బెంగాల్‌లో ‘స్వీట్ల’ రాజకీయం | Modishree, Joy Bangla: Sweets ready for Bengal results 2026 | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో ‘స్వీట్ల’ రాజకీయం

May 4 2026 6:19 AM | Updated on May 4 2026 6:19 AM

Modishree, Joy Bangla: Sweets ready for Bengal results 2026

‘మోదీశ్రీ’, ‘జాయ్‌ బంగ్లా’, ‘లాల్‌ సలాం’... నినాదాలను తలపిస్తున్నాయి కదా! కానీ ఇవన్నీ స్వీట్లు. ఎన్నికల ఫలితాల వేళ.. వివిధ పార్టీల అభ్యర్థుల కోసం బెంగాల్‌ స్వీట్ల తయారీదారులు పెట్టిన మిఠాయిల పేర్లు. ఓట్ల లెక్కింపు కోసం ఓటర్లు, అభ్యర్థులు ఎదురు చూస్తుంటే.. మిఠాయి తయారీదారులు మాత్రం రాజకీయ, సాంస్కృతిక మేళవింపుతో పార్టీలను ప్రతిబింబించే స్వీట్ల తయారీలో నిమగ్నమయ్యారు.  

ఆహారం చుట్టూరా ప్రచారం..  
ఈసారి పశ్చిమబెంగాల్‌ ఎన్నికలు ఆహారం చుట్టూనే తిరిగాయి. నెల రోజులకు పైగా సాగిన ఎన్నికల పోరు చేపలు, జల్మురి వంటి ఆహారం చుట్టే తిరిగింది. చివరికి ఫలితాలు కూడా తినుబండారాలతోనే ముడిపడ్డాయి. అది కూడా బెంగాల్‌కే ప్రత్యేకమైన స్వీట్లతో. ‘మిఠాయిలు బెంగాల్‌ సంస్కృతిలో అంతర్భాగం. ప్రతి సందర్భానికీ తగిన మిఠాయిలు ఉంటాయి. అలాంటప్పుడు ఎన్నికలకు ఎందుకు చేయకూడదు?’అని ప్రశ్నిస్తున్నారు మిఠాయి వ్యాపార సంస్థల యజమానులు. స్వీట్లతో ఫలితాలను వేడుకగా మార్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో తాజా రసగుల్లాలు, సందేశ్‌ల సువాసనతో కోల్‌కతా అంతా ఘుమఘుమలాడుతోంది. ఇక, ఈ ఎన్నికల అసలు విశేషం ఏంటంటే ఆ మిఠాయిల రంగులు, పేర్లు.  

పార్టీల రంగు, నినాదాలు, నాయకుల పేర్లు..  
పార్టీ రంగులు, చిహ్నాలు, నినాదాలు, నాయకుల పేర్లతో కూడిన ప్రత్యేక స్వీట్లను తయారు చేసే పనిలో పడ్డాయి సంస్థలు. కాషాయ రంగు స్వీట్‌కు ‘మోదీశ్రీ’అని, ఆకుపచ్చ రంగు మిఠాయిలకు ‘జాయ్‌ బంగ్లా’అని, గులాబీ, ఎరుపు రంగు వర్ణపు మిఠాయిలకు వామపక్షాల ‘లాల్‌ సలాం’అని పేర్లు పెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోల్‌కతా వచి్చన ప్రధాని మోదీ కాషాయ రంగు కేసర్‌ ఫ్లేవర్‌ ‘సందేశ్‌’రుచి చూశారు. 

ఆ స్ఫూర్తితో కాషాయ రంగు సందేశ్‌కు ‘మోదీశ్రీ’అని పేరు పెట్టారు. ఇక, మరో సందేశ్‌ను నిమ్మకాయ ఫ్లేవర్‌తో, ఆకుపచ్చ రంగులో తయారు చేసి తృణమూల్‌ కాంగ్రెస్‌ నినాదమైన ‘జోయ్‌ బంగ్లా’పేరు పెట్టారు. తమ దుకాణాల్లో ప్రధానంగా రసగుల్లా, రాజ్‌¿ోగ్‌ రకాలను తయారు చేస్తామని ప్రఖ్యాత కేసీ దాస్, నోబిన్‌ చంద్ర దాస్‌ మిఠాయి దుకాణ సంస్థల డైరెక్టర్‌ ధీమన్‌ దాస్‌ అన్నారు. ‘ఆకుపచ్చ, నారింజ, ఎరుపు వెల్వెట్‌ రసగుల్లాలను తయారు చేస్తున్నాం. ఓట్ల లెక్కింపు రోజున డిమాండ్, ట్రెండ్‌ను బట్టి సరఫరా చేస్తాం’అని చెప్పారు.  

తెల్లరసగుల్లాలను రెడీ చేసుకుని..  
రాష్ట్రంలో నెలకొన్న ‘ఫిఫ్టీ–ఫిఫ్టీ’ఛాన్సెస్‌కు అనుగుణంగానే కాషాయం, ఆకుపచ్చ రంగులో రసగుల్లాలు, సందేశ్‌లను తయారు చేస్తున్నారు. ఫలితాల తరువాతే మిఠాయిలు అవసరమవుతాయి. అప్పుడు వేగంగా స్వీట్లను అందించేందుకు తయారీ సంస్థలు ముందు భారీ సంఖ్యలో తెల్ల రసగుల్లాలను తయారు చేసి పెడుతున్నాయి. రంగు రంగుల చక్కెర సిరప్‌లను కూడా సిద్ధంగా ఉంచుతున్నాయి. ఓట్ల లెక్కింపు తరువాత గెలవబోయే అభ్యర్థి పార్టీ రంగును బట్టి అవసరమైన రంగులో రసగుల్లాలను ముంచి సరఫరా చేయనున్నారు. బీజేపీ, తృణమూల్‌ మధ్య హోరాహోరీ పోటీ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సందిగ్ధానికి ఇది అద్దం పడుతోంది.  
        
– కోల్‌కతా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement