‘అమర్త్యసేన్‌ ఇంటిని కూలుస్తామంటే ఊరుకోం’

Mamata Banerjee Challange Visva Bharati Amartya Sen Bulldozer Plot - Sakshi

కోల్‌కతా:  బుల్డోజర్‌ రాజకీయం పశ్చిమ బెంగాల్‌కు చేరింది. ఆర్థికవేత్త.. నోబెల్‌ గ్రహీత, భారతరత్న అమర్త్యసేన్‌(89) ఇంటిని బుల్డోజర్‌లతో కూల్చేస్తామంటూ విశ్వభారతి సెంట్రల్‌ యూనివర్సిటీ నోటీసులు జారీ చేసింది. అయితే.. ఆ నోటీసులకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంతే ఘాటుగా స్పందించారు. అలాంటి ప్రయత్నమే జరిగితే.. అడ్డుకునే యత్నంలో బుల్డోజర్‌ ముందుర ముందు తానే కూర్చుంటానంటూ ప్రకటించారామె. 

సేన్‌పై ప్రతీరోజూ దాడి జరుగుతోంది. కానీ, వాళ్లు(కేంద్రాన్ని ఉద్దేశించి..) మాత్రం వేడుక చూస్తున్నారు.  ఆయన ఇంటిని ఎలా కూలుస్తారో నేనూ చూస్తా. అదే ప్రయత్నం జరిగితే.. అక్కడికి వెళ్తా. ధర్నాతో ఆ ప్రయత్నాన్ని అడ్డుకునే మొదటి వ్యక్తిని నేనే అవుతా. బుల్డోజరా? మానవత్వమా? ఏది శక్తివంతమైందో తేల్చుకుంటా.. అని ఆమె వ్యాఖ్యానించారు. 

👉 శాంతినికేతన్‌లో అమర్త్య సేన్‌ కుటుంబ సభ్యులుగా తరతరాలుగా ఉంటున్న నివాసం ‘ప్రతీచి’ ఉంది.  ఆయన కుటుంబం తరతరాలుగా నివసిస్తోంది. అంతేకాదు.. ఆ ఇల్లు సేన్‌ తండ్రి అశుతోష్‌ పేరు మీదే ఉండేది. సేన్‌ తల్లిదండ్రులు మరణించాక.. అది ఆయన పేరు మీదకు బదిలీ అయ్యింది.  అయితే.. అందులో అక్రమంగా కొంత స్థలాన్ని ఆక్రమించారని విశ్వభారతి యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. 

👉 ఈ ఏడాది జవనరిలో ప్రతీచికి చెందిన 6,600కు పైగా గజాల స్థలానికి చెందిన అధికారిక పత్రాలను స్వయంగా సీఎం మమతా బెనర్జీనే శాంతినికేతన్‌లో సేన్‌ను కలసి అందించారు. అంతేకాదు.. ఆ స్థలం సేన్‌ కుటుంబానికే చెందుతుందని దీదీ కరాకండిగా చెబుతున్నారు.

👉 600 గజాల యూనివర్సిటీ జాగానే ఆయన ఆక్రమించారనేది విశ్వ భారతి యూనివర్సిటీ వాదన.   ఈ మేరకు మే 6వ తేదీలోగా ఖాళీ చేయాలని, లేకుంటే బలవంతంగా ఖాళీ చేయించి ఆక్రమిత ప్రదేశంలో ఉన్న కట్టడాల్ని కూల్చేస్తామని విశ్వ-భారతి ఆయనకు హెచ్చరికలు జారీ చేసింది. 

👉 ఆపై ఆయన్ని వివరణలు కోరుతూ.. ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి వరుసగా మూడుసార్లు నోటీసులు అంటించింది. దీంతో ఆయన స్పందించారు. 

👉 అది తమ వారసత్వ నివాసమని, అందులో ఎలాంటి ఆక్రమిత స్థలం లేదని అమెరికా ఉన్న అమర్త్య సేన్‌ సైతం యూనివర్సిటీకి తాజాగా బదులు లేఖ రాశారు. 1943 నుంచి ఆ ప్రాంతం మా కుటుంబంతోనే ఉంది. ఆపై చుట్టుపక్కల కొంత స్థలం కొనుగోలు చేశాం. నా తల్లిదండ్రుల మరణానంతరం అది నా పేరు మీదకు వచ్చింది. జూన్‌లో నేను శాంతినికేతన్‌కు వస్తా. పూర్తి వివరాలు సమర్పిస్తా అని లేఖలో(మెయిల్‌) యూనివర్సిటీకి తెలియజేశారు.    

👉 మరోవైపు ఈ వ్యవహారంపై ప్రతీచి కేర్‌టేకర్‌ గీతికాంతా మజుందార్‌.. కోర్టుకు ఆశ్రయించారు. దీంతో..  జూన్‌ 6వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని.. భీర్బూమ్‌ ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ స్టేటస్‌ కో ఆదేశాలు ఉన్నాయి. దీంతో అక్కడ పోలీసుల పహారా ఉంటోంది. కాబట్టి, కూల్చివేతకు తాము అనుమతించబోమని జిల్లా అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ యూనివర్సిటీ మాత్రం స్థలాన్ని స్వాధీనం చేసుకుని తీరతామని అంటోంది. 

👉 కానీ, సేన్‌ వివరణ తీసుకున్నాక కూడా తాజాగా.. మే 6వ తేదీలోపు ఖాళీ చేయాలనే డెడ్‌లైన్‌ విధించింది యూనివర్సిటీ. లేకుంటే బలవంతంగా ఖాళీ చేయించి.. బుల్డోజర్‌లతో కూల్చేస్తామని హెచ్చరించింది. 

👉 తాజాగా సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై.. వర్సిటీకి చెందిన ఉన్నతాధికారులు స్పందించడం లేదు. అయితే.. ప్రతీచి ప్లాట్‌లో ఆక్రమించుకున్న భాగాన్ని మాత్రం స్వాధీనపర్చుకుని తీరతామని ఓ యూనివర్సిటీ అధికారి పేర్కొన్నారు. ప్రతీచికి వాయవ్యంలో మూలన 600 గజాలను ఆక్రమించుకున్నారు. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. కాబట్టి, ఆ స్థలానికి గనుక స్వాధీనం చేసుకోవాలనుకుంటే..  బౌండరీ ఫెన్సింగ్‌ను పగలకొట్టి అక్కడ ఇనుప కంచె వేయాలనుకుంటున్నాం అని ఓ అధికారి పేర్కొన్నారు. 

👉 ఈ వ్యవహారంలో విశ్వభారతి తీరుపై మేధావులు మండిపడుతున్నారు. ఇది పూర్తి రాజకీయ వ్యవహారం. సేన్‌ను వేధించడానికి బీజేపీ విశ్వభారతి యూనివర్సిటీని ఓ పావుగా వాడుకుంటోంది. ఈ క్రమంలోనే.. ఆయన నివాసం ప్రతీచి ముందర డ్రామా నడిపించేందుకు సిద్ధమైంది. బుల్డోజర్‌ రాజకీయాలు సరికాదు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదీ చదవండి: చిన్నమ్మా.. ఎవరీ జ్యోతిష్కుడు?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top