సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా భోస్లే ప్రేమపెళ్లి వ్యవహారంలో మరో మలుపు చోటు చేసుకుంది. ఆమె మైనర్ అంటూ భర్త మహ్మద్ ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో అతనికి ఊరట లభించింది. ఫర్మాన్‌ను ఇప్పట్లో అరెస్ట్ చేయడానికి వీల్లేదని కేరళ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
కిందటి ఏడాది ఆరంభంలో జరిగిన ప్రయాగ్‌రాజ్(యూపీ) మహా కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ఓ ఫొటోగ్రాఫర్ కంట పడి ఇంటర్నెట్ సెన్సేషన్‌గా నిలిచింది మధ్యప్రదేశ్‌కు చెందిన మోనాలిసా భోస్లే. మోడలింగ్ అటుపై మూవీ ఆఫర్స్‌తో వార్తల్లోకి ఎక్కింది. అయితే అనూహ్యంగా ప్రేమ పెళ్లి చేసుకుని ఒక్కసారిగా సంచలన చర్చకు దారి తీసింది.
ఇటు మత కోణంలో ఆమె వివాహంపై పెద్ద రచ్చే నడిచింది. అదే సమయంలో తన కూతురు మైనర్ అని పేర్కొంటూ పోలీసులను ఆశ్రయించి బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు మోనాలిసా తండ్రి. దీంతో మైనర్ కిడ్నాప్, బలవంతపు వివాహం నేరాల కింద కేసు నమోదు అయ్యింది. ఈలోపు ఇటు షెడ్యూల్ ట్రైబ్స్ కమిటీ కూడా ఆమెకు 16 ఏళ్లు అని తేల్చింది. దీంతో పోక్సో కేసు నమోదు అయ్యింది.
అయితే ఈ ఆరోపణల్ని ఆ జంట మీడియా సమావేశం పెట్టి మరీ తోసిపుచ్చింది. ఈ జనవరితో 18 ఏళ్లు నిండాయని.. ఇందుకు సంబంధించిన అధికారిక పత్రాలు(ఆధార్‌కార్డ్, బర్త్ సర్టిఫికెట్) కూడా ఉన్నాయని.. ఇష్టపూర్వకంగానే తమ వివాహం జరిగిందని ఆ జంట చెబుతోంది. పెద్దలు కూడా తమ వివాహానికి అంగీకరించారని.. ఆ తర్వాత కొందరి ప్రొద్భలంతో కేసు పెట్టారని మోనాలిసా ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ కోరుతూ కేరళ హైకోర్టులో పిటిషనర్ వేశారు. ఇంతకు ముందు..
మార్చి 23వ తేదీన కేరళ హైకోర్టు అరెస్ట్ విషయంలో తాత్కాలిక ఊరట ఇచ్చింది. అయితే నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు త్వరగతిన తమను అనుమతించాలని మధ్యప్రదేశ్ పోలీసులు కేరళ హైకోర్టును మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఇవాళ మరోసారి గడువును పొడిగించింది. తాజా తీర్పుతో మే 20వ తేదీ దాకా ఫర్మాన్‌ను అరెస్ట్ చేయడానికి వీల్లేకుండా పోయింది. ఈలోపు ఆమె మైనర్ అవునా? కాదా? ఆ వివాహం చెల్లుబాటు అవుతుందా? వాళ్లు సమర్పించినవి సరైన పత్రాలేనా?.. అనే అంశాలపై దర్యాప్తు కొనసాగనుంది.
మిస్సింగ్ కలకలం?
మోనాలిసా కనిపించడం లేదంటూ ఫర్మాన్ ఖాన్ పెట్టిన ఓ వీడియో నిన్నంత వైరల్ అయ్యింది. తామిద్దరం రాజస్థాన్‌కు వెళ్లామని.. అజ్మీర్‌లో ఆమె కనిపించకుండా పోయిందని.. ఆమె కోసం అంతా గాలిస్తున్నానంటూ ఆ వీడియోలో చెప్పాడతను. అయితే.. ఆమె మిస్ కావడం వెనుక ఫర్మాన్ ప్రమేయం ఉండి ఉండొచ్చని మోనాలిసా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గత 15-20 రోజులుగా తమ కూతురు తమతో మాట్లాడడం లేదని.. ఇప్పుడు అదృశ్యం కావడం అనుమానాలకు తావిస్తోందని.. కేసు నుంచి తప్పించుకునేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని.. పోలీసులు ఎలాగైనా ఆమె జాడ కనిపెట్టాలని కోరుతున్నారు.


