'వైద్య నిపుణుల సూచనలతో బడులు ప్రారంభిస్తాం'

Maharashtra Schools Reopen from Next Week?: Minister Varsha Gaikwad - Sakshi

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి వర్షా గైక్వాడ్‌ వెల్లడి 

సాక్షి, ముంబై: వైద్య నిపుణులు ఇచ్చే సూచనలు సలహాల మేరకు రాష్ట్రంలో తిరిగి బడులు ప్రారంభించే యోచనలో ఉన్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్‌ పేర్కొన్నారు. బడుల పునఃప్రారంభంపై ఇప్పటికే ఓ ప్రతిపాదనను రూపొందించినట్లు ఆమె బుధవారం విలేకరులకు వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న కరోనా కేసుల తాజా పరిస్థితులపై ఒక నివేదిక రూపొందించినట్లు ఆయన తెలిపారు. వాటిని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు పంపించామని, త్వరలో సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నట్లు వెల్లడించారు.  

ముంబైతోపాటు రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు పెరగడంతో ఫిబ్రవరి 15వ తేదీ వరకు పాఠశాలలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ, పాఠశాలలు పూర్తిగా మూసి ఉంచాలని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో అసంతృప్తి, వ్యతిరేకత వాతావరణం నెలకొంది. అంతేగాకుండా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోషల్‌ మీడియాలో సందేశాలు వైరల్‌ అవుతున్నాయి. శుభకార్యాలకు, మాల్స్, థియేటర్లలో 50% అనుమతిస్తున్నారు. కానీ, పాఠశాలలు తెరిస్తే విద్యార్థులకు కరోనా సోకుతుందని మూసి ఉంచడం సమంజసం కాదని, విద్యార్థులు నష్టపోతున్నారని సందేశాలు వైరల్‌ అవుతున్నాయి. అలాగే పాఠశాలలు పూర్తిగా మూసి ఉంచే బదులు ఒక ప్రణాళిక ప్రకారం తెరవాలని ఉపాధ్యాయులు కూడా డిమాండ్‌ చేస్తున్నారు.  

చదవండి: (ప్రముఖ క్రిమినల్‌ లాయర్‌ శ్రీకాంత్‌ షివాడే కన్నుమూత)

రెండు నెలల కిందట కరోనా తగ్గుముఖం పట్టడంతో విద్యావేత్తలు, నిపుణుల సలహాల ప్రకారం అప్పట్లో పాఠశాలలు తెరిచామని వర్షా తెలిపారు. కానీ, గత పక్షం రోజుల కిందట కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరగడంతో మూసివేయాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం రోగుల సంఖ్య మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతోంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల సంఘటనలతో చర్చించామని, ఆ సమయంలో వారు ఒక నివేదక అందజేశారని వర్షా వెల్లడించారు.

పాఠశాలలు ప్రారంభించాల్సిందేనని అనేక మంది డిమాండ్‌ చేశారని తెలిపారు. దీంతో రోగుల సంఖ్య ఎక్కడెక్కడ తక్కువగా ఉందో అక్కడ పాఠశాలలు తెరిచేందుకు స్థానిక అధికారులకే అధికారమివ్వాలని ప్రతిపాదించామని, ఆ మేరకు ముఖ్యమంత్రికి నివేదిక అందజేశామని పేర్కొన్నారు. పాఠశాలలు ప్రారంభించాలనే ఉద్ధేశం తమకు కూడా ఉందని, ప్రస్తుతం 15–18 ఏళ్లలోపు పిల్లలకు కరోనా టీకా డోసు వేసే ప్రక్రియకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలకు వచ్చే విద్యార్థులతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది కూడా రెండు టీకాలు తీసుకుని విధుల్లో చేరేలా సూచనలిస్తున్నట్లు వర్షా స్పష్టం చేశారు. లేదంటే పరిస్థితి మొదటికే వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top