సవాళ్లకు తగ్గట్టుగా సంసిద్ధం కావాలి
ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడి
న్యూఢిల్లీ: ఆధునిక యుగంలో యుద్ధరీతుల్లో పెనుమార్పులు వస్తున్నాయని భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది చెప్పారు. బాంబులు, తూటాలు లాంటి భౌతికమైన బలంతో సంబంధం లేని యుద్ధాలు మొదలయ్యాయని అన్నారు. శత్రువును కంటితో చూడకుండానే అంతం చేసే సాంకేతికత వచ్చిందని తెలిపారు. ఇప్పటియుద్ధాలకు సైనిక బలంతోపాటు మేధస్సు, టెక్నాలజీ, నైతిక సంసిద్ధత అవసరమవుతున్నాయని వివరించారు.
సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ 150వ జయంతి సందర్భంగా శుక్రవారం ఢిల్లీలోని మానెక్‌షా సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉపేంద్ర ద్వివేది ప్రసంగించారు. ఇతర దేశాలకు లేని సానుకూలతలు మనకు ఉన్నాయని తెలిపారు. యువ జనాభా అధికంగా ఉండడం మన బలమని పేర్కొన్నారు. మారుతున్న యుద్ధ రీతులకు అనుగుణంగా మన సంసిద్ధం కావాలని స్పష్టంచేశారు.
నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, యుద్ధ వ్యూహాలు మార్చుకోవాలని వెల్లడించారు. సంప్రదాయ శత్రువులు మనకు ఉన్నారని గుర్తుచేశారు. ఉగ్రవాదం, అంతర్గత సమస్యలు సవాళ్లు విసురుతున్నాయని ఉద్ఘాటించారు. దేశంలో సామాజిక నిర్మాణాన్ని దెబ్బతీస్తున్న తప్పుడు సమాచారం వ్యాప్తిని కచ్చితంగా అరికట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలో ఘర్షణలు సృష్టించాలన్న లక్ష్యంతో తప్పుడు ప్రచారం సాగుతోందని వెల్లడించారు.
ఇప్పుడు యుద్ధం అనేది క్షేత్రస్థాయిలో కాకుండా.. ఫైబర్ కేబుళ్ల ద్వారా జరుగుతోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ భద్రతతోపాటు దేశ నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఉపేంద్ర ద్వివేది స్పష్టంచేశారు. దేశ భద్రతలో ప్రభుత్వం, పౌర సమాజం పాలుపంచుకోవాలని సూచించారు. దేశ భద్రత అనేది కేవలం సైన్యం, సరిహద్దులకు సంబంధించిన అంశం కాదని.. అది ప్రజలకు సంబంధించిన అంశమని తేలి్చచెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, కల్నల్ సోఫియా ఖురేషీ తదితరులు పాల్గొన్నారు.


