సాక్షి, న్యూఢిల్లీ: భారత రాజకీయ చరిత్రలో కీలక ఘట్టం నమోదైంది. వరుసగా మూడు సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలో కొనసాగుతున్న నరేంద్ర మోదీ.. అత్యధిక కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నేతగా కొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న 4,398 రోజుల రికార్డును ఇవాళ్టితో అధిగమిస్తూ మోదీ చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు.
2014 మే 26న తొలిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ.. 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ వరుస విజయాలు సాధించి అధికారంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ్టితో ఆయన ప్రధానమంత్రి పదవిలో 4,399 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి నిరవధికంగా అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నాయకుడిగా నిలిచారు.
ఇప్పటివరకు ఈ ఘనత స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉంది. తొలి సాధారణ ఎన్నికల అనంతరం 1952లో ప్రజల తీర్పుతో అధికారంలోకి వచ్చిన నెహ్రూ.. 1964 మే 27న మరణించే వరకు 4,398 రోజుల పాటు ప్రధానిగా కొనసాగారు. ఇప్పుడు ఆ రికార్డును మోదీ అధిగమించారు. ప్రధానమంత్రుల పదవీకాలాల జాబితాలో ఇందిరా గాంధీ 4,077 రోజులతో మూడో స్థానంలో ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 3,652 రోజులు, అటల్ బిహారీ వాజ్‌పేయి 2,272 రోజులు, పి.వి. నరసింహారావు 1,827 రోజులు ప్రధానమంత్రులుగా కొనసాగారు.
ఇదిలా ఉండగా, మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అదే సమయంలో ఆయన సుదీర్ఘకాలం దేశ ప్రధానిగా సేవలందించిన వ్యక్తిగా నిలిచారు. ఈ క్రమంలో ఆయనకు సన్మానం చేయాలని ఎన్డీయే పక్షాలు భావిస్తున్నాయి.
శుభాకాంక్షల వెల్లువ
నరేంద్ర మోదీ రికార్డు నేపథ్యంలో ప్రపంచ దేశాల నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయక ఈ ఘట్టాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం తన నాయకత్వంపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనంగా అభివర్ణించగా, పాపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్ మారాపే మోదీని ఆదర్శ నాయకుడిగా కొనియాడారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమ్లా ప్రసాద్-బిసెస్సర్ సైతం మోదీ హయాంలో భారత్ ప్రపంచ వ్యవహారాల్లో ప్రభావవంతమైన స్వరంగా ఎదిగిందని పేర్కొన్నారు. గత దశాబ్దంలో భారత్‌ను ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడం, గ్లోబల్ సౌత్‌కు ప్రధాన ప్రతినిధిగా ఎదగడం, అంతర్జాతీయ దౌత్య వేదికలపై కీలక శక్తిగా మారడం వంటి పరిణామాలు మోదీ నాయకత్వంలో సాధ్యమయ్యాయని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. దీంతో మోదీ సాధించిన ఈ మైలురాయి కేవలం దేశీయ రాజకీయ ఘట్టమే కాకుండా.. ప్రపంచ వేదికపై భారత్ పెరుగుతున్న ప్రాధాన్యానికి ప్రతీకగా నిలిచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


