
పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్
ఇంకొన్ని రోజులు కొనసాగింది
ప్రకటించిన భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది
సైనిక, వాయు, నావికాదళాల సమష్టి సమరవిధానం కోసం వేచిచూస్తున్నామని వ్యాఖ్య
న్యూఢిల్లీ: ధూర్తదేశం పాకిస్తాన్‌తో ‘ఆపరేషన్ సిందూర్’పేరిట భారత మొదలెట్టిన పోరు కేవలం మూడ్రోజుల్లో ముగిసిపోలేదని భారత్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రకటించారు. ఢిల్లీలోని మాణిక్‌షా సెంటర్‌లో జరిగిన ‘‘ఆపరేషన్ సిందూర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్‌సైడ్ పాకిస్తాన్’’పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ద్వివేది పాల్గొని ప్రసంగించారు.
‘‘మే 7వ తేదీ తెల్లవారుజామున భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట ముష్కరమూకల స్థావరాలను నేలమట్టంచేసింది. వెనువెంటనే పాక్ డ్రోన్ల దండుతో దండెత్తింది. వాటిని మన బలగాలు నేలమట్టం చేశాయి. తర్వాత పాక్ వైమానికి స్థావరాలను మన క్షిపణులు నాశనం చేశాయి. ఇదంతా మే 10వ తేదీన ముగిసిపోయిందని అంతా భావిస్తున్నారు. ఇందులో కొంతే నిజముంది.
నిజానికి మే 10వ తేదీ తర్వాత సైతం ఆపరేషన్ సిందూర్ కొన్ని రోజులపాటు కొనసాగింది. అయితే ఆ కాలంలో దాడులు చేశా మా లేదంటే ప్రతిదాడులు జరిగాయా అనేది చెప్పకూడదు. కానీ ఈ పోరు పరిసమాప్తికి ఎన్నో దశలను దాటాల్సి వచ్చింది. ఇరు దేశాల మధ్య ఎన్నో సంప్రదింపులు జరిగాయి. ఇవన్నీ ఇప్పుడు నేను బయటపెట్టలేను.
ఈ పుస్తకం మన సైనిక ఆపరేషన్ జరిగిన విధానాన్ని మాత్రమేకాదు మన సైనికుల ధైర్యం, వృత్తి నిబద్ధత, అసాధారణ స్ఫూర్తిగాధలకు దర్పణంపడుతుంది’’అని ద్వివేది అన్నారు. ‘‘ఆపరేషన్ సిందూర్‌లో తనవంతుగా అద్వితీయ పాత్ర పోషించిన నాటి లెఫ్ట్‌నెంట్ జనరల్ ధిల్లాన్ సేవలను మరువలేము.
వాస్తవా«దీన రేఖ వెంట యుద్ధమంటూ వచ్చిందంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయి, మన భావోద్వేగాలు ఎటు పోతున్నాయి, లాభనష్టాలు ఇలాంటివేవీ బేరీజు వేసుకునే సమయం ఉండదు. సవాళ్లను ఎదుర్కోవడంపై మాత్రమే ఆర్మీ దృష్టిపెడుతుంది. అందుకే ఆపరేషన్ సిందూర్ అనేది ఎవరికీ సరిగా, స్పష్టంగా తెలియని కథే’’అని ఆయన అన్నారు.
కీలక థియేటరైజేషన్‌పై..
‘‘ఏదైనా యుద్ధం వంటి ఆపత్కాలంలో ఆర్మీ, వాయుసేన, నావికాదళాలు ఎవరికిచ్చిన బాధ్యతల్లో వాళ్లు తలమునకలవుతారు. ఇలా వేర్వేరు బాధ్యతలు కాకుండా సమష్టిగా అత్యంత కచ్చితత్వంతో సమన్వయంతో ఒకే యుద్ధం, ఆపరేషన్‌లో పాల్గొని విజయకేతనం ఎగరేసేందుకు ఏకీకృత సమన్వయ వేదిక(థియేటరైజేషన్) అవసరం.
ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ శక్తిసామర్థ్యాల సమష్టి కలయికగా థియేటరైజేషన్‌ను చెప్పొచ్చు. ఇది వీలైనంత త్వరగా ఆచరణ సాధ్యం కోసం ప్రయతి్నస్తున్నాం. ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని నేను కూడా ఆత్రంగా వేచిచూస్తున్నా. ఇందుకోసం కొన్ని విభాగాల విలీనం వంటివి అవసరం. ఇవిగాన యుద్ధం విస్తృతస్థాయిలో వస్తే మరిన్ని ఏజెన్సీలను కలుపుకునిపోయి పనిచేయాల్సి ఉంటుంది.
త్రివిధ దళాలకు తోడు బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, ఇస్రో, సివిల్ డిఫెన్స్, సివిల్ ఏవియేషన్, రైల్వే, ఎస్‌సీసీ, కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతో సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. ఇలా అన్ని ఏజెన్సీలతో కలిసి పనిచేయడం ఒక్క థియేటరైజేషన్‌తోనే సాధ్యం. మారుతున్న అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, పొరుగు దేశాలతో పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో థియేటరైజేషన్ అనేది తప్పనిసరి’’అని ద్వివేది వ్యాఖ్యానించారు.