BMI: బీఎంఐతో ఆందోళన వద్దు.. నిపుణుల కీలక సూచన

Medical Experts Advices On BMI In The Body - Sakshi

బీఎంఐ... బాడీ మాస్‌ ఇండెక్స్‌.. ఈ నంబరు పెరిగితే అనారోగ్యమని నమ్ముతూ, భయపడుతూ బతుకుతున్నాం! అయితే ఆరోగ్యాన్ని బీఎంఐ ఆధారంగా అంచనా వేయడం సరికాదంటున్నారు నిపుణులు. ఆరోగ్యం గురించి ప్రాథమిక అవగాహన కల్పించే పలు కొలతల్లో బీఎంఐ ఒకటి మాత్రమేనంటున్నారు... 

నంబర్లు మనిషి జీవితాన్ని శాసించే స్థితికి వచ్చాయి. అటు చదువు నుంచి ఇటు ఆరోగ్యం వరకు జీవితమంతా నంబర్లాటతోనే సరిపోతోంది. సోషల్‌ మీడియా పుణ్యమా అని ఆరోగ్యంగా ఉండాలంటే ఇన్ని కేలరీల భోజనం చేయాలి, ఇన్ని అడుగులు నడవాలి, ఇన్ని గంటలు పడుకోవాలి అంటూ ప్రతి ఒక్కరిలో జ్ఞానం పెరిగిపోయింది. ఉరుకులు పరుగుల జీవితంలో శరీరంపై శ్రద్ధ పెట్టేందుకు సమయం సరిపోనివాళ్లంతా ఇలాంటి నంబర్లను నమ్ముకొంటున్నారు. రోజుకు ఎన్ని అడుగులు నడిచాం, హృదయ స్పందన రేటు ఎలాఉంది, ఆక్సిజన్‌ స్థాయి ఎంత, ఎంతసేపు నిద్రించాం.. అనేవి లెక్కించడానికి స్మార్ట్‌ డివైజ్‌లు అందుబాటులోకి వచ్చాయి.

వీటితో ప్రతిఒక్కరం తెలియకుండానే నంబర్ల రేసులో పరిగెడుతున్నాం. ఇలాంటి నంబర్లలో అందరినీ బెంబేలెత్తించేది బీఎంఐ.. బాడీ మాస్‌ ఇండెక్స్‌. సింపుల్‌గా చెప్పాలంటే మీ ఎత్తుకు మీరెంత బరువుండాలో చెప్పే కొలత. ఇది కాస్త ఎక్కువైతే మనిషి పడే ఆరాటం అంతా ఇంతాకాదు.   కానీ తాజా పరిశోధనలు మాత్రం బీఎంఐకి అంత సీన్‌ లేదంటున్నాయి. అసలు దీన్ని ఆరోగ్యంతో లింకు పెట్టి చూసే ధోరణి మానుకోవాలంటున్నారు పరిశోధకులు. ఇది అనేక ప్రాథమిక కొలతల్లో ఒకటని చెబుతున్నారు. 
ప్రభుత్వానికి సాయం కోసం 

బీఎంఐ అనే భావనను 1832 సంవత్సరంలో బెల్జియన్‌ గణాంకవేత్త లాంబెర్ట్‌ అడోల్ఫ్‌ క్విటెలెట్‌ రూపొందించారు. అప్పటి ప్రభుత్వానికి దేశ జనాభాలో అధిక బరువున్నవారి జనాభాను గుర్తించేందుకు క్విటెలెట్‌ ఈ బీఎంఐకి రూపకల్పన చేశారు. తర్వాత రోజుల్లో మనుషుల బరువు ఆధారంగా వారి బీమా ప్రీమియం లెక్కించేందుకు అవసరమైన సులభమైన కొలత అమెరికా బీమా కంపెనీలకు కావాల్సివచ్చింది. ఈ కంపెనీలు జనాభాలో సగటు బరువును లెక్కించేందుకు అనేక అశాస్త్రీయ పద్ధతులు వాడేవి. వీటితో విసుగొచి్చన యాన్సెల్‌ కీస్‌ అనే డాక్టరు దాదాపు 7వేల మందిపై క్విటెలెట్‌ సమీకరణంతో ప్రయోగం చేశారు. ఈ సమీకరణంతో సగటు జనాభా బరువు కనుక్కోవడం సులభమని గుర్తించి దీనికి బీఎంఐ (బాడీ మాస్‌ ఇండెక్స్‌) అని నామకరణం చేశారు. తర్వాత రోజుల్లో మనిషి బరువు పెరిగితే అనారోగ్యమని గుర్తించడంతో పలువురు డాక్టర్లు తమ పేషెంట్ల సాధారణ ఆరోగ్య సూచీగా బీఎంఐని వాడడం ఆరంభించారు. ప్రస్తుతం డాక్టర్ల నుంచి జిమ్‌ ట్రైనర్ల వరకు అంతా దీన్ని నమ్ముకొని ఆరోగ్యంపై అంచనాలు వేస్తున్నారు.  

అదే ఫైనల్‌ కాదు.. ఎందుకంటే? 
బీఎంఐ ఎక్కువున్నంత మాత్రాన అనారోగ్యంతో ఉన్నట్లు భావించవద్దని తాజా పరిశోధనలు సూ చిస్తున్నాయి. ఆరోగ్యంగా ఉన్నామనేందుకు బీఎం ఐ గుర్తించని కొన్ని అంశాలున్నాయంటున్నాయి.  
- బీఎంఐలో బీఎఫ్‌పీ (బాడీ ఫ్యాట్‌ పర్సెంటేజ్‌– శరీరంలో కొవ్వు శాతం) లెక్కింపు ఉండదు. ఇది కేవలం శరీర బరువును సూచించే కొలత మాత్రమే! అయితే అనారోగ్యమనేది బరువు వల్ల కాదు, శరీరంలోని కొవ్వు వల్ల వస్తుందని గుర్తించాలి. బీఎంఐ కొవ్వుకు, కండకు తేడాను గుర్తించదు. ఉదాహరణకు ప్రఖ్యాత అథ్లెట్‌ ఉసేన్‌ బోల్ట్‌ బీఎంఐ ఓవర్‌వెయిట్‌ రేంజ్‌లో, ప్రముఖ ఫుట్‌బాల్‌ ఆటగాడు టామ్‌ బ్రాడీ బీఎంఐ ఒబేస్‌ రేంజ్‌లో ఉన్నాయి. వీరిలో కొవ్వుకు, కండకు తేడాను బీఎంఐ గుర్తించకపోవడమే ఇందుకు కారణం. 
- శరీరంలో బాడీ ఫ్యాట్‌ డిస్ట్రిబ్యూషన్‌ (శరీరంలో కొవ్వు వ్యాప్తి)ని కూడా బీఎంఐ లెక్కించదు. శరీరంలో అన్ని కొవ్వు పదార్థాలు ఒకటి కాదు, వీటిలో చెడువి, మంచివి ఉంటాయి. ఉదాహరణకు పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉన్నవారి బీఎంఐ, తుంటి వద్ద కొవ్వు ఎక్కువగా ఉన్నవారి బీఎంఐ అధికంగానే ఉంటాయి. కానీ వీరిలో పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువున్నవారు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు అధికం.  
- బీఎంఐ జనాభా వైరుద్ధ్యాలు గుర్తించదు. ఆంగ్లోశాక్సన్లను ఉదాహరణగా తీసుకొని క్విటెలెట్‌ ఈ సమీకరణం రూపొందించారు. కానీ ప్రకృతి సహజంగా ఆయా భౌగోళిక ప్రాంతాల్లో మనుషుల మధ్య వైరుద్ధ్యాలు సహజం.  ఉదాహరణకు ఆసియా జనాభాలో బీఎంఐ పెరిగితే అనారోగ్యం పాలయ్యే అవకాశాలున్నాయి, కానీ పాలినేసియన్‌ జనాభాలో(పసిఫిక్‌ సముద్రంలోని కొన్ని దీవుల సముదాయాన్ని పాలినేసియా అంటారు) అధిక బీఎంఐ ఉన్నా ఆరోగ్యంగానే ఉంటారు.  అందువల్ల బీఎంఐ అనేది ఆరోగ్యానికి సింగిల్‌ సూచిక కాదని, అనేక ప్రాథమిక కొలతల్లో ఇదిఒకటని నిపుణులు నిర్ధారిస్తున్నారు.

మీ బీఎంఐ ఓవర్‌వెయిట్‌ లేదా ఒబేస్‌ రేంజ్‌లో ఉన్నా మీరు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. అంతమాత్రాన పూర్తిగా దీన్ని నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం కూడా లేదు. బీఎంఐ బాగా ఎక్కువుంటే ఇతర పరీక్షలు (లిపిడ్‌ ప్రొఫైల్‌ తదితరాలు) చేయించుకొని ఆరోగ్యంపై నిర్ధారణకు రావాలి. అంతేకానీ బీఎంఐ ఎక్కువైందన్న కంగారులో అనవసర డైట్‌ పద్ధతులు పాటించి కొత్త అనారోగ్యాలు కొనితెచ్చుకోవద్దన్నది నిపుణుల సలహా.  

ఇలా లెక్కిస్తారు.. 
ఆన్‌లైన్‌లో బీఎంఐని లెక్కించేందుకు పలు ఉచిత అప్లికేషన్లున్నాయి. బీఎంఐ లెక్కించేందుకు మీ బరువు, ఎత్తు తెలిస్తే చాలు! బరువును కిలోల్లో, ఎత్తును మీటర్లలో అప్లికేషన్‌లో ఎంటర్‌ చేస్తే మీ బీఎంఐ ఎంతో సెకన్లలో తెలుస్తుంది. బీఎంఐ 18.5 కన్నా తక్కువుంటే అండర్‌వెయిట్‌ (ఉండాల్సినదాని కన్నా తక్కువ బరువు), 18.5– 24.9 ఉంటే నార్మల్, 25– 29.9 ఉంటే ఓవర్‌వెయిట్‌ (ఉండాల్సినదాని కన్నా అధిక బరువు), 30పైన ఉంటే ఒబేస్‌ (ఊబకాయం)గా వర్గీకరిస్తారు.   
– నేషనల్‌ డెస్క్‌, సాక్షి 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top