నైరుతి రుతుపవనాలపై ఐఎండీ కీలక ప్రకటన | Monsoon Yet To Enter Kerala Despite Forecast Of Early Onset | Sakshi
Sakshi News home page

నైరుతి రుతుపవనాలపై ఐఎండీ కీలక ప్రకటన

May 29 2026 4:08 PM | Updated on May 29 2026 4:37 PM

Monsoon Yet To Enter Kerala Despite Forecast Of Early Onset

సాక్షి, హైదరాబాద్‌: ఎల్‌నివో ప్రభావంతో ఐఎండీ అంచనాలు తలకిందులయ్యాయి. నైరుతి రుతుపవనాలు రాక మరింత ఆలస్యమవుతోంది. నెమ్మదిగా కదులుతున్న నైరుతి రుతు పవనాలు... జూన్‌ 4,5 తేదీల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కేరళను తాకిన మూడు రోజుల తర్వాత తెలంగాణలో రుతు పవనాలు ప్రవేశించనున్నాయి.

మే చివరి వారంలో కేరళలోకి  నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ భావించింది. అయితే, ఈ ఏడాది ఇంకా అక్కడ విస్తరించలేదు. ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈ సీజన్‌లో వర్షపాతం తక్కువగా ఉండవచ్చని ఐఎండీ ఇప్పటికే అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రుతు పవనాల రాక ఆలస్యం కావడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం.. రుతుపవన గాలులు అరేబియా సముద్రంలోని చాలా భాగాలు, లక్షద్వీప్ ప్రాంతం, బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోకి మరింత ముందుకు సాగాయి. రుతుపవనాల గమనం ప్రస్తుతం నెమ్మదిగా ఉన్నప్పటికీ.. అవి సహజంగానే మళ్లీ పుంజుకుంటాయని ఐఎండీ పేర్కొంది.

రుతుపవనాల విస్తరణకు ఆటంకం కలిగించిన సముద్ర, వాతావరణ పరిస్థితులు ఇప్పుడు క్రమంగా తొలగిపోతున్నాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడానికి అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం.. రుతుపవనాల వ్యవస్థ నైరుతి అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం మీదుగా మయన్మార్ వరకు విస్తరించి ఉంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో బలపడుతోందని ఐఎండీ వెల్లడించింది.

సాధారణంగా జూన్ 1న ప్రవేశించే రుతుపవనాలు.. ఈసారి దాదాపు ఐదు రోజులు ముందుగానే.. మే 26 నాటికే కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ గతంలో అంచనా వేసింది. అయితే.. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా రుతుపవన గాలులు తాత్కాలికంగా బలహీనపడ్డాయి. కాగా, ప్రస్తుత మందగమనం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. రుతుపవనాలు ఇప్పటికే దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాల్లో విస్తరించాయి. ఇప్పుడు వాయవ్య దిశగా వేగంగా కదులుతున్నాయి. ప్రారంభ అంచనాతో పోలిస్తే స్వల్పంగా ఆలస్యమైనప్పటికీ.. రుతు పవనాల ప్రస్తుత కదలిక సాధారణంగానే ఉన్నాయి.

సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 27 నాటికి రాజధాని ఢిల్లీకి చేరుకుంటాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ఆధారంగా.. జూన్ 25 నుండి 30 మధ్య రుతుపవనాలు ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుత మందగమనం జూన్ మొదటి వారం వరకు కొనసాగకపోతే.. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో రుతుపవనాల గమనం చాలా వరకు సాధారణంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement