమనార్హం. సీఐ సందేశ్ నిరాపరాధి అని, కుటుంబ కలహాల నేపథ్యంలో సీఐపై మా అక్క ఆరోపణలు చేసినట్లు చెప్పింది.
సీఐ సస్పెండ్
సీఐ సందేశ్‌ని మంగళూరు నగర పోలీస్ కమిషనర్ సుదీర్‌కుమార్ రెడ్డి సస్పెండ్ చేశారు. పలు ఆడియోలు, వీడియోలు విడుదల కావడంతో చర్య తీసుకున్నారు. అతనిపై కేసును దర్యాప్తు చేసి నివేదిక అందజేయాలని ఏసీపీ శ్రీకాంత్‌ను ఆదేశించారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశాలతో మూడబిద్రిలో సందేశ్‌పై సుమోటోగా కేసు నమోదైంది. బాధితురాలి కుమారునిపై కూడా దాడి చేశాడని ఫిర్యాదు నమోదైంది. నిన్ను రేప్ చేస్తా, ఎవరు అడ్డుకుంటారో చూస్తా అని బెదిరించాడని బాధిత మహిళ తాజాగా ఆరోపించింది.


