
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో విచిత్ర వేధింపుల ఘటన చోటుచేసుకుంది. తన భర్త, అత్తామామలు తనను రోజూ మూడు గంటల పాటు వ్యాయామం చేయాలంటూ ఒత్తిడి తెస్తారని, కాదంటే తనకు ఆహారం పెట్టరని బాధితురాలు పోలీసుల ముందు వాపోయింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన షాను(25) తన భర్త స్త్రీలోలుడని, ఇంటర్నెట్‌లో మహిళల అనుచిత వీడియోలను చూస్తుంటాడని ఆరోపించింది. బాలీవుడ్ భామ నోరా ఫతేహీలా ఉండాలంటూ తనను వేధిస్తుంటాడని తెలిపింది. అధిక వ్యాయామం కారణంగా తనకు గర్భస్రావం అయ్యిందని ఆమె వాపోయింది. 2025, మార్చి 6న షానుకు శివం ఉజ్జ్వల్‌ో వివాహం జరిగింది. షాను కుటుంబం ఈ వివాహం కోసం రూ. 76 లక్షలకు పైగా మొత్తాన్ని ఖర్చు చేసింది. కట్నం కింద రూ. 16 లక్షల విలువైన నగలు, రూ. 24 లక్షల విలువైన మహీంద్రా స్కార్పియో, రూ. 10 లక్షల నగదు ఇచ్చారు.
అత్తవారింటిలోకి అడుగుపెట్టిన షాను అక్కడ పలు ఇబ్బందులను ఎదుర్కొంది. షాను అత్త ఆమెను నిత్యం ఇంటి పనుల్లో బిజీగా ఉంచేది. శివంతో బయటకు వెళ్లేందుకు అనుమతించేదికాదు. ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అయిన శివం ఒకరోజు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, షాను మంచానికి దోమతెర అమర్చకపోవడంతో షానును అక్కడే వదిలేసి తన తల్లిదండ్రుల గదిలోనికి వెళ్లిపోయాడు. తరువాత అత్తమామలు ఆమెను తీవ్రంగా నిందించగా, భర్త ఆమెను కొట్టాడు. తాను అందంగానే ఉన్నప్పటికీ బాడీ షేమింగ్‌కు గురయ్యానని అమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లోని మహిళల అభ్యంతరకరమైన వీడియోలను చూస్తుంటాడని ఆమె పేర్కొంది.
బాలీవుడ్ భామ నోరా ఫతేహి లాంటి శరీరం కోసం తనచేత ప్రతిరోజూ మూడు గంటల పాటు వ్యాయామం చేయించేవాడని, ఏదైనా కారణంతో ఒక రోజు వ్యాయామం మానివేస్తే ఆహారం పెట్టేవారి కాదని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. శివం అతని తల్లిదండ్రులు తరచూ నగదు, భూమి, నగలు డిమాండ్ చేస్తుంటారని షాను పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.