మోదీ చెప్పినవి.. మనతో అయ్యే పనేనా?? | Modi's save fuel skip gold WFH call seen tough | Sakshi
Sakshi News home page

మోదీ చెప్పినవి.. మనతో అయ్యే పనేనా??

May 11 2026 9:32 AM | Updated on May 11 2026 10:47 AM

Modi's save fuel skip gold WFH call seen tough

ఏడాది పాటు బంగారం కొనొద్దు.. పెట్రోల్‌, డీజిల్‌ వాడకం తగ్గించండి.. వర్క్‌ ఫ్రమ్‌ హోంకు ప్రాధాన్యం ఇవ్వండి.. కూరల్లో వంటనూనెకు తగ్గించి వాడండి.. విదేశీ ప్రయాణాలు చేయొద్దని.. ఇలా దేశ ప్రధాని నరేం‍ద్ర మోదీ పొదుపు వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ నడుస్తోంది. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభ నేపథ్యంలోనే ఆయన చేసిన సూచనలపై మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో ఇవి అసలు ఆచరణ సాధ్యమేనా? అనేదానిపై ఆర్థిక నిపుణులు స్పందించారు. 

హైదరాబాద్‌ సభలో మోదీ ఏం మాట్లాడారు?..  కరోనా టైంలో అలవాటు అయిన వర్క్‌ ఫ్రమ్‌ హోం, ఆన్‌లైన్‌ మీటింగ్‌ విధానాలను మళ్లీ ఆచరించడం ద్వారా పెట్రోల్ వినియోగం తగ్గించవచ్చు. ఈవీలను ప్రొత్సహిస్తే మరీ మంచిది. బంగారం కొనుగోలు ఒక సంవత్సరం పాటు ఆపితే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చు. ప్రతి కుటుంబం వంటనూనె వినియోగాన్ని తగ్గిస్తే ఆరోగ్యానికి, ఆర్థిక వ్యవస్థకు లాభం. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి.. రైతులు సహజ వ్యవసాయానికి మారితే దిగుమతులపై ఆధారపడకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది అని అన్నారు. 

మోదీ సూచనలు దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా సరైనవని ఆర్థిక నిపుణులు అంగీకరిస్తున్నారు. అదే సమయంలో అవి ఆచరణ సాధ్యమా? అంటే కష్టమేనని అంటున్నారు. మరీ ముఖ్యంగా బంగారం భారతీయ కుటుంబాల్లో ఆర్థిక భద్రతకు ప్రతీక. అలాంటి దానిని ఏడాదిపాటు కొనుగోలు నిలిపివేయడం అనేది భారతీయ సాంప్రదాయాలకు విరుద్ధమని.. ఆచరణలో సాధ్యమయ్యేది కాదని అంటున్నారు. 

ఎనర్జీ నిపుణులు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా పెట్రోల్ వినియోగం తగ్గడం సాధ్యమే. ఇది కొంత వరకు సాధ్యమే. కానీ ఇది ప్రధానంగా ఐటీ రంగం ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. తయారీ, రవాణా రంగాల్లో ఇది అసాధ్యమంటున్నారు. అలాగే రైతులు సహజ వ్యవసాయం వైపు మారడం మంచి ఆలోచనే అయినప్పటికీ.. వాళ్లకు ప్రోత్సాహకాలు, మరింత శిక్షణ అవసరమని.. ప్రభుత్వాలు ఆ భారం భరించే స్థితిలో ఉందా? అని వ్యవసాయ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇక వంటనూనె వినియోగం తగ్గించడంపైనా ఇటు సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇది ఆచరణ సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తు‍న్నారు.  

మోదీ పిలుపు దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా సరైనదే. కానీ ప్రజల జీవనశైలిలో మార్పులు తేవడం సులభం కాదు. దీని కోసం ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అవగాహన కార్యక్రమాలు అవసరం. ఇంధన సంక్షోభం వంటి జాతీయ సమస్యలను ఎదుర్కోవడానికి ప్రజల సహకారం కీలకమని నిపుణులు గుర్తు చేస్తున్నారు. 

పొలిటికల్‌ రియాక్షన్స్‌
మోదీ పొదుపు వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు ఎక్కు పెట్టింది. మోదీ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో చెప్పాలని అంటోంది. ఆయన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయని.. దేశంలో వాస్తవ పరిస్థితులను ప్రజలను వివరించాలని కోరుతోంది. ఇందుకోసం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్‌ చేస్తోంది. దేశ ఇంధన భద్రతను రక్షించడంలో మోదీ విఫలమయ్యారని విమర్శిస్తోంది. ఈ విమర్శలకు బీజేపీ కౌంటర్‌ ఇస్తోంది. మోదీ వ్యాఖ్యలపై కేం‍ద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రశంసలు గుప్పించారు. అది దూరదృష్టితో కూడిన నిర్ణయమని అన్నారాయన. 

Advertisement
 
Advertisement
Advertisement